Monday 28 January 2019

మనది కానిది / పరుల సొమ్ము పాము వంటిది

ఒక రోజు బుద్ధుడు శిష్యులతో కలిసి ఒక పొలం గట్టు మీదుగా వెళ్తున్నాడు.దారిలో ఒక చెట్టు పక్కన ఒక భిక్షువుకి ఒక డబ్బు మూట కనిపించింది.ఆ భిక్షువు - భగవాన్ ఇదిగో ధనం మూట అని చూపించాడు.

" నాయనా, అది ఒక కాలసర్పంలాంటిది.దాని జోలికి వెళ్ళొద్దు,ఇటు వచ్చేయ్ అని వెళ్ళిపోయాడు.మిగిలిన భిక్షువులు ఆ మూటకి కాస్త దూరం జరుగుతూ ఆయన వెంట వెళ్ళిపోయారు.కొద్దిదూరంలో ఉన్న ఒక బాటసారి ఈ తతంగమంతా చూస్తున్నాడు.

వీరికి అక్కడ పామేదో కనిపించినట్లుంది,ఉట్టి పిరికి వాళ్ళలా ఉన్నారు అంతమంది ఉండి కూడా దానిని ఏమీ చేయలేక తప్పుకుని పారిపోతున్నట్లున్నారు అనుకుంటూ అక్కడికి వచాడు.తీరా వచ్చి చూస్తే అక్కడ డబు మూట ఉంది.దాన్ని చేతుల్లోకి తీసుకుని ,వీళ్ళు పిరికివాళ్ళే కాదు,వెర్రిబాగులవాళ్ళలాగా ఉన్నారు,లేకపోతే దీనిని చూసి పాముని చూసినట్లు పరుగులు పెడుతున్నారు.అనుకుంటూ మూటవిప్పి డబ్బు లెక్కపెట్టుకుంటున్నాడు.నిజానికి అసలు జరిగిందేమిటంటే  ఆ ముందు రోజు రాత్రి రాజు వద్ద పనిచేసే అధికారి ఇంట్లో దొంగలు పడి చాలా ధనాన్ని దోచుకుపోతూ ,ఈ చెట్టుకింద మూటల్ని లెక్కపెట్టుకున్నారు.చీకట్లో ఒక మూట జారి పక్కన పడిపోయింది. ఇది గమనించకుండా వారు వెళ్ళిపోయారు.తెల్లవారగానే ఆ అధికారి ,దొంగలను వెతుక్కుంటూ ఇటుకేసి వచ్చాడు ,అతను వచ్చే సమయానికి ఈ బాటసారి మూటలోని ధనాన్ని లెక్కపెట్టుకుంటూ కనిపించాడు.ఇతడే ఆ దొంగతనం చేసాడని భావించి అతణ్ణి బాగా తన్ని రాజు గారి దగ్గరకు లాక్కుపోయాడు.ఇదీ కథ.

పరుల సొమ్ము పామువంటిది అనే నానుడి ఇలా పుట్టింది.అందుకే బుద్ధుడు ఇతరులు ఇవ్వకుండా నీకు దొరికింది కూడా నీది కాదు,అదీ ఒకరకంగా దొంగతనమే అని తన శిష్యులకు చెప్పాడు.అంటే నీ శ్రమ కానిది నీది కాదు.మరొకరు దానంగా ఇవ్వనిదేదీ నీది కాదు అని దాని అర్థం

 - బుద్ధుని పంచశీల నుంచి -

Thursday 24 January 2019

యక్ష ప్రశ్నలు - ధర్మరాజు జవాబులు


1. ఏ శక్తి వల్ల సూర్యుడు ప్రతి నిత్యం ప్రకాశిస్తాడు?

సత్యసంధత గల ధర్మమనే శక్తి వల్లే

2 . ప్రాణం ఆపదలో ఉన్నపుడు మనిషిని రక్షించే శక్తి ఏది?

ధైర్యం.

3. ఏ శాస్త్రాలను అధ్యయనం చేస్తే మనిషి విజ్ఞుడవుతాడు?

ఏ శాస్త్రాలవల్లా కాదు.గొప్పవారి సహచర్యం,లోకజ్ఞానం వల్ల.

4. భూమి కంటే భారమైనది ఏది?

నవమాసాలూ మోసి బిడ్డను కనే తల్లి.


5. ఆకాశానికన్నా ఉన్నతమైనదేది?

తండ్రి హృదయం.

6. గాలికన్నా వేగమైనదేది?

మనస్సు.

7. బతికే ఉన్నా చచ్చినవాడితో సమానమైనవారెవరు?

తాను మాత్రమే తింటూ ,ఆకలితో ఉన్నవాడికి పెట్టనివాడు.

8. గడ్డి పరకకంటే తేలికైనది ఏది?

బాధా దగ్ధ హృదయం.

9.బాటసారికి చుట్టమెవరు ?

భార్య.

10. చనిపోయినవారిని అనుసరించేది ఏది?

ధర్మం.

11.మనిషి దేనిని విడిచిపెడితే లోకంలో ప్రేమించబడతాడు?

గర్వం.

12. దు:ఖం రాకూడదంటే ఏం వదిలేయాలి?

కోపం.

13. మనిషి ఆనందంగా బతకాలంటే వదిలేయాల్సిందేమిటి ?అన్నీ నాకే కావాలనే కోరిక.

14. లోకంలో చిత్రమైనదేది?

సృష్టే ఒక విచిత్రం.

15. లోకంలో ఆశ్చర్యకరమైనదేమిటి?

ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మరణం అనివార్యమని తెలిసినా మనం ఎప్పుడూ మరణించమని భావిస్తామో ...అదెంతో ఆశ్చర్యకరం.

16. ధర్మ మార్గాన్ని ఎలా తెలుసుకోవాలి?

వాదం చేత ఏదీ తేలదు.సిద్ధాంతాలూ ,శాస్త్రాలూ ఒకదాన్ని మరొకటి వ్యతిరేకిస్తుంటాయి.మనుషుల్లో ఏ ఇద్దరూ ఏకాభిప్రాయంతో ఉండరు.అందుకనే గొప్పవారు నడిచిన మార్గమే సరైన దారి.అదె సనాతన ధర్మం.

Monday 21 January 2019

తల్లి దండ్రులను మరువ వద్దు.


మాతృదేవోభవ ,పితృదేవోభవ

1. ఎవరిని మరచినా నీ తల్లిదండ్రులను మాత్రం మరువకు.వాళ్ళను మించి నీ మంచి కోరేవారు ఎవరూ ఉండరని తెలుసుకో.

2. నీవు జన్మించాలని రాళ్ళకు పూజలు చేశారు వారు.రాయివై వారి హృదయాలను ముక్కలు చేయకు.

3. కొసరి కొసరి గోరుముద్దలు పెట్టి అల్లారుముద్దుగా నిన్ను పెంచారు వారు.నీకు అమృతం పంచిన వారిపై విషాన్ని విరజిమ్మకు.

4. ముద్దుమురిపాలతో నీ కోర్కెలు తీర్చారు వారు.ఆ ప్రేమమూర్తుల కోరికలు నీవు నెరవేర్చాలని మరువవద్దు.

5.నువ్వెన్ని కోట్లు సంపాదించినా అవి తల్లిదండ్రులకు సమానమౌతాయా ?తల్లిదండ్రుల సేవలోనే నిజమైన సంపాదనలున్నాయని గ్రహించు.

6.సంతానం వల్ల సుఖం కోరుతావు.నీ సంతాన ధర్మం మరువవద్దు.ఎంత చేసుకుంటే అంత అనుభవించక తప్పదనే సత్యం మరువబోకు.

7.నీవు తడిపిన పక్కలో వారు పడుకొని నిన్ను మాత్రం పొడి పొత్తిళ్లలో పడుకోబెట్టారు.అమృతాన్ని కురిపించే అమ్మ కళ్ళలో అశ్రువులను నింపకు.

8.నీవు నడిచే మార్గములో పూలు పరిచారు వారు.అట్టి మార్గదర్శకులకు నీవే కాలులో ముల్లువై బాధించకు.

9. డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు.తల్లిదండ్రులను మాత్రం సంపాదించలేవు.వారి పాదసేవలోనే గొప్పదనం ఉన్నదని జీవితాంతం మరువవద్దు.