బోధన్ పట్టణం నుంచి మహారాష్ట్రలో బీడ్ జిల్లా మాంజర్ సోంబ గ్రామంలో వెలసిన శ్రీ క్షేత్ర కపిలధార మన్మధ స్వామి పుణ్యక్షేత్రానికి నిర్వహించనున్న 17వ వీరశైవ పాదయాత్ర కరపత్రాన్ని మంగళవారం ఆవిష్కరించారు. వీరశైవ లింగాయత్ సమాజ రాష్ట్ర నాయకులు ,జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు దేశాయి ,రాష్ట్ర కమిటీ ప్రముఖుడు శ్యామ్ రావు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నవంబర్ 11వ తేదీన బుధవారం బోధన్ జంగం గల్లీలోని పురాని (పౌడయ్య) మఠం నుంచి సిద్దేశ్వర మహారాజ్ సుంకిని గారి మార్గదర్శకత్వంలో, సంతోష్ సిద్దేశ్వర మహారాజ్ సుంకిని సాన్నిధ్యంలో పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. మఠం నిర్వాహకులు పురాణే అజయ్ కుమార్, పౌడయ్య రాజేందర్ గార్ల ఆధ్వర్యంలో 15 రోజులపాటు సుమారు 360 కిలోమీటర్లు కొనసాగి, నవంబర్ 24వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా కపిలధార క్షేత్రానికి చేరుకుంటుందని వివరించారు . యాత్రలో భక్తులు భజనలు, మేళతాళాలు, భగవాన్ నామ స్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణంలో ముందుకు సాగుతారని ,తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వేలాదిమంది వీరశైవ భక్తులు పాల్గొంటారని తెలిపారు. మార్గమధ్యంలోని గ్రామాల భక్తులు పూర్ణకుంభ స్వాగతం పలుకుతూ అల్పాహారం ,మహా ప్రసాద వితరణ చేపడతారని తెలిపారు. తొలి రోజు బోధన్ పురాణే (పౌడయ్య) మఠం నుంచి దేవి మందిరం, శ్రీ ఏక చక్రేశ్వర శివ మందిరం మీదుగా నాగంపల్లి ,సాలూర క్యాంప్, ఖాజాపూర్, హుంసా ,కొల్లూరు మీదుగా సుంకినికి యాత్ర చేరుకుంటుందని వెల్లడించారు. బోధన్ పట్టణం, మండలంతో పాటు పరిసర గ్రామాల వీరశైవ సమాజ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో పట్టణ వీరశైవ జంగమ లింగాయతాధ్యక్షులు నరసింగప్ప ,లక్ష్మణ్ పటేల్, సమాజ ప్రముఖులు ప్రభు అప్ప, శంకరప్ప ,పురాణే దిలీప్ కుమార్, గణపతి అప్ప తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి