శ్రావణమాసం ను ధార్మిక మాసము అంటారు. ప్రత్యేకించి మహిళా ప్రాధాన్యత కలిగిన మాసము శ్రావణమాసం. వర అంటే శ్రేష్టమైనది అని అర్థం. సమస్త అభీష్ట వరాలను ప్రసాదించే దివ్యమైన తత్వాన్ని కూడా ఈ శబ్దం సూచిస్తుంది. పెళ్లైన మహిళలు కుటుంబ శ్రేయస్సు, భర్త దీర్ఘాయుష్షును కోరుకుంటూ అవివాహితలు అనుకూలుడైన వరుడు రావాలని కోరుకుంటూ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు.
శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరించడం సాంప్రదాయము. ఆ వారం కుదరని పక్షంలో ఈ మాసంలో ఏ శుక్రవారం అయినా ఆచరించవచ్చు. సృష్టికి మూల కారణమైన ప్రాణ శక్తికి అధిదేవతగా ఉంటూ ఆరోగ్యాన్ని, ఆత్మ శాంతిని చేకూర్చే తల్లి ఆదిలక్ష్మి. ధాన్యలక్ష్మి పాడిపంటలను, ధైర్యలక్ష్మి మనోబలాన్ని, గజలక్ష్మి గృహ కనక వస్తు వాహనములను, సంతానలక్ష్మి మంచి సంతానమును, విజయలక్ష్మి విజయాలను ,విద్యాలక్ష్మి విజ్ఞాన వివేక నైపుణ్యాలను ప్రసాదిస్తారు. ధర్మబద్ధంగా సంపాదించిన సత్సంపదలను స్థిరంగా నిలిపే తల్లి ధనలక్ష్మి. ఈ అష్టలక్ష్ముల సమగ్ర సమాహార స్వరూపమే వరలక్ష్మి. లక్ష్మీదేవి రూపం, గుణం, లీలలు ,మహిమలు, తత్వాన్ని విశదపరిచే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం పరమ పుణ్య ప్రదం. ఈ వ్రతం యొక్క ఆచరణతో అష్టలక్ష్ముల అనుగ్రహాన్ని ఒకేసారి పొందవచ్చని పురాణాలు పేర్కొన్నాయి.
చారుమతి యొక్క వృత్తాంతము..
పూర్వం విదర్భ రాజ్యంలోని కొండిన పురంలో చారుమతి అనే గృహిణి ఉండేది. నియమనిష్ఠలతో జీవనం సాగించే చారుమతి అత్తమామలను తల్లిదండ్రులలా భావించి సేవ చేసేది. భర్తకు అనుకూలవతిగా ఉంటూ అన్ని విధాలా తోడ్పాటును అందించేది. ఆమె ధార్మిక నిష్టకు ప్రసన్నురాలైన శ్రీ మహాలక్ష్మి స్వప్నంలో కనిపించి శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున తనను ఆరాధించమని చెప్పింది. ఆ దివ్య సందేశాన్ని తోటి స్త్రీలతో పంచుకొని శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించింది చారుమతి .వ్రతంలో పాల్గొన్న స్త్రీలకు వాయనాలను పంచింది. వ్రతం ముగిసిన వెంటనే చారుమతి ఇల్లు మాత్రమే కాక వ్రతంలో పాల్గొన్న అందరి గృహాలు ధన ధాన్యాలతో వారి శరీరాలు స్వర్ణాభరణాలతో నిండిపోయాయి. వరలక్ష్మి వ్రత మహత్యాన్ని తెలియజేసే ఈ చారుమతి కథను సాక్షాత్తు పరమశివుడు పార్వతి దేవికి చెప్పినట్లు స్కాంద పురాణంలో కనిపిస్తుంది.
శ్రావణమాసం యొక్క విశిష్టత..
అత్యంత విశిష్టత కలిగిన మాసము శ్రావణమాసం. లక్ష్మీదేవి జననము ,వివాహము రెండు ఈ మాసంలోనే జరిగాయి. ఇది లక్ష్మీదేవికి మాత్రమే కాదు, విష్ణు భగవానునికి కూడా ప్రియమైన మాసము. శ్రవణానికి విష్ణు ప్రియ మాసము అనే మరో పేరు కూడా ఉన్నది. పౌర్ణమి నాడు శ్రవణా నక్షత్రం రావడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు .విష్ణుమూర్తి అవతారాలైన శ్రీకృష్ణుడు, వామనుడు ఇద్దరూ కూడా శ్రవణా నక్షత్రంలోనే జన్మించారు. శ్రవణం పదానికి వినడం అని అర్థము. భక్తుల మొరలను అమ్మ విని స్వామివారికి పరిపూర్ణంగా విన్నవిస్తుంది కాబట్టి ఇది శ్రావణము. శ్రావనే మాసి గోవిందం సర్వదా పూజయేత్ నరహ అన్నారు. శ్రావణమాసంలో లక్ష్మీ సహితుడైన విష్ణువును పూజించడం అధిక ఫలదాయకం అన్నమాట. వరలక్ష్మీ వ్రతం కేవలం తిథి ఆధారంగా కాకుండా లగ్న నక్షత్రాల సమన్వయంతో నిర్ణయం అవుతుంది .జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం ఐశ్వర్యం, భోగభాగ్యాలు ,కళలు, సౌందర్యానికి అధిపతి. లక్ష్మీనారాయను లకు ప్రీతికరమైన శ్రవణ మాసంలో శుక్రుడు అధిపతిగా ఉండే శుక్రవారం నాడు వ్రతాన్ని ఆచరించడం వల్ల పరిపూర్ణమైన ఫలితం దక్కుతుందని విశ్వసిస్తారు. ఈ వ్రతం కేవలం ధార్మిక ఆచారమే కాదు, వివాహ వ్యవస్థలో స్త్రీల గౌరవం, కుటుంబ సౌభాగ్యం, సామాజిక సామరస్యాలకు దర్పణం పడుతుంది. బ్రహ్మదేవుడు లిఖించిన తలరాతను కూడా మార్చగలిగే సామర్థ్యం ఆ లక్ష్మీదేవికి ఉంది. ఆ తల్లి ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకోవాలి మనము.



