ఆధ్యాత్మిక విశేషాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆధ్యాత్మిక విశేషాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, సెప్టెంబర్ 2026, ఆదివారం

పెన్షనర్ వినాయకుడు@ నాంపల్లి.

 ఉద్యోగుల జీవితకాల సేవకు గౌరవం పదవి విరమణ అనంతరం పెన్షన్ ద్వారా భద్రత గౌరవప్రదమైన జీవనానికి ప్రతీకగా వినాయకుడి ప్రత్యేక థీమ్ ను రూపొందించారు. జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని నాంపల్లిలోని పెన్షన్ పేమెంట్ ఆఫీసులో ఈ వినూత్న గణేష అలంకరణను ఏర్పాటు చేశారు. సేవా పదవీ విరమణ పెన్షన్ భద్రత గౌరవప్రదమైన జీవితం అనే భావనను ప్రతిబింబించేలా థీమ్ ను రూపొందించారు.సంప్రదాయ భక్తికి ఆధునిక సృ జనాత్మకతను జోడిస్తూ పెన్షనర్ల జీవితకాల సేవకు  నివాళిగా ఈ అలంకరణను తీర్చిదిద్దారూ. విఘ్నాలను తొలగించే వినాయకుడు ప్రతి పెన్షనర్ కు శాంతి ఆరోగ్యం ఆనందం శ్రేయస్సు ప్రసాదించాలని ఆకాంక్షించారు .భక్తుల నమితంగా ఆకట్టుకున్న ఈ పెన్షనర్ వినాయకుని చూడడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిస్తున్నారు. 


9 , 99 ,999 రూపాయలతో వినాయకుడికి అలంకరణ..

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్  ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని కరెన్సీ తో అలంకరించారు



 నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం 9 ,9 9, 999 రూపాయలతో మహిళలు అలంకరించిన వినాయక మండపం విశేషంగా ఆకట్టుకుంది.ఇందు  కోసం 20,50,100,500 నోట్లను వినియోగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఆర్యవైశ్య సంఘం నాయకులు చకిలం మారుతీ, కొమురవెల్లి రామ్మూర్తి, కొమురవెల్లి భాస్కర్ ,శ్రీనివాస్, బాదం వాణి తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాలలో కరెన్సీ గణేశుడు..



మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడికి 31 లక్షల రూపాయల కరెన్సీ తో అలంకరించారు.

మంగళగిరిలో..

ఏపీలోని మంగళగిరిలోని మెయిన్ బజార్లో లక్ష్మీ గణపతి అలంకరణలో భాగంగా ఏకంగా రెండు కోట్ల 41 లక్షల విలువైన కరెన్సీని ఉపయోగించారు 18 ఏళ్ల క్రితం ఐదు లక్షల రూపాయలతో ప్రారంభమైన ఈ ఘన గణపతి అలంకరణ సంప్రదాయం ఇప్పుడు కోట్ల రూపాయలకు చేరింది వినాయక విగ్రహానికి ముందు కరెన్సీ నోట్లతో బాలగోపాలుడు చిత్రాన్ని కూడా చూడముచ్చటగా ఏర్పాటు చేశారు.





సత్తుపల్లిలో.. 
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ పరిధిలోని అవని వెంచర్లు ప్రతిష్టించిన గణేశుడికి 65 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో ధన అలంకరణ చేశారు.







18, సెప్టెంబర్ 2026, శుక్రవారం

మొబైల్ గణేశ @ మెట్ పల్లి

 భక్తా.. అతిగా మొబైల్ వాడితే అనారోగ్య సమస్యలు వస్తాయి . ఈ రోజు సెల్ ఫోన్ ను అత్యధికంగా వినియోగించావు. ఇకపై తక్కువ సమయం వాడతానని మాట ఇస్తేనే నీకు నా దర్శన భాగ్యం కలుగుతుంది అని మొబైల్ గణేశ పలుకుతున్న స్వరం అందరినీ ఆలోచింప చేస్తోంది. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణం లోని చైతన్య నగర్ లో సురేందర్ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మంటపాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు గణ నాథుడిని దర్శించుకోవాలంటే ముందు సెల్ ఫోన్ ను అక్కడి సీసీ కెమెరా ముందు స్కాన్ చేయించాలి. విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన స్పీకర్ నుంచి వచ్చే ఆజ్ఞలు పాటించాలి. 


భీమేశ్వర స్వామికి..3.72 కోట్ల ఆదాయం..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధమైన భీమేశ్వర స్వామి ఆలయానికి  శ్రావణమాసంలో భారీ ఆదాయం వచ్చింది. 28 రోజులకు సంబంధించి హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు రెండు రోజులపాటు లెక్కించారు. మూడు కోట్ల 72 లక్షల 72 వేల 809 వచ్చినట్లు తెలిపారు. అలాగే 201.400 గ్రాముల మిశ్రమ బంగారం,16.600 కిలోల మిశ్రమ వెండి వచ్చినట్లు తెలిపారు.

కాటేజీ నిర్మాణానికి భారీ విరాళం..
మాచారెడ్డి మండలంలో ని చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద భక్తుల విరాళాలతో నిర్మిస్తున్న కాటేజీకి హైదరాబాదుకు చెందిన కీర్తిశేషులు అబ్బగౌని లక్ష్మీనారాయణ గౌడ్, జ్ఞాపకార్థము ఆయన సతీమణి శ్యామల ఆలయ సిబ్బందికి రెండు లక్షల 50 వేల రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు దాతలకు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి సత్కరించారు .కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ శనిగరం కమలాకర్ రెడ్డి ,ఈవో, ముఖ్య అర్చకులు తదితరులు పాల్గొన్నారు.




14, సెప్టెంబర్ 2026, సోమవారం

ముంబై గణేశుడికి 703 కోట్ల బీమా

 


ముంబైలోని కింగ్స్ సర్కిల్ లో జీ ఎస్ బీ ( గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ్) గణపతి విగ్రహం దేశంలోనే ఖరీదైనదిగా నిలిచింది. ఈ విగ్రహానికి 66 కిలోల బంగారం , 335 కిలోల వెండి , రత్నాలతో తయారు చేసిన ఆభరణాలను అలంకరించారు. రూ. 703.27 కోట్ల ఇన్సూరెన్స్ చేయించారు దీంతో దేశ వ్యాప్తంగా ఈ విగ్రహం గురించి చర్చ మొదలైంది. శని వారం నుంచే భక్తులు పెద్ద ఎత్తున దర్శనానికి వస్తున్నారు. జీ ఎస్ బీ వినాయక చవితి వేడుకలు దేశంలోనే అత్యంత వైభవంగా నిలుస్తున్నాయి . కేవలం ఆభరణాలే కాకుండా .. నిత్యం వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. నవరాత్రులు ఇక్కడ వేద సాంప్రదాయాలు , ఆచారాలు , భజనలు , కీర్తనలతో పాటు భక్తి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. 

పుచ్చకాయపై గణేశుడు..

కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు తమలపాకుల సైదులు వినాయక చవితి సందర్భంగా ఆదివారం పుచ్చకాయపై 4 అంగుళాల వెడల్పు ,4 అంగుళాల పొడవు గల వినాయకుడి రూపం చెక్కారు.గతంలో చింత గింజలపై వినాయకుడు ,బియ్యపు గింజపై వినాయకుడి చిత్రం వేశారు.ఇలా ఎన్నో సూక్ష్మ కళా రూపాలు తయారు చేసి జాతీయ అంతర్జాతీయ రికార్డులను కైవసం చేసుకోవడం జరిగింది.

13, సెప్టెంబర్ 2026, ఆదివారం

పంచముఖ సంకట హర మహా గణపతి, ఖైరతాబాద్

 





ఖైరతాబాద్ లో దాదాపు 70 అడుగుల ఎత్తులో కొలువుతీరిన పంచముఖ సంకటహర మహాగణపతి పూజలు అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. శనివారం సాయంత్రం విగ్రహ ప్రధాన శిల్పి రాజేంద్రన్ భక్తుల కోలాహలం మధ్య వినాయకుడు విగ్రహానికి తుది మెరుగులు దిద్దారు . ఏటా ఉత్సవాలకు 45 రోజులు ముందుగానే విగ్రహాన్ని ప్రదర్శిస్తారు. ఏటా చవితికి రెండు రోజులు ముందు స్వామి  వారి కంటికి తుది మెరుగులు దిద్దడం ఆనవాయితీగా వస్తోంది. 




జూన్ 25న తొలి పూజలు చేయగా, ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోనే విగ్రహ ఏర్పాటు పనులు మొదలుపెట్టారు. విగ్రహం పూర్తి చేసేందుకు ఏటా దాదాపు మూడు నెలల వ్యవధి తీసుకుంటారు .ఈ ఏడాది రెండున్నర నెలలోనే విగ్రహం సిద్ధం చేశారు. 





అబ్బాస్ ఖాన్ ఆధ్వర్యంలో 17 ఏళ్లుగా గణేష్ మండపం..

 వినాయక చవితి ఉత్సవాల నిర్వహణలో ముంబైలోని కమాటిపుర ప్రాంతంలో గల పీపీ మార్గచా రాజా గణేష్ మండల్ కు 63 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ మండల్ కు గత 17 ఏళ్లుగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అబ్బాస్ ఖాన్ అధ్యక్షుడిగా కొనసాగుతుండడం విశేషం. హిందూ ముస్లిం తేడా లేకుండా అందరూ భారతీయులలా ఒక్కటై ఈ పండుగను వేడుకగా జరుపుకోవడం చాలా కాలంగా కొనసాగుతున్నట్లు వాలంటీర్ వికాస్ బేలదార్ తెలిపారు. గణపతి అప్పపై నాకున్న అపారమైన విశ్వాసంతోనే ఏటా ఈ వేడుకను నిర్వహించగలుగుతున్నాము. ఇవి రెండు మతాల సామరస్య సందేశం మాత్రమే కాదు, నిజానికి మేమంతా ప్రేమ సందేశం చాటుతున్నాము. ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఎంతో భక్తిశ్రద్ధలతో వినాయకుడిని ఆహ్వానిస్తాం అని అబ్బాస్ ఖాన్ తెలిపారు. ఈ ఉత్సవాలు జరిగే పది రోజులు తాము శాకాహారం భుజిస్తూ, సీర /రవ్వ కేసరి, చనా/ శనగలు ప్రసాదాన్ని ఇంటివద్ద సిద్ధం చేసి మండపానికి తీసుకొస్తామని అబ్బాస్ భార్య హసీనా ఖాన్ చెప్పారు. 



800 ఏళ్ల బాల గణేశుడు@ఆదిలాబాద్.

 


ఆదిలాబాద్ జిల్లాలో 800 ఏళ్ల నాటి పురాతన బాల గణేశుడి విగ్రహం లభ్యమైంది. జిల్లా కేంద్రానికి సమీపంలో గల చందా, శివారం గ్రామాల మధ్య సా. శ. 2 వ శతాబ్దికి చెందిన బాల గణేష్ విగ్రహాన్ని , స్థానిక చరిత్ర ఉపాధ్యాయులు పృథ్వీరాజ్ రోడ్డావార్ గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హర గోపాల్, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివ నాగిరెడ్డి గారు తెలిపారు. చందా గ్రామ శివారులోని రైలు కట్ట సమీపంలోని ఒక చెట్టు కింద గల ఒక శిల్పంలో ఒక పీఠంపై సుఖాసనంలో కూర్చున్న పార్వతి , కుడి చేతిలో ఒక ఫలాన్ని , ఎడమ చేతితో తన ఎడమ తొడపై, కూర్చొని చనుబాలు తాగుతున్న బాల గణేశుని పట్టుకొని ఉందని ,ఆయనకు తలపై కిరీటం లేకపోవడం.. ఈ శిల్పం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు వెలుగు చూసిన తొలి, అరుదైన చారిత్రక ప్రాధాన్యత గల శిల్పమని వారన్నారు. బాల గణేశునికి రెండు చేతులే ఉండి, తలపై కిరీటం లేకపోవడం గమనించాల్సిన విషయం అన్నారు. ఆదిలాబాద్ కు 14 కి. మీ దూరంలో సా. శ. 1104 లో మాల్వా దేశ రాజ కుమారుడైన పారమార జగదేవుడు జైనథ్ లో నిర్మించిన లక్ష్మీ నరసింహ ఆలయ శిల్పాలను పోలిన ఈ బాల గణేష్ శిల్పం సా. శ. 12 వ శతాబ్దికి చెందినదని , చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ శిల్పాన్ని గ్రామ పంచాయతీ కి తరలించి భద్రపరచాలని హరగోపాల్, శివ నాగిరెడ్డి గార్లు గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. 



11, సెప్టెంబర్ 2026, శుక్రవారం

మరుగోళ్ళ పోటీలు అంటే..

 పోలాల అమావాస్య అంటే.. 

శ్రావణం సకల దేవతలకు ప్రీతికరమైన మాసం.. ఈ మాసం సమృద్ధికి ఆలంబనం. ఈ నెలలో ప్రతి రోజూ విశేషమైనదే. ఈ మాసంలో చివరి రోజైన శ్రావణ బహుళ అమావాస్యను "పోలాల అమావాస్య" అంటారు.దీనిని కౌశి అమావాస్య , ఆలోక అమావాస్య గా కూడా పూర్వ గ్రంథాలు పేర్కొన్నాయి.ప్రధానంగా ఇది శక్తి పూజ .ముత్తైదువులు దీన్ని ఆచరిస్తారు. పోలాంబకు ప్రతీకగా కంద మొక్కను పూజా మండపం మీద ప్రతిష్టించి పూజిస్తారు. వరి దుబ్బును కూడా పూజించే ఆనవాయితీ ఉంది. తోరాలను కట్టి ,వాటిని అమ్మవారికి అర్పించి , తమ చేతులకు ,ఇంట్లోని ఆడపిల్లల చేతులకు కట్టుకుంటారు. పోలాంబను పూజించడం వల్ల కుటుంబ సౌఖ్యం, సిరి సంపదలు ,సౌభాగ్యం లభిస్తాయని భక్తుల విశ్వాసం.నందీశ్వరుడు జన్మించిన రోజు ఇదే అని పురాణాలు చెబుతున్నాయి.కాబట్టి పలు ప్రాంతాలలో రైతులు తమకు సాగులో సాయం చేసే బసవన్నలకు వృషభ పూజను నిర్వహిస్తారు. దీనిని " ఎడ్ల పొలాల అమావాస్య " అని కూడా అంటారు.



ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం పోలాల పండుగ సంబరంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ ఎడ్లను రంగు రంగుల దుస్తులతో, బెలూన్లతో అలంకరించారు.అనంతరం వీధులలో ఊరేగించారు. గ్రామ దేవతల ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. 



తర్వాత ఎడ్లను పూజించి నైవేద్యం సమర్పించారు.వాటికి నైవేద్యం పెట్టిన తర్వాత ఉపవాసం వీడడం ఇక్కడి రైతుల సంప్రదాయం.



సీతాదేవి ఆలయం, నువారా ఎలియా జిల్లా,శ్రీలంక.

మరుగోళ్ళ పోటీలు..అంటే..

ఆదివాసీ సంస్కృతి,సాంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవి.వాటిని పరిరక్షించి భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. పోలాల అమావాస్య రోజున సాంస్కృతిక గిరి ఆధ్వర్యంలో ఉట్నూర్ ఐటిడిఏ ప్రాంగణంలో మరుగోళ్ళ పోటీలు ప్రారంభం అయ్యాయి.ప్రకృతితో మమేకమై జీవించే ఆదివాసీల ఆచారాలు ,పండుగలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.వీటి పరిరక్షణకు ఐటిడిఏ విశేష కృషి చేస్తోంది.


10, సెప్టెంబర్ 2026, గురువారం

ఆధ్యాత్మిక సమాచారం 10-9-2026

 మల్లికార్జున హుండీ లెక్కింపు ..

బీరంగూడ గుట్టపై కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో 200 రోజుల హుండీ లెక్కింపు నిర్వహించారు .హుండీ ద్వారా మొత్తం 13 లక్షల  రూపాయలకు పైగా ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు .సంగారెడ్డి దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు సమక్షంలో హుండీ లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. ఆలయ ఈవో దేవనాథం, చైర్మన్ సుధాకర్ యాదవ్ పర్యవేక్షణలో భక్తుల సహకారంతో లెక్కింపు నిర్వహించారు .ఈ సందర్భంగా ఈవో దేవనాదం మాట్లాడుతూ హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని తెలిపారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు భక్తుల సహకారం ఎంతో అవసరమని అన్నారు .అనంతరం చైర్మన్ మాట్లాడుతూ హుంలెక్కింపుకు సహకరించిన భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిటీ సభ్యులు సీనియర్ అసిస్టెంట్ మల్లికార్జు,న్ ప్రధాన అర్చకులు ప్రహ్లాద్, అధికారులు, మహిళా భక్తులు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


నడకదారి భక్తులకు రక్షణగా పైకప్పు.. యాదగిరిగుట్ట మెట్ల మార్గంలో నిర్మాణానికి భూమి పూజ.. 




సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట కొండపైకి కాలినడకన వెళ్లే భక్తులకు ఎండ, వాన నుంచి రక్షణ కల్పించే పైకప్పు నిర్మాణ పనులకు దేవస్థానం శ్రీకారం చుట్టింది. లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని మెట్ల మార్గంలో సందర్శించే భక్తుల సౌకర్యం కోసం బుధవారం ఈ మేరకు శంకుస్థాపన చేశారు .పెన్సిల్ ఫ్యాబ్రిక్ స్ట్రక్చరల్ విధానంలో ఆధునిక సాంకేతికతతో ఈ పైకప్పును ఏర్పాటు చేయనున్నారు .28 వేల చదరపు అడుగుల ఈ నిర్మాణానికి ఒకటిన్నర కోట్లను హైదరాబాద్లోని మేస్సర్స్ అగర్వాల్ ఫౌండరీస్ చెందిన ప్రమోదగర్వాల్ విరాళంగా అందించనున్నారు .మెట్ల మార్గంలో రక్షణ కోసం సీసీ కెమెరాలు, లైటింగ్ తదితర ఏర్పాట్లకు మరో 25 లక్షల కూడా విరాళంగా ఇచ్చేందుకు ఆయన అంగీకరించారు. ఈ పైకప్పు నిర్మాణ పనులకు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కే మాధవాచార్యులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు .ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి జై భవాని శంకర్ ,అగర్వాల్ ఫౌండరీస్ వైస్ చైర్మన్ సుజయ్ పాల్గొన్నారు. 

9, సెప్టెంబర్ 2026, బుధవారం

భంగారం బిడాయి అంటే..

 



ప్రత్యేకంగా అలంకరించిన పల్లకి ,భక్తుల ప్రార్థనలు, డప్పుల మోతతో ,పట్టణ సరిహద్దులు దాటిన తర్వాత పూజా సామాగ్రిని అక్కడే వదిలివేయడం.. చత్తీస్గఢ్లోని నారాయణపూర్ లో ఇది ఎన్నో తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం .దీనిని భంగారం బిడాయి అంటారు .ప్రజల అనారోగ్యాలు, దుఃఖాలను, బాధలు, కష్టాలను భంగారం దేవుడు తన వెంట తీసుకువెళ్లి, ఆ ప్రాంతానికి శాంతి ,సౌభాగ్యం ,మంచి పంటలను ప్రసాదిస్తాడని స్థానికులు విశ్వాసంతో ఈ వేడుకను నిర్వహిస్తారు .రక్షాబంధన్ తర్వాత శ్రావణమాసం చివరలో, భాద్రపద మాసం ప్రారంభ సమయంలో ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు చేస్తారు.  స్థానిక మాత మావిలీ ఆలయంలో పవిత్ర దారం కట్టడంతో ఈ సంప్రదాయం ప్రారంభమవుతుంది. వేడుకలలో భక్తులు పసుపు, నూనెలతో  పాటు తమ మొక్కులు ,కానుకలు దేవుడికి సమర్పిస్తారు .వాటన్నింటినీ సేకరించి ఆలయ ప్రాంగణంలోని ఒక రాయి కింద భద్రపరుస్తారు .పూజల అనంతరం బయటకు తీసి ప్రత్యేకంగా సిద్ధం చేసిన పల్లకిలో ఉంచుతారు ."సారా " అని పిలిచే పూజారులు ఆ పల్లకిని డప్పుల మోతమధ్య తీసుకెళ్లి, ఊరి చివర పొలిమేరలో విడిచిపెడతామని దేవ్ కమిటీ ఉపాధ్యక్షుడు అర్జున్ దేవాంగన్ తెలిపారు. 

వక్కలతో.. వినాయకుడు

 


వినాయక చవితి పండుగ ఇంకా రాకమునుపే రకరకాల గణపయ్య ప్రతిమలు భక్తులను ఎంతో అలరిస్తున్నాయి. తిరుపతి నుండి కరకంబాడి కి వెళ్లే మార్గంలోని బొమ్మల  క్వార్టర్స్ వద్ద 46 కిలోల, సుమారు 1,80,000  వక్కలతో ఏడడుగుల పర్యావరణహిత విగ్రహం ముస్తాబయింది. దీనిని కళాకారుడు రాము కుటుంబ సభ్యులతో కలిసి సిద్ధం చేశారు. నిమజ్జనం చేసే సమయంలో పర్యావరణం కలుషితం కావద్దనే ఉద్దేశంతో తిరుపతికి చెందిన పలువురు భక్తులు ప్రత్యేకంగా తయారు చేయించినట్లు ఆయన పేర్కొన్నారు .ఇందుకోసం కడప నుంచి వెడల్పు ఎక్కువగా ఉన్న వక్కలు తెప్పించామని చెప్పారు. విగ్రహం తయారీకి 15 రోజులు పట్టిందని , ఒక లక్ష పదివేల రూపాయల ఖర్చు అయిందని రాము వివరించారు .


7, సెప్టెంబర్ 2026, సోమవారం

ఆధ్యాత్మికవేత్త తత్వానంద స్వామి నిర్యాణం

 


ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ,శివ తత్వాన్ని బోధించిన తత్వానంద స్వామి/ వేలేటి రామచంద్ర రావు గారు ఆదివారం శివ సాయుజ్యం పొందారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధి మల్లాయ పల్లికి చెందిన వేలేటి రామచంద్రారావు ప్రారంభంలో మల్లాయపల్లిలో బుక్ బైండింగ్ ,ప్రింటింగ్ ప్రెస్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండిట్ గా, చిన్న మల్లారెడ్డిపేటలో ఉపాధ్యాయుడిగా సేవలందించిన ఆయన ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. జ్యోతిష్య శాస్త్రం రంగంలోనూ రామచంద్ర రావుకు విశేష గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించిన కీలక పరిణామాలను ఆయన ముందుగానే అంచనా వేశారని సన్నిహితులు చెబుతుంటారు .పలు పత్రికలలో పాత్రికేయుడుగా పని చేసిన ఆయన కొంతకాలం సినీ రంగంలోనూ పనిచేశారు. వివిధ రంగాలలో పనిచేస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న ఆయన వాన ప్రస్తాశ్రమ దీక్ష స్వీకరించారు. బసవ కళ్యాణ ఆశ్రమానికి చెందిన స్వామి మధనానందా స్వామి వద్ద ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం పొందిన ఆయన తత్వానంద స్వామిగా దీక్ష స్వీకరించారు. భౌతిక అనుభవాలను ఆధ్యాత్మిక చింతనతో మేళవిస్తూ ప్రజలకు అద్భుతమైన సందేశాలు అందించారు. తెలుగు భాషలో సందేశ తరంగిణి ,భారత యువజనులారా, జగము తదితర ఆధ్యాత్మిక గ్రంథాలను రచించారు. హైదరాబాదులోని హన్మోజీ గూడలో గాయత్రీ మాత ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించి ,ధార్మిక కార్యక్రమాలు ,గాయత్రి ఉపాసన ప్రచారంలో చురుగ్గా పాల్గొని అనేకమంది శిష్యులను సంపాదించుకున్నారు. జీవితపు తొలినాళ్లలో మనుషుల జాతకాలను పరిశీలించిన ఆయన మలిదశలో మనిషి అంతరంగాన్ని తట్టి లేపే తత్వవేత్తగా మారారు. ఆయన పార్థివ దేహానికి ఆదివారం హన్మోజీ గూడలోని అంతిమ సంస్కారాలు నిర్వహించారు. 

ఆధ్యాత్మిక సమాచారం 7-9-2026

 దుర్గా మాత షెడ్డు నిర్మాణానికి భూమి పూజ



నవీపేట మండలం అబ్బాపూర్ ఎం గ్రామంలో దుర్గామాత షెడ్డు నిర్మాణానికి ఆదివారం సర్పంచ్ మనేద శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు .తన సొంత నిధులైన లక్ష రూపాయల వ్యయంతో శ్రీనివాస్ సంబంధిత షెడ్డు నిర్మాణాన్ని చేపట్టనున్నారు .ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.


ఆలయ అభివృద్ధికి మొదటి వేతనం విరాళం 



నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన జక్కుల రుచిత తన మొదటి వేతనం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి విస్తరణ పనుల కోసం విరాళంగా అందించారు. వేతనానికి సంబంధించిన చెక్కును ఆదివారం వేములవాడ ఆలయ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పెరిక శ్రీనివాస్ కు అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఏఈఓ లక్ష్మణరావు ఆమె తల్లిదండ్రులు జే రవీందర్ ,మీనా తదితరులు పాల్గొన్నారు.


రూ. 50 లక్షల విలువైన భూమి విరాళం.. 



హన్మకొండ జిల్లా ధర్మ సాగర్ మండలం ముప్పారం గ్రామ పంచాయతీ బిల్డింగ్ ,రామాలయం నిర్మాణం కోసం గ్రామానికి చెందిన చింతలపాటి సుధీర్ రెడ్డి, చింతల పాటి సుకన్య దంపతులు రూ 50 లక్షల విలువైన 550 గజాల ఖాళీ స్థలాన్ని విరాళం గా అందచేశారు. తమ ఓపెన్ ప్లాట్ ను గ్రామ సర్పంచ్ రేణుక వెంకట్, మాజీ ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్ కు అప్పగించారు. తమ తండ్రి చింతలపాటి రామచంద్రా రెడ్డి జ్ఞాపకార్థం ఈ స్థలాన్ని గ్రామ అభివృద్ధి కోసం విరాళంగా అందచేసినట్లు తెలిపారు. దాతలను గ్రామస్తులు అభినందించారు. 

వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన..



బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపు తండాలో నూతనంగా నిర్మించిన జగదాంబ , సేవాలాల్ ఆలయంలో ఆదివారం విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జగదాంబ, సేవాలాల్ ఆలయాల నిర్మాణం తో తండాలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుందన్నారు. ఆలయాల అభివృద్ధికి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, తండా వాసులు, భక్తులు పాల్గొన్నారు. 

తెలంగాణ గంగ తెప్పోత్సవం అంటే..



తెలంగాణ గంగపుత్రుల గంగ తెప్పోత్సవం కనుల పండుగ గా జరిగింది .ఖైరతాబాద్ ఏడు గుడులనుంచి హుస్సేన్ సాగర్ గంగమ్మ దేవాలయం వరకు పోతురాజులు, జోగినిల వీరంగాలు, సాంప్రదాయ వల పందిర్లు, బోనాలతో శోభా యాత్ర సాగింది. నగర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని గంగపుత్రులకు సంఘీభావం తెలిపారు .ఈ సందర్భంగా గంగ తెప్పోత్సవ అధ్యక్షుడు మల్కు మహేందర్ బాబు మాట్లాడుతూ గంగ తెప్పోత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించాలని కోరారు .



హఫీజ్ పేటలో అహింసా స్థూపం..



దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ నగరంలో మియాపూర్ లో "అహింసా స్తూపం " ఆవిష్కృతమైంది. ఆదివారం హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని మంజీరా పైపులైన్ రోడ్డులో అహింస స్తూపంను చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ రవికుమార్ యాదవులతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. స్థూపం రాబోయే తరాలకు శాంతి ,అహింసల దివ్య సందేశాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. స్తంభంపై లిఖించిన" పరస్పరోపగ్రహో జీవానాం  " అనే సందేశం నేటి అశాంతియుత  ప్రపంచంలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. మనిషి మనిషికి , జీవి జీవికి పరస్పరం సహకరించుకోవాలనే ఈ సందేశం సమాజాన్ని ఐక్యంగా నిలబెడుతుందని చెప్పారు. ఈ బృహత్తర కార్యానికి జైన్ సమాజ మహిళలు నాయకత్వం వహించడం విశేషమని, ఇది ప్రపంచానికి ఐక్యత మానవీయ సందేశాన్ని చాటి చెప్పిందని అభినందించారు. అహింస అంటే కేవలం శారీరక హాని చేయకపోవడమే కాదు మాటలలో, ప్రవర్తనలో, ఆలోచనలో కూడా దానిని పాటించడమేనని స్పష్టం చేశారు. నగర ఆర్థిక ,సామాజిక ,సంస్కృతిక ప్రగతిలో జైన్, బ్రాహ్మణ ,మహేశ్వరి వంటి వివిధ సమాజాలు కీలక భూమిక పోషించాయని కొనియాడారు.



చుక్క పూర్ లక్ష్మీ నరసింహ ఆలయ అభివృద్ధికి విరాళాలు


 

మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ,రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన చింతల శ్రీనివాస్ ,అరుంధతి దంపతులు జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్ కు 5000 రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా అర్చకుడు శ్రీనివాసచార్యులు దాతలకు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి సన్మానించారు.

విరాళం అందజేత..



గాంధారి మండలంలోని తిప్పారం తండాలో నూతనంగా నిర్మిస్తున్న కోదండ రామచంద్రస్వామి ఆలయానికి పోతంగల్ కలాన్ కి చెందిన కిషన్ 25 వేల రూపాయల నగదును ఆదివారం సర్పంచ్ గంగారం, ఆలయ కమిటీ చైర్మన్ బిషన్ నాయక్ లకు అందజేశారు.


ధాన్యోస్మి..



సహజ సిద్ధంగా లభించే బంకమట్టి ,ధాన్యం, పెసర్లు, మినుములు, ఆవాలు వంటి పప్పు దినుసులతో తయారు చేసిన వినాయక విగ్రహం ఇది .బొజ్జ గణపయ్యను పూజించడమే కాదు ,ప్రకృతిని సైతం కాపాడుకోవాలి అనే ముఖ్య సందేశంతో విజయవాడకు చెందిన ఒక వైద్యుడు మట్టి ,చిరుధాన్యాలతో నాలుగడుగుల వినాయక విగ్రహాన్ని తయారు చేయించారు. మట్టి సులువుగా నీటిలో కలిసిపోతుందని, చిరుధాన్యాలు జీవరాశుల ఆహారంగా ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.

ఆలయానికి స్టాండు వితరణ..



కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులోని శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి మైలారం గ్రామానికి చెందిన బొట్టే కల్పన జ్ఞాపకార్థం బొట్టేమోహన్ ఆలయ కమిటీ సభ్యులకు కొబ్బరికాయలు కొట్టే స్టాండును ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ పెర్క శ్రీనివాస్, సర్పంచ్ బాల హరిచంద్ర రెడ్డి, గ్రామస్తులు రమేష్, లింగం గౌడ్, గంగాధర్, కాశీరాం, రాములు , మహేందర్ ,రాజు పాల్గొన్నారు.



6, సెప్టెంబర్ 2026, ఆదివారం

శ్రీల ప్రభు పాదుల దివ్య ఆవిర్భావ దినోత్సవం

 అంతర్జాతీయ హరికృష్ణ ఉద్యమం ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులు విశ్వ గురువు స్త్రీల ప్రభుపాదుల దివ్య ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం హరే కష్ణ గోల్డెన్ టెంపుల్ లో నందోత్సవం 130 వ వ్యాస పూజ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా హరే కృష్ణ మూమెంట్ హైదరాబాద్ అధ్యక్షులు సత్య గౌర చంద్ర దాస ప్రభుజీ ' వ్యాస పూజ 2026 ' ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్త్రీల ప్రభుపాద సందేశ విశిష్టతను ఆధునిక కాలంలో శ్రీకృష్ణుని లీలలను స్మరించుకోవాలిసిన ఆవశ్యకతను తెలియజేశారు స్త్రీల ప్రభుపాదుల వారి జీవితం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి ఏ విధంగా ప్రేరణగా నిలుస్తోంది అనే విషయాన్ని ఆయన వివరించారు



5, సెప్టెంబర్ 2026, శనివారం

చదువుల తల్లి కి అక్షరమాల పట్టు చీర

 సిరిసిల్ల జిల్లా కు చెందిన చేనేత కార్మికుడు సల్ల జగదీశ్ అకుంఠిత దీక్ష తో బాసరలోని చదువుల తల్లి శ్రీ సరస్వతీ దేవి అమ్మవారికి మగ్గం మీద 56 తెలుగు అక్షరమాల తో నేసిన పట్టు చీరను శుక్రవారం నాడు బాసర పుణ్య క్షేత్రం లోని బాలాలయంలో ఆలయ అధికారులు, పూజారుల సమక్షంలో మంగళ వాయిద్యాల నడుమ సమర్పించారు. అంతకు ముందు అఖిల భారత పద్మశాలి నిత్యాన్నదాన సత్రంలో ఈ ప్రత్యేక పట్టు చీరను సల్ల జగదీశ్, సంఘం సభ్యులు బాజా భజంత్రీలతో అమ్మ వారి బాలాలయానికి తీసుకు వచ్చారు. 

ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి , వేద పండితులు,అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా జగదీశ్ ను ఆలయ ఈవో అంజనీ దేవి ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో బాసర సర్పంచ్ వెంకటేష్ గౌడ్ , పద్మశాలి సంఘం సభ్యులు రాపోలు సుధాకర్, కే.గంగాధర్,స్వామి, అశోక్, రమేశ్, రాజు, పోశెట్టి, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.



4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

పవిత్ర భండారా ఉత్సవం@ఆగ్రా..

 రాధా స్వామి మత ప్రవర్తకులు , మొదటి సంత్ సద్గురువు అయిన పరమ పురుష్ పూరన్ ధనీ హుజూర్ స్వామి మహారాజ్ జయంతి సందర్భంగా పవిత్ర భండారా ఉత్సవం శుక్ర వారం జన్మాష్టమి రోజున దయాళ్ బాగ్, ఆగ్రా లో నిర్వహించనున్నారు. 

హుజూర్ స్వామి మహారాజ్ 1818 ఆగస్టు 24 -25 మధ్య పవిత్ర జన్మాష్టమి రాత్రి ఆగ్రాలోని పన్నీ గలీలో సేట్ శివ్ దయాళ్ సింగ్ గా అవతరించారు. ఆయన జీవుల ఉద్ధరణ కు నిజ్ ఘర్ ప్రాప్తికి ప్రత్యక్ష మార్గమైన సూరత్ శబ్ద యోగాన్ని ప్రకాశింప చేసి , 1861, ఫిబ్రవరి 15, వసంత పంచమి రోజున సర్వ సాధారణ సత్సంగీయులకు రాధాస్వామి సత్సంగ ద్వారాలను తెరిచారు. భండారా వారం సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు జరుపబడుతుంది. ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, తూర్పు రాష్ట్రాలు, యూరప్ నుంచి అనేక మంది భక్తులు దయాళ్ బాగ్ కు విచ్చేయనున్నారు. శుక్రవారం ఉదయం పవిత్ర హారతి, రెండవ సెషన్ లో పొలాల్లో పవిత్ర భండారా నిర్వహించ బడుతుంది. స్వామీజీ మహారాజ్ బోధనలపై విశిష్ట సమ్మేళనాన్ని దయాళ్ బాగ్ ప్రస్తుతం జరుపుతోంది. 

2, సెప్టెంబర్ 2026, బుధవారం

తమిళనాడు ఆలయాల్లో.. నో మొబైల్స్

 తమిళనాడు లోని ప్రముఖ ఆలయాల్లో సెల్ ఫోన్లు తీసుకు రావడం పై హిందూ మత, దేవాదాయ శాఖ నిషేధం విధించింది . ఆలయాలలో యువత నిబంధనలను ఉల్లంఘిస్తూ రీల్స్, ఫోటోలు తీయడం గమనించిన అధికారులు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భక్తుల మొబైల్ ఫోన్లను భద్ర పరచడానికి ఆలయ ఎంట్రెన్స్ వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. 

ఒక్కో ఫోన్ కు రూ 5 చొప్పున వసూలు చేస్తున్నారు.  కాంచీ పురంలోని దేవరాజ స్వామి ఆలయంలో ఈ విధానం ఉదయం నుండే ప్రారంభం అయింది. ఫోన్ మోడల్, నంబర్ రిజిస్టర్ చేసి ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ఇస్తున్నారు. ఇది ఆలయాల ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బ తీస్తుందని అధికారులు పేర్కొన్నారు. మొబైల్ బ్యాన్ బోర్డులను ఎంట్రెన్స్ వద్దే ఏర్పాటు చేయాలని , పబ్లిక్ అనౌన్స్ మెంట్ ద్వారా భక్తులకు తెలియ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 

శక్కర్ బేస్ ఆంజనేయ ఆలయం,మద్నూర్

 కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద గల పురాతన శక్కర్ బేస్ ఆంజనేయ స్వామి ఆలయం లో శిఖర, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ ఆలయ ఆవరణలో ధర్మ ధ్వజాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆలయం పైన శిఖర ప్రతిష్ఠాపన , ఆలయంలో నంది, శివ లింగం , ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

బిచ్ కుంద మండలం ఖత్ గావ్ మల్లిఖార్జున స్వామి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 




1, సెప్టెంబర్ 2026, మంగళవారం

నోవోన్గ్ పూజ అంటే

 ఈ పూజ ఆదివాసీ ప్రజలు చేస్తారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం లోని చింతల సాంగ్విలో సిడాం పరివార్ ఆది వాసీలు సోమవారం నోవొంగ్ పూజ ను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తొలకరి పంటల ద్వారా వచ్చిన కొత్త ధాన్యం , కాయ గూరలు పండ్లను కుల దైవాలు పెర్సా పేన్, సతిక్ దేవతలకు అర్పించారు. సామల బియ్యానికి నెయ్యి కలిపి తయారు చేసిన ప్రత్యేక ప్రసాదాన్ని , మినుములతో చేసిన గారెలను నైవేద్యంగా నివేదించారు. 

30, ఆగస్టు 2026, ఆదివారం

భక్తి శ్రద్ధలతో.. తిట్ల వర్షం..

 వాన పడకపోతే దేవుణ్ణి నిందించడం ఎక్కడైనా విన్నామా? కర్ణాటక రాష్ట్రంలో విజయనగరం జిల్లా హోస పేటె గ్రామంలో ఇలాంటి ఆచారం ఉంది. పట్టణ శివారులోని కాటమయ్య ఆలయానికి సాధారణ రోజుల్లో భక్తులెవరూ వెళ్ళరు. సరైన సమయంలో వర్షాలు కురవక పోతేనే ఆ ఆలయ ద్వారాలు తెరుస్తారు. ఈ ఏడాది ఇంకా వాన చుక్క లేకపోవడంతో స్థానికులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి , దేవుడిపై తిట్ల వర్షం కురిపిస్తూ ప్రదక్షిణలు చేశారు. ఇలా చేస్తే కాటమయ్య వర్షాలు కురిపిస్తాడని పూర్వం నుంచి విశ్వసిస్తున్నారు. ప్రదక్షిణ పూర్తయిన గంట తర్వాత పట్టణంలో ఒక మోస్తరు వర్షం పడడం విశేషం. 




18, మే 2026, సోమవారం

రమణ మహర్షి భక్తురాలు బాల సరస్వతి

 భగవాన్ శ్రీ రమణ మహర్షి భక్తురాలు మద్దాలి బాలసర సరస్వతి తన 96 ఏళ్ల వయసులో శనివారం సాయంత్రం కన్నుమూశారు తన బాల్యాన్ని గడిపిన ధన్యజీవి ఆమె మద్దాలి సుబ్బారావుతో ఆమె వివాహం జరిపించింది కూడా భగవాన్ రమణ మహర్షి ఏ వీరికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలురు ఉన్నారు సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలోనే ఆమె స్వగృహంలో పలువురు ప్రముఖులు రమణాశ్రమ సభ్యులు భక్తులు బంధుమిత్రులు నివాళులు అర్పించారు ఆదివారం ఉదయం తార్నాక హిందూ స్మశాన వాటికలో కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.