5, అక్టోబర్ 2026, సోమవారం

దేవుడే శిక్షిస్తాడు..

షట్ చక్రవర్తులలో  ఒకడైన సగరుడు సంతానం కోసం ఔర్వుడు  అనే మునిని ,తన ఇద్దరు భార్యలతో కలిసి భక్త శ్రద్ధలతో పూజించాడు. వంశ వర్ధనుడైన  ఒక్క పుత్రుడిని గాని, లేక లెక్కకు మిక్కుటంగా అరవై వేల మంది సంతానాన్ని గాని వరంగా ఇస్తాను కోరుకోమన్నాడు ముని. 

మొదటి భార్య అయిన సుకేశి కుల దీపకుడైన ఒక్క పుత్రుడు చాలని కోరింది. రెండవ భార్య సుమతి అరవై వేల మంది సంతానాన్ని కోరింది.అలాగే ఇచ్చాడు ముని. సుకేషికి అసమాంజసుడు అనే పుత్రుడు కలిగాడు.సుమతికి అరవై వేల మంది పుత్రులు కలిగారు.పెరిగి పెద్ద వాడైన అసమంజసునికి అంశుమంతుడు అనే పుత్రుడు కలిగాడు.సగరుని మిగతా అరవై వేల మంది సంతానమంతా పాప కర్ములై దుష్కార్యాలు చేస్తున్నారు. దేవతలు సగరుడి పుత్రుల ఆగడాలను అరికట్టే ఉపాయం కోసం కపిల మహా ముని వద్దకు వెళ్లి శరణు వేడారు. అప్పుడు కపిలుడు సూచన ప్రాయంగా సగర పుత్రులకు భవిష్యత్తులో జరగబోయేది చెప్పాడు .

పాప కర్ములై యొరులకుపద్రవములు 

సేయు వారల దైవంబు చెరచు గాన 

వారినెవ్వరు జెరుపంగ వలదు దమకు 

హాని వృద్ధులు పాప పుణ్యముల గలుగు


పాప కర్మను చేయడంలో ఆసక్తి కలిగిన వారై ఇతరులకు హాని కలిగించే వ్యక్తులను దైవమే తగు రీతిన శిక్షిస్తాడు కాబట్టి అటువంటి వాళ్లకు బుద్ధి చెప్పి బాగు చేయాలని ఆలోచన చేసి భంగపడటం వివేకంతో కూడుకున్న పని అనిపించుకోదు. ఒక వ్యక్తికి జీవితంలో వృద్ధి , క్షయాలు అనేవి వారు చేసే పుణ్య, పాపకర్మలపై ఆధారపడి ఉంటాయే కానీ మరొక విధంగా కాదు.అని కపిల మహాముని దేవతలకు చెప్పాడు. ఆ విధంగానే  తండ్రి తలపెట్టిన అశ్వమేధ యాగానికి చెందిన యాగాశ్వాన్ని కపిల మహాముని ఆశ్రమంలో చూసిన సగరపుత్రులు ముందు వెనుక ఆలోచించకుండా ఆ మునిని శిక్షించడానికి పూనుకోగా ఆ మహాముని నేత్రాల నుండి వెలువడిన కోపాగ్ని జ్వాలలలో 60వేల మంది భస్మం అయ్యారని వెన్నెల కంటే సూరన్న రచించిన శ్రీ విష్ణు పురాణం చెబుతోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి