శైవ క్షేత్రాలలో చిదంబరంలోని నటరాజ స్వామి ఆలయం ప్రత్యేకమైనది. గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశాల్లో.. ఆకాశ తత్వానికి ప్రతీకగా భావించే ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు నటరాజ రూపంలో దర్శనమిస్తూనే , అరూపంగా కూడా కొలువై ఉన్నాడనే విశ్వాసం ఉంది. నటరాజుని సన్నిధికి సమీపంలో తెర ఉంటుంది. దాన్ని తొలగించినప్పుడు అక్కడ కనిపించేది విగ్రహం కాదు.. శూన్య ప్రదేశం. దానినే చిదంబర రహస్యం అంటారు. ఆకాశం వలెనే అరూపమైన శివ తత్వాన్ని అలా శూన్య రూపంలో దర్శింప చేస్తారన్నది పండిత వచనం. తెర ముందు బంగారు బిల్వ దళాల అలంకరణ కనిపిస్తుంది. ఒకసారి ఒక రాజు చిదంబర క్షేత్రానికి వెళ్ళాడు. నటరాజ స్వామి ని దర్శించిన తర్వాత పూజారి అతడిని రహస్య సన్నిధి వద్దకు తీసుకెళ్లాడు. తెర తొలగింది. రాజు అటూ ఇటూ పరిశీలనగా చూసి .. స్వామీ దేవుడి కనిపించడం లేదేంటి అనడిగాడు. పూజారి చిరునవ్వుతో . రాజా మీరు దర్శించాలనుకున్నది దేవుడి రూపం. కానీ ఇక్కడ తెలుసుకోవలసింది దేవుడి ఉనికి . కనిపించనంత మాత్రాన లేనట్టు కాదు .. అన్నాడు. రాజు ఆశ్చర్యంతో చూడగా.. మహారాజా గాలి కనిపించదు. కానీ అది లేకుండా మనం జీవించలేం. ఆకాశానికి రూపం లేదు, కానీ ఉన్నది కదా. అలాగే దైవం విగ్రహ రూపంలోనే ఉండాలని లేదు. మన చుట్టూ , మనలోనూ వ్యాపించి ఉంటుంది అన్నాడు. ఆ మాటలు విన్న రాజు .. ఇంతకాలం దేవుణ్ణి విగ్రహాల్లోనే వెతుకుతున్నాను. మనసులో రాగద్వేషాలు తొలగితే అంతటా, అందరిలో దైవాన్ని దర్శించవచ్చు. బయట కనిపించనిది శూన్యం కాదు. అది అనంతమైన దైవ ఉనికికి సూచన అనుకున్నాడు. చిదంబరం అనే పేరు లోనే చిత్తానికి, ఆకాశానికి సంబంధించిన ఆధ్యాత్మిక భావం దాగి ఉందని చెబుతారు. చిదంబర రహస్యం మనకు చెప్పే అంతరార్థం ఇదే. మనం బయటి ప్రపంచాన్ని జయించినంతలో సరిపోదు.. మనలోని అజ్ఞానం అనే తెర తొలగినప్పుడే నిజమైన ప్రశాంతత లభిస్తుంది. మనలో విషయ జ్ఞానం ఉన్నంతలో సరిపోదు.. అంతరంగంలో శూన్యం ఏర్పడ కూడదు. సంపద, హోదా, పేరు ప్రతిష్టల వెనుక పరుగులు తీస్తూ అంతరంగ పరిశీలన, దైవ చింతన విస్మరిస్తున్నాం. మనసులోని మాయా తెర తొలగినప్పుడు.. శివ తత్వం గోచరమౌతుంది. అదే చిదంబర రహస్యం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి