4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

పవిత్ర భండారా ఉత్సవం@ఆగ్రా..

 రాధా స్వామి మత ప్రవర్తకులు , మొదటి సంత్ సద్గురువు అయిన పరమ పురుష్ పూరన్ ధనీ హుజూర్ స్వామి మహారాజ్ జయంతి సందర్భంగా పవిత్ర భండారా ఉత్సవం శుక్ర వారం జన్మాష్టమి రోజున దయాళ్ బాగ్, ఆగ్రా లో నిర్వహించనున్నారు. 

హుజూర్ స్వామి మహారాజ్ 1818 ఆగస్టు 24 -25 మధ్య పవిత్ర జన్మాష్టమి రాత్రి ఆగ్రాలోని పన్నీ గలీలో సేట్ శివ్ దయాళ్ సింగ్ గా అవతరించారు. ఆయన జీవుల ఉద్ధరణ కు నిజ్ ఘర్ ప్రాప్తికి ప్రత్యక్ష మార్గమైన సూరత్ శబ్ద యోగాన్ని ప్రకాశింప చేసి , 1861, ఫిబ్రవరి 15, వసంత పంచమి రోజున సర్వ సాధారణ సత్సంగీయులకు రాధాస్వామి సత్సంగ ద్వారాలను తెరిచారు. భండారా వారం సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు జరుపబడుతుంది. ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, తూర్పు రాష్ట్రాలు, యూరప్ నుంచి అనేక మంది భక్తులు దయాళ్ బాగ్ కు విచ్చేయనున్నారు. శుక్రవారం ఉదయం పవిత్ర హారతి, రెండవ సెషన్ లో పొలాల్లో పవిత్ర భండారా నిర్వహించ బడుతుంది. స్వామీజీ మహారాజ్ బోధనలపై విశిష్ట సమ్మేళనాన్ని దయాళ్ బాగ్ ప్రస్తుతం జరుపుతోంది. 

2, సెప్టెంబర్ 2026, బుధవారం

తమిళనాడు ఆలయాల్లో.. నో మొబైల్స్

 తమిళనాడు లోని ప్రముఖ ఆలయాల్లో సెల్ ఫోన్లు తీసుకు రావడం పై హిందూ మత, దేవాదాయ శాఖ నిషేధం విధించింది . ఆలయాలలో యువత నిబంధనలను ఉల్లంఘిస్తూ రీల్స్, ఫోటోలు తీయడం గమనించిన అధికారులు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భక్తుల మొబైల్ ఫోన్లను భద్ర పరచడానికి ఆలయ ఎంట్రెన్స్ వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. 

ఒక్కో ఫోన్ కు రూ 5 చొప్పున వసూలు చేస్తున్నారు.  కాంచీ పురంలోని దేవరాజ స్వామి ఆలయంలో ఈ విధానం ఉదయం నుండే ప్రారంభం అయింది. ఫోన్ మోడల్, నంబర్ రిజిస్టర్ చేసి ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ఇస్తున్నారు. ఇది ఆలయాల ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బ తీస్తుందని అధికారులు పేర్కొన్నారు. మొబైల్ బ్యాన్ బోర్డులను ఎంట్రెన్స్ వద్దే ఏర్పాటు చేయాలని , పబ్లిక్ అనౌన్స్ మెంట్ ద్వారా భక్తులకు తెలియ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.