2, సెప్టెంబర్ 2026, బుధవారం

తిరుపతిలో శ్రీపాదం, అచ్యుతం వసతి సముదాయాలు..

 తిరుమలలో సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను ధ్వజారోహణంతో శ్రీకారం చుట్టబోతున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి ఈ ఉత్సవాల్లో భాగంగా 19 న అత్యంత విశేషమైన గరుడ సేవ ను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల కు వచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంటోంది. కొద్ది నెలల క్రితం తిరుమల లో అందుబాటులోకి వచ్చిన వసతి సముదాయం 5 ను పెద్ద సంఖ్యలో భక్తులు వినియోగించుకుంటున్నారు. తిరుమల లో 60 వేల మంది యాత్రికులకు వసతి కల్పించేలా 7600 గదులు , 5 పీ ఏ సీ లు ఉన్నాయి. అయినా భక్తులు గదుల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తిరుపతి లో కొత్త వసతి సముదాయాలను సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాల వేళ తిరుపతి లో భక్తుల కోసం నిర్మించిన శ్రీపాదం, అచ్యుతం వసతి సముదాయాలు ముఖ్య మంత్రి ప్రారంభించనున్నారు. ఈ మేరకు టీటీడీ తుది ఏర్పాట్లను వేగవంతం చేసింది. 

తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో గోవింద రాజ స్వామి సత్రాల స్థానంలో నిర్మిస్తున్న ఈ సముదాయాల పనులు చివరి దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రధాన భవనం, గదుల నిర్మాణం పూర్తయినా , లోపలి ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఈ రెండు సముదాయాల్లో భాగంగా ఒక్కో భవనంలో తొమ్మిది అంతస్తులు నిర్మించారు.దాదాపుగా 10 వేల మంది భక్తులకు వసతి సౌకర్యం కల్పించే వెసులుబాటు కలగ నున్నదని ఆలయ వర్గాల అంచనా.

రెండో అంతస్తులో రిసెప్షన్ , అన్న దానం , వసతి కేంద్రాలుంటాయి. మూడు,నాలుగు అంతస్తుల్లో 48 డార్మెటరీలు..సుమారు 7 వేల మంది భక్తులకు సరిపడా  లాకర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2024 మార్చి నెలలో ప్రారంభమైన వీటి నిర్మాణానికి రూ 600 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 

ఈ గదులను ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో కూడా పొందేలా భక్తులకు వినియోగంలోకి తీసుకు వచ్చే విధంగా తుది కసరత్తు కొనసాగుతోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి