తెలుసుకోవలసిన విషయాలు / telusukoavalsina vishayaalu. ధర్మ సందేహాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలుసుకోవలసిన విషయాలు / telusukoavalsina vishayaalu. ధర్మ సందేహాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, సెప్టెంబర్ 2026, ఆదివారం

ఏ దేవతా మూర్తులకు ఎలా ప్రదక్షిణం..

 ఏకం గణాధిపం కుర్యాత్ ద్వా సూర్యే 

త్రీని శంకరే చత్వారి కేశవం దేవే 

సప్త శ్వత్తే ప్రదక్షిణం..

అని పాంచ రాత్ర ఆగమం లోని పుష్కర సంహిత తెలియ జేయడం జరిగింది.గణపతికి ఒక సారి , సూర్య భగవానుడికి రెండు సార్లు,పరమేశ్వరుడికి మూడు సార్లు , శ్రీ మహా విష్ణువుకు నాలుగు సార్లు , అశ్వద్ధ వృక్షానికి ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలన్నది ఈ శ్లోకం యొక్క భావం.


శ్రీ దక్షిణా మూర్తి స్తోత్రం మహత్యం..

ఓం మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానాం .. అని ఆరంభమయ్యే శ్రీ దక్షిణా మూర్తి స్తోత్రం ఎంతో ప్రభావ వంతమైనది. ప్రతి రోజూ 10 నిమిషాలు శ్రీ దక్షిణా మూర్తి స్తోత్రం భక్తి శ్రద్ధలతో పఠనం చేయాలని పురాణాలు చెబుతున్నాయి.ఫలితంగా ఇంట్లో అన్ని అరిష్టాలు తొలగి పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సమస్త దుఃఖాలకూ కారణమైన అజ్ఞానాన్ని రూపు మాపే మూర్తి శ్రీ దక్షిణా మూర్తి.జ్ఞానానికి ప్రతీక అయిన ఆ స్వామి ఆవిర్భవించిన క్షేత్రం శ్రీ కాళహస్తి. ఇక్కడి అమ్మవారి పేరు శ్రీ జ్ఞాన ప్రసూనాంబ . మోక్షార్థుల అభీష్టాన్ని నెరవేర్చే పరమాత్మ కూడా దక్షిణా మూర్తి యే..

శ్లోకామృతం..

ఆపత్సు మిత్రం జానీయాత్ యుద్ధే శూరం రుణే శుచిం 

భార్యాం క్షీణేషు విత్తేషు వ్యసనేషు చ బాంధవాన్..

ఈ సందేశాత్మక శ్లోకం నారాయణ పండితుడు రచించిన " హితోపదేశం " గ్రంథంలోనిది.ఆపదలో ఉన్నప్పుడు మిత్రుల గుణం, యుద్ధ రంగంలో శూరుల లక్షణం , అప్పు ఇచ్చినప్పుడు ఎదుటి వారి నిజాయితీ , ధనం కోల్పోయి పేదరికం అనుభవిస్తున్నప్పుడు భార్య ప్రేమ గురించి ,అపాయం వాటిల్లినప్పుడు ఎవరు నిజమైన బంధువులో గుర్తించ వచ్చు అన్నది ఈ శ్లోకానికి అర్థం.

అంతా సవ్యంగా ఉన్నపుడు అందరూ దగ్గర చేరుతారు.ఆత్మీయంగా మాట్లాడుతారు. కానీ సమస్యలు చుట్టు ముట్టినప్పుడు , దుఃఖంతో బాధ పడుతున్నప్పుడు .. వ్యక్తుల ప్రవర్తనలో మార్పులు వస్తాయి. వారు ఎదుర్కొంటున్న పరిస్థితుల ప్రభావం తమ మీద పడుతుందేమో , తాము అందులో చిక్కు కుంటామేమో.. అని వెరచి దురమౌతుంటారు.అందుకే కష్ట సమయంలో ఆసరా అందించే వారే అసలైన ఆత్మీయులని ఈ శ్లోకం చాటుతుంది.

1, మే 2026, శుక్రవారం

నైవేద్యాలలో ఉల్లి,వెల్లుల్లి ఎందుకు వాడరు..

 నీరుల్లిపాయ, వెల్లుల్లిపాయలు వినియోగం దైవ నివేదనలు ప్రసాదాలలో కనిపించదు. అలాగే పూర్వకాలం నుంచే కొన్ని వర్గాల వారికి వాటిని తమ ఆహారంలో వాటిని వినియోగించకపోవడం ఆచారంగా వస్తోంది .ఆధ్యాత్మిక సాధనకు, ప్రశాంత జీవనానికి సాత్విక ఆహారం ప్రధానమని సాధకులు చెబుతారు .నీరుల్లిని, వెల్లుల్లిని తామస రజోగునాలను పెంచే పదార్థాలుగా పూర్వులు పేర్కొన్నారు. అది కోపాన్ని ,ఆందోళనను, వాంఛలను పెంచుతాయి. కాబట్టి యోగ సాధనకు ఆటంకం కలిగిస్తాయని నమ్ముతారు.

లశునం గృంజనం చైవ పలా0డుం కవకాని చ అభక్ష్యాని ద్విజాతీనాం అమేధ్య ప్రభవాణి చ.. అని మనుస్మృతి చెబుతోంది. లశునం /ఎల్లుల్లి, గుంజనం /ముల్లంగి, పలాండం/ ఉల్లిపాయ, కవకాని /పుట్టగొడుగులు ఇవి అశుద్ధమైన చోట పుడతాయి కాబట్టి ఉపాసకులు శ్రీ విద్యాసాధకులు వాటిని తినకూడదు అని భావము.

ఆధ్యాత్మికపరంగా.. ఆత్మశుద్ధి, సాత్విక జీవనశైలి కోసం ఉల్లిని ,వెల్లుల్లిని నిషిద్ధంగా పరిగణిస్తారు. అవి మనస్సును చంచలం చేస్తాయని చెబుతారు.

 ఆయుర్వేదము యోగ శాస్త్రం ప్రకారం.. ఉల్లిపాయలు తామస రజోగుణ ప్రేరేపకమైన పదార్థాలు. అవి శరీరంలో పైత్య రసాన్ని పెంచుతాయి. ఆవేశాన్ని, వాంఛలను రేకెత్తిస్తాయి. 

పౌరాణికంగా చూస్తే.. రాహు ,కేతువుల రక్త బిందువుల నుంచి ఉల్లి ,వెల్లుల్లి పుట్టాయంటారు .అందుకే వాటిని అశుద్ధమైనదిగా, రాక్షస ప్రవృత్తి కలిగించేదిగా భావిస్తారు.

దైవానికి నివేదన చేసే విషయానికి వస్తే.. పూజలలో దేవునికి సమర్పించే నైవేద్యములో ఉల్లి, వెల్లుల్లిని అపవిత్రంగా భావించి వినియోగించరు. కాలక్రమైనా మారుతున్న అలవాట్ల వల్ల పూర్వం వీటిని ఉపయోగించని వర్గాలు కూడా స్వీకరిస్తున్నప్పటికీ ,సంప్రదాయ ఆచారాలు పాటించేవారు ఇప్పటికీ దూరంగానే ఉంటారు. అయితే పూజల్లో వినియోగం, సాధకుల నియమాలను పక్కన పెడితే ..నిత్య ఆహార పదార్థాలలో వీటిని వాడే విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదు.