13, అక్టోబర్ 2026, మంగళవారం

నాన బియ్యం బతుకమ్మ.. శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం..

 తెలంగాణ పూల పండుగ బతుకమ్మ సంబరాలలో నాలుగవ రోజైన ఆశ్వయుజ శుద్ధ తదియనాడు నానవేసిన బియ్యాన్ని గౌరమ్మకు నివేదిస్తారు .కాబట్టి నాన బియ్యం బతుకమ్మ అని పిలుస్తారు. గునుగు, తంగేడు పూలతో నాలుగు వరుసల్లో బతుకమ్మను పేరుస్తారు. శిఖరం మీద గౌరమ్మను నిలిపి పూజిస్తారు.

 ఈ రోజు నైవేద్యంగా..

 నానవేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపిన వంటకాలు సమర్పిస్తారు. 

దేవీ నవరాత్రులలో నేటి అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం. అశ్వయుజ శుద్ధ తదియ..

శరన్నవరాత్రి మహోత్సవాలలో  మూడవ రోజున శ్రీ అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని అలంకరిస్తారు. శ్రీ అన్నపూర్ణాదేవి అన్నాన్ని ప్రసాదించే మాతృమూర్తి.  అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం సర్వ జీవనాధారం. అన్నం లేనిదే జీవులకు మనుగడ లేదు.. అన్నపూర్ణా దేవి సాక్షాత్తు శివ స్వరూపిణి. ఈశ్వరుడికి భిక్ష  పెట్టిన దేవత. అమృతాన్నంతో ఉన్న బంగారు పాత్ర ను, వజ్రాలు పొదిగిన గరిటను ఆమె ధరించి ఉంటుంది. అన్నపూర్ణాదేవి ధరించిన రస పాత్ర అక్షయ శుభాలను అందిస్తుందంటారు .ఆమెను కుంకుమతో పూజించాలి. జ్ఞాన బిక్ష పెట్టాలని, వైరాగ్యం కలగజేయాలని కోరుకోవాలి. నిత్యాన్న దానేశ్వరి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించిన వారికి మేధాశక్తి కలుగుతుందని భక్తుల నమ్మిక. ఈ తల్లిని ధ్యానిస్తే ధన, ధాన్య వృద్ధి ,మధుర భాషణం ,ఐశ్వర్య సిద్ధి కలుగుతాయని పెద్దలు చెబుతారు.

 నైవేద్యంగా.. కట్టె పొంగలి, పరమాన్నము.

 అలంకరించే చీర రంగు.. ఎరుపు.

 అర్చించే పూల రంగు..  తెలుపు.

 పారాయణం.. అన్నపూర్ణాష్టకం ,స్తోత్రాలు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి