9, నవంబర్ 2026, సోమవారం

ఆధ్యాత్మికత అంటే..

 పువ్వు పుడుతూనే పరిమళిస్తుంది అన్నట్లుగా జిడ్డు కృష్ణమూర్తి చిన్న వయసులోనే ఉన్నత భావాలను వ్యక్తపరిచేవారు .అతడి పరిపక్వతను ,ఔన్నత్యాన్ని గుర్తించిన పెద్దలు ఆయనను ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అనే ఆధ్యాత్మిక సంస్థకు నాయకుడిగా చేశారు. ఆయన ఆలోచనలకు ప్రభావితమై ప్రపంచవ్యాప్తంగా ఎందరో అక్కడికి వచ్చేవారు. కానీ కొన్నాళ్లకు కృష్ణమూర్తి ఒక నిర్ణయం తీసుకొని ఆ సంస్థను రద్దు చేశారు. అందుకు కారణం తనను గురువుగా అనుసరించడం వల్ల ఎవరూ నిజమైన స్వేచ్ఛను పొందలేరని తెలియజేశారు. ఆయన జీవితమంతా ఒక విషయాన్ని బలంగా చెప్పారు. మనిషి స్వేచ్ఛగా ఆలోచించాలి గాని భయంతో ఇతరులు చెప్పిన వాటిని నమ్మడం, ఆ ప్రకారం నడుచుకోవడం కూడదు. ఎక్కువ మంది ఆచరిస్తున్నంత మాత్రాన అదే నిజమని భావించకూడదు. అలాగే గురువు చెప్పిన తరువాత ప్రశ్నించకుండా అంగీకరించడం సరికాదు. సాధారణంగా ఆధ్యాత్మిక గురువులు తమను అనుసరించమంటారు కానీ కృష్ణమూర్తి మీ అంతరంగాన్ని పరిశీలించండి అని చెప్పేవారు. మనిషిని అన్ని రకాల మానసిక బంధనాల నుంచి విముక్తి చేయడం కృష్ణమూర్తి లక్ష్యం. అందుకే ఆయన ఎంతో విలక్షణం. నిజమైన గురువులు శిష్యులు తనపై ఆధారపడేలా చేయరు .తమలోని భయాన్ని, అజ్ఞానాన్ని గ్రహించేలా ,తమను తాము మార్చుకునేలా చేస్తారు. మనం ఇతరుల నీడగా ఉండకూడదు. మన జీవితానికి మనమే బాధ్యత వహించాలి .ఆధ్యాత్మికత అంటే ఎవరో ఒకరిని గుడ్డిగా అనుసరించడం కాదు. విషయాని క్షుణ్ణంగా పరిశీలించి, ఏది సత్యము, ఏది కాదు అర్థం చేసుకోవాలి .ఆ ప్రకారంగా నడుచుకోవాలి అని కృష్ణమూర్తి తెలియజేశారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి