బాన్సువాడ మండలం బోర్లం గ్రామ సమీపంలోని రాతి గుట్టపై ప్రకృతి ఒడి మధ్యలో కొలువుదీరిన ఆది బసవేశ్వర ఆలయం నాలుగు శతాబ్దాలుగా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది .తరతరాలుగా భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రానికి తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ,ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు . ఆలయం లోని బసవేశ్వరుడు స్వయంభువుగా వెలిశాడని భక్తుల విశ్వాసం. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం. శ్రావణమాసం ప్రతి సోమవారం, మహాశివరాత్రి వంటి పర్వదినాలలో భక్తుల రద్దీ పెరుగుతుంది .
స్థల పురాణం ఇదీ ..
ఆలయానికి సంబంధించిన ఆసక్తికరమైన స్థల పురాణం ప్రచారంలో ఉన్నది. సుమారు 400 ఏళ్ల క్రితం బిచ్కుంద మఠాధిపతి మడిమాలప్ప స్వామికి బీదర్ ప్రాంతంలో ఓ కోడెదూడను కానుకగా ఇచ్చినట్లు చెబుతారు .దానిని బిచ్కుందకు తీసుకెళ్తుండగా బోర్లం రాతి గుట్ట వైపు వెళ్లినట్లు స్థానికుల కథనం. అక్కడ జొన్న పంటను మేయడంతో కాపర్లు దానిని తరిమారు. గుట్ట సమీపానికి చేరుకున్న కోడె పెద్దగా రంకె వేసి అదృశ్యమైనట్లు స్థల పురాణం చెబుతోంది. ఈ విషయం మడిమాలప్ప స్వామికి తెలియడంతో స్వామి కలలో కనిపించి గుట్టపై శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు చేయాలని సూచించినట్లు భక్తుల విశ్వాసం. దీనితో ఆయన బిచ్కుంద నుంచి శివలింగాన్ని తీసుకొచ్చి గుట్టపై ప్రతిష్టించి పూజలు ప్రారంభించినట్లు చెబుతారు .ప్రస్తుతం ఆలయం బిచ్కుంద బండాయప్ప మఠం ఆధ్వర్యంలో పీఠాధిపతి సోమాయప్ప పర్యవేక్షణలో కొనసాగుతోంది. ప్రతినిత్యం అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తూ ఉండగా శ్రావణమాసంలో ప్రత్యేక పూజలు, ప్రతి సోమవారం అఘోర పశుపతి హోమం, రుద్రాభిషేకాలు, మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది .
బావినీటికి ప్రత్యేకత..
ఆలయ గుట్ట కింద ఉన్న బావినీటికి కూడా ప్రత్యేకత ఉందని స్థానికులు చెబుతారు . నీరు పాలవలే తెల్లగా, మధురంగా ఉంటుందని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక కథ ప్రచారంలో ఉన్నది. బిచ్కుంద బండయప్ప స్వామి జీవించి ఉన్న సమయంలో శ్రావణ మాసంలో ఇక్కడ ఏటా అన్నదానం నిర్వహించేవారు. ఓసారి నైవేద్యం కోసం పోలెలు తయారు చేస్తుండగా నెయ్యి తక్కువ కావడంతో ఆయన ఆదేశాల మేరకు శిష్యుడు బావి నుంచి నెయ్యి తీసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. చారిత్రక నేపథ్యం, స్థల పురాణం, ప్రకృతి అందాలతో ప్రత్యేకతను సంతరించుకున్న ఈ క్షేత్రానికి ఏటా భక్తుల తాకిడి పెరుగుతోంది .ఆలయానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించి క్షేత్ర చరిత్రను భావితరాలకు అందించేలా ప్రభుత్వం ,పాలకులు అభివృద్ధి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. తద్వారా ఆది బసవేశ్వర ఆలయం ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా పర్యాటక ప్రాంతంగాను అభివృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
పెరుగుతున్న బసవేశ్వరుడు
గత 35 ఏళ్లుగా ఆలయంలో పూజారిగా సేవలందిస్తున్న ఆలయ పూజారి శ్రీధర్ అప్ప గారు ఇలా అంటున్నారు. సాధారణంగా శివాలయాలలో గర్భగుడిలో శివలింగం గర్భగుడి బయట నందీశ్వరుడు ఉంటాడు. కానీ ఆది బసవేశ్వర ఆలయంలో గర్భగుడిలో శివలింగంతోనే నందీశ్వరుడు ఉండడం విశేషం .భక్తులు నమ్మకంతో కొలిచే బసవేశ్వరుడు ప్రతి ఏటా పెరుగుతూ కనిపించడం ఇక్కడే ప్రత్యేకత.
ఆది బసవేశ్వర ఆలయం మా గ్రామంలో ఉండడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ప్రతి సోమవారం చిన్ననాటి నుండి బసవేశ్వరుని దర్శించుకుంటాను అని గ్రామస్తులు కేశెట్టి రఘునాథ్ గుప్తా గారు అన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి