15, అక్టోబర్ 2026, గురువారం

6 వ రోజు.. అలిగిన బతుకమ్మ

 ఆరవ రోజైన పంచమి నాటి వేడుకను అలిగిన బతుకమ్మ లేదా అల్నె బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజున గ్రామాల్లో బతుకమ్మ ను పేర్చడం గానీ , చెరువు గట్టు వద్ద ఆటలు ఆడడం గానీ చేయరు. పూర్వం గౌరమ్మ ను పేర్చే క్రమంలో ఏదో పొరపాటు జరగడం వల్ల అమ్మవారు అలిగారనే జానపద కథ ప్రచారంలో ఉన్నది. మాంసపు ముద్ద తగిలి అపచారం జరిగిందట.అందుకని ఈ రోజు బతుకమ్మ అలిగి ఏదీ తినదు అంటారు.  అందువల్ల అమ్మవారి పట్ల ఉన్న భయాందోళనలు , గౌరవంతో ఈ రోజు ఆడ పడుచులు పూలను సేకరించరు. బతుకమ్మలను తయారు చేయరు.నైవేద్యం కూడా ఏదీ సమర్పించరు. బతుకమ్మ అలక తీరాలని మహిళలు ప్రార్థిస్తారు. ఐదు రోజుల పాటు కస్టపడి బతుకమ్మలను పేర్చిన మహిళలకు ఇది ఒక చక్కని విశ్రాంతిగా ఉపయోగ పడుతుంది. 

పూల సందడి లేకపోయినా ఇంట్లోని పూజా మందిరంలో దీపం వెలిగించి గౌరమ్మను స్మరించుకుంటారు. ఊరి ప్రజలంతా ఈ రోజున రాబోయే సద్దుల బతుకమ్మ ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటారు.ప్రకృతిలోని పూలకు కూడా ఒక రోజు విశ్రాంతి ఇవ్వడం వెనుక ఉన్న గ్రామీణ తర్కం ఎంత గొప్పదో అర్థమౌతుంది.నిరంతరం శ్రమించే మనుషులకు ,ప్రకృతికి విరామం ఇచ్చే ఈ సంప్రదాయం పల్లెల విశిష్టతను చాటుతుంది.మరుసటి రోజు జరుపుకునే వేడుకల కోసం గ్రామం సిద్ధమవుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి