22, నవంబర్ 2026, ఆదివారం

వెంకన్నకు భక్తుడి భారీ విరాళం

 140 కిలోల స్వర్ణ ఆభరణాలు సమర్పించనున్న భక్తుడు.. 200 కోట్ల రూపాయల విలువ గల ఆభరణాలు.. తిరుమల చరిత్రలో ఇదే అత్యధిక వ్యక్తిగత విరాళం.. 26న అందించనున్నదాత.. 

తిరుమల ఆలయ చరిత్రలోనే శ్రీవారికి అత్యంత భారీ మొత్తంలో విరాళం సమర్పించడానికి ఒక భక్తుడు సిద్ధమయ్యారు. చెన్నైకి చెందిన ఒక భక్తుడు సుమారు 200 కోట్ల రూపాయలకు పైగా విలువైన నూట నలభై నుంచి 150 కిలోల బంగారు ఆభరణాలను స్వామివారికి సమర్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నెల 26న ముఖ్యమంత్రి చేతుల మీదుగా వీటిని శ్రీవారికి సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వాస్తవానికి ఏడాది క్రితమే ఒక భక్తుడు శ్రీవారికి 121 కిలోల బంగారాన్ని విరాళంగా అందించేందుకు సిద్ధమైనట్లు ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేవలం బంగారం ఇచ్చినంత మాత్రాన వాటిని వివిధ అవసరాలకు టిటిడి వినియోగించే ఆస్కారం ఉండదని ఆ భక్తుడు భావించారు. ఈ నేపథ్యంలో స్వామివారికి నిత్యం వివిధ కైంకర్యాలు, ఉత్సవాల సందర్భంగా వాటిని ఉపయోగించడానికి వీలుగా ఆభరణాలను తయారు చేయించి విరాళంగా అందించాలని నిర్ణయించారు .ఈ నేపథ్యంలో అత్యంత నాణ్యమైన మేలిమి బంగారంతో 45 రకాల బంగారు ఆభరణాలను భక్తుడు కానుకగా సమర్పించనున్నట్లు తెలిసింది. ఆభరణాల తయారీకి సుమారు 140 కిలోలకు పైగా వినియోగించినట్లు తెలుస్తోంది. శ్రీవారికి రాజులు పెద్ద సంఖ్యలో వివిధ సందర్భాలలో ఆభరణాలు, ఆలయానికి అవసరమైన పాత్రలు, భూములను విరాళంగా భక్తి భావంతో సమర్పించారు. ఆ తర్వాత కొందరు దాతలు బంగారు ,వెండి ఆభరణాలు, కిరీటాలు చేయించారు. అయితే వ్యక్తిగతంగా ఇంత భారీ స్థాయిలో ఎవరు శ్రీవారికి విరాళంగా అందించలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

ఇతను తయారు చేయించిన ఆభరణాల్లో సాలగ్రామ హారాలు,కిరీటం, లక్ష్మీ హారాలు, శంఖు చక్రాలు, కర్ణ పత్రాలు, కటి హస్తం,వరద హస్తం, పాదాభరణాలు తదితరాలు ఉన్నట్లు తెలుస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి