మాయా జూదము లో అధర్మమే గెలిచింది .పాండవులు హస్తినాపురాన్ని వదిలి అడవుల బాట పట్టారు. అక్కడ కూడా దుష్ట చతుష్టయం వారిని అష్ట కష్టాలకు గురిచేసింది. ఇక యుద్ధం అనివార్యము అని తేలిపోయింది. అస్త్ర శస్త్రాల అండ లేకపోతే అక్షౌహీనుల కొద్దీ శత్రు సైన్యాన్ని నిలువరించడం అసాధ్యమని కుంతి పుత్రులకు అర్థమయింది .వ్యాసుల వారి ఆదేశంతో పశుపతిని మెప్పించి పాశుపత అస్త్రాన్ని సాధించడానికి ఇంద్రకీలాద్రికి చేరుకున్నాడు అర్జునుడు. ఆ పర్వత అధినాయకురాలైన దుర్గమ్మను ప్రార్థన చేసి తపోదక్ష తీసుకున్నాడు. పార్ధుడి ఏకాగ్రతకు ఏ భంగము వాటిల్లకుండా సమస్త ప్రకృతిని శాంతింప చేసింది శాంకరి .ఆ కఠోర దీక్ష పరమశివుడిని కదిలించింది .అయినా అతని భుజ బలాన్ని స్వయంగా పరీక్ష చేయాలని అనుకున్నాడు పరమశివుడు. తాను కిరాతుడి వేషం ధరించి ఓ మాయ సూకరాన్ని సృష్టించాడు. ఆ అడవి పంది అరుపులకు అర్జునుడి ఏకాగ్రత చెదిరిపోయింది. కోపంతో నారి సారించాడు. అంతలోనే కిరాతుడు బాణం వేశాడు, వరుస శరాఘాతాలకు ఆ సూకరం ప్రాణాలు వదిలివేసింది .నేను చంపానని అర్జునుడు కాదు, కాదు నేనే చంపానని కిరాతుడు వాదించుకున్నారు .పంతం కొద్ది మల్ల యుద్ధానికి సిద్ధపడ్డారు. కిరాతార్జునుల పోరాటం ముల్లోకాలను వనికించింది .ఆ పోరు వల్ల అర్జునుడి వీరత్వం శివుడికి తెలిసిపోయింది. ఆ కిరాతుడు శంకరుడు అనే సంగతి అర్జునుడికి అర్థం అయిపోయింది. శౌరి పరాక్రమానికి మెచ్చి పాశుపతాన్ని ప్రసాదించాడు పరమేశ్వరుడు. ఆ సందర్భంగా అక్కడే శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాడు విజయుడు. అదే విజయేశ్వర లింగం గా ప్రాచుర్యం పొందింది .అర్జునుడితో మల్ల యుద్ధం చేసిన దేవుడు కాబట్టి శివుడికి మల్లేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఫల్గుణుడు నడయాడిన ప్రాంతం కావడంతో ఇంద్రకీలాద్రిని ఫల్గుణ క్షేత్రము అని అంటారు. విజయుడి తపోస్తలి విజయపురిగా విజయవాటికగా విజయవాడగా చరిత్రకి ఎక్కింది. ద్వాపర నాటికే ఇది సిద్దుల స్థిర నివాసం. ముక్కోటి దేవతల దర్శనీయ స్థలం. ఇంద్రకీలాద్రి వైభవాన్ని వర్ణిస్తూ ఇక్కడ ప్రతి ఋతువులోనూ వసంతంలోని పూల పరిమళాలు, శరత్తు లోని నిర్మలత్వము కలిసి కనువిందు చేస్తాయని పరవశంగా చెబుతాడు కిరాతార్జునీయం లో కవి భారవి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి