23, నవంబర్ 2026, సోమవారం

నరక హరణం.. జ్వాలా తోరణం

 లోక కంటకులైన త్రిపురాసురులను సంహరించి కైలాసానికి విజయం చేసిన పరమేశ్వరునికి జ్వాలాతోరణంతో స్వాగతం చెప్పింది పార్వతి మాత. స్వామికి తగిలిన దిష్టి ఈరకంగా అమ్మవారు తొలగించింది. అప్పటినుంచి కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణం నిర్వహించడం శైవ క్షేత్రాలలో ఆనవాయితీగా మారింది. కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది. ఈ నిర్మాణం పై నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటూ ఇటూ మూడుసార్లు ఊరేగిస్తారు. మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఒక కారణం ఉన్నది. యమలోకంలోకి వెళ్లిన వారికి మొదట దర్శనం ఇచ్చేది అగ్నితోరణం .యమలోకానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఈ తోరణం గుండానే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. దీనిని తప్పించుకోవాలంటే ఈశ్వరుడిని ప్రార్థించడం ఒక్కటే మార్గం . అందుకే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడుసార్లు అటు ఇటు వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది. అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదని పురాణ కథనము. జ్వాలతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోనో,గడ్డివాములోనో, ధాన్యాగారంలోనో భద్రంగా పెడతారు. శివ స్పర్శ ఉన్న ఈ భస్మం ఉన్నచోటికి ఉగ్ర భూతాలు ప్రవేశించలేవు .ఇది ఉన్న ప్రాంతంలో సుఖశాంతులు కలుగుతాయి. తోరణానికి మిగిలిన ఎండు గడ్డిని, సగం కాలిన గడ్డిని కూడా రైతులు గడ్డివాములలో కలుపుతారు. ఆ వాములలోని గడ్డిని మేసిన పశుసంతతి బాగా అభివృద్ధి చెందుతుందని నమ్మకం. 

ఉసిరి చెట్టు నీడలో..

 కార్తీక మాసంలో వనభోజనం ప్రాధాన్యత ఏమిటంటే..

యః కార్తికే సితే పక్షే, వన భోజన మాచరేత్.. సయాతి వైష్ణవం ధామం, సర్వ పాపై: ప్రముచ్యతే.. 

అంటే కార్తీకమాసం శుక్లపక్షంలో వన భోజనం చేసిన వారు పాపాల నుండి విముక్తి పొంది విష్ణు లోకాన్ని పొందుతారని కార్తీక పురాణం చెబుతున్నది .కార్తీక మాసంలో శ్రీలక్ష్మి, నారాయణులు ఇద్దరు ఉసిరి చెట్టును ఆశ్రయించి ఉంటారని విష్ణు పురాణ కథనం. ఉసిరి అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఉసిరి చెట్టును దైవంగా భావిస్తారు. అందుకే వనభోజన సమయంలో ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని గాని ,విగ్రహాన్ని గాని ఉంచి పూజలు చేసి అందరూ కలిసి భోజనాలు చేయడం ఆచారంగా మారింది. శ్రీకృష్ణుడు తన సోదరుడైన బలరాముడు ఇతర గోప బాలురతో కలిసి యమునా తీరం బృందావనంలో ఉసిరి మొదలైన వృక్షాల నీడలో వనభోజనం చేసినట్లుగా భాగవతం పేర్కొంది. సూత మహర్షి   శౌన కాది మునులతో కలిసి నైమిశారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వనభోజనం చేశారని కార్తీక పురాణ కథనం. యుగయుగాలుగా వస్తున్న సంప్రదాయంలో ఆధ్యాత్మికత ఆనందంతోపాటు నలుగురితో కలిసిపోయే సామాజిక చైతన్యము కూడా ఉన్నది.