27, నవంబర్ 2026, శుక్రవారం

ముగ్గులే దైవం..

 ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లా గును పురంలోని సవరల సమూహంలోని ఒక తెగవారు ముగ్గులనే దైవంగా భావించి పూజిస్తారు. సాధారణంగా దేవుడిని విగ్రహాల రూపంలోనో ,చిత్రపటాల రూపంలోనో పూజిస్తుంటే ..వారు గోడలపై ముగ్గులను చిత్రీకరించి ఆరాధిస్తారు. వారి ఇళ్లలోకి అడుగుపెడితే" ఇడితల్ ముగ్గులే " కనిపిస్తాయి. వివాహం, దైనందిన జీవనం, పితృదేవతలు, ఆచారాలు ఉట్టిపడేలా ముగ్గులు చిత్రీకరించి కొలుస్తారు. ఈ సంస్కృతిని కాపాడేందుకు ఏటా డిసెంబర్ మాసంలో" ఇడితల్ చొయితి"  పేరిట ఉత్సవాలు కూడా నిర్వహిస్తుంటారు. 



26, నవంబర్ 2026, గురువారం

సజీవ బోధిసత్వుడు.. దలై లామా..

 గత కొన్ని దశాబ్దాలుగా టిబెట్ బౌద్ధులకు అత్యున్నత ఆధ్యాత్మిక నేత గా వ్యవహరిస్తున్న 14 వ దలై లామా వయస్సు పెరుగుతుండటంతో ( ప్రస్తుతం 91 ఏళ్లు ) .. ఆయన వారసుడు ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది. 

దలై లామా పూర్తి పేరు " జెట్ సన్ జాంపెల్ ఉంగా లొబ్ సంగ్ యెషె టెన్ జిన్ గ్యత్సో". టిబెటన్లు దలై లామా ను జీవించి ఉన్న బోధి సత్వుడిగా, అవలోకితేశ్వర అవతారంగా ఆరాధిస్తుంటారు. ఆధ్యాత్మిక , రాజకీయ, దైనందిన జీవితంలో ఆయన మార్గ నిర్దేశనం ప్రకారం నడుచుకుంటారు. టిబెట్ వాసులు విశ్వసించే మహా యాన, వజ్ర యాన బౌద్ధాన్ని , కాల చక్ర బోధనలను ప్రచారం చేస్తూ దలై లామా ప్రపంచ వ్యాప్తంగా పర్యటించారు. మతం, సైన్స్, పర్యావరణం, ఆర్థిక రంగం, మహిళా హక్కులు, న్యూరో సైన్స్ తదితర అంశాల గురించి ఆయన ప్రసంగించారు. 1989 లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. అహింస విషయంలో మన జాతి పిత గాంధీ జీ కి వారసుడు దలై లామా నే అని ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రకటించింది. 

దలై లామా వారసుడిని ఎన్నుకునే ప్రక్రియ పూర్తిగా టిబెట్ బౌద్ధుల మత విశ్వాసాలకు అనుగుణంగా జరుగుతుంది. దలై లామా మరణానంతరం జన్మించిన బాలురను సీనియర్ లామా లు పరిశీలించి , వారిలో ఒకరిని కొత్త దలై లామా గా ఎంపిక చేసి ప్రకటిస్తారు. ఆ బాలుడికి యుక్త వయసు వచ్చే వరకు ఆధ్యాత్మిక అంశాల్లో కఠోర మైన శిక్షణ ఇస్తారు. దలై లామా కార్యాలయాన్ని.. గాడెన్ పొడ్రాంగ్ ట్రస్ట్.. అని పిలుస్తారు.