దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మదించేందుకు సిద్ధమయ్యారు. ఆ ప్రయత్నంలో మందర పర్వతాన్ని కవ్వంగానూ , నాగ దేవత వాసుకిని కవ్వపు తాడుగానూ చేసుకున్నారు. ఓ శుభ ముహూర్తంలో సముద్ర మధనాన్ని ఆరంభించారు. కవ్వపు తాడును ఒక వైపు దేవతలు, మరో వైపు రాక్షసులు పట్టుకున్నారు. అలా చిలుతుంటే .. మందర పర్వతం సముద్రంలోకి జారి పోతుంది. దాంతో భయపడిన దేవతలు శ్రీ మహా విష్ణువును ప్రార్థించారు. అప్పుడు విష్ణువు తాబేలు రూపం ధరించాడు.
కూర్మ రూపంలో మందర గిరిని పైకెత్తి , తన వీపు మీద మోసి సముద్ర మధనానికి ఆటంకం కలగకుండా రక్షించాడు స్వామి. అప్పటి నుంచి ఆ లక్ష్మీ నాథుడు కూర్మ రూపంలోనూ పూజలందుకుంటున్నాడు.కూర్మావతారం భక్తుల పాలిట అభయావతారం . కంచెర్ల గోపన్న దాశరథీ శతకం లో విష్ణు భగవానుడు దాల్చిన కూర్మ రూపానికి అక్షరాంజలి ఘటిస్తూ కూర్మమై దరాధరము భరించితీవే కద దాశరథీ కరుణాపయోనిధీ .. అని స్మరించుకున్నాడు. అలాగే నరసింహ శతకంలో శేషప్ప కవి , గీత గోవిందంలో భక్త జయదేవుడు తదితరులు కూడా లక్ష్మీ నాథుడి కూర్మ లీలా విన్యాసాలను మనోహరంగా మననం చేసుకున్నారు.
ఆలయాల్లో ఆరాధనలు..
శ్రీ మహా విష్ణువును కూర్మావతారంలో ఆరాధించే ఆచారం ఉంది ,కాబట్టి ఆ రూపంలోనూ ఆలయాలున్నాయి.శ్రీకాకుళానికి 40 మైళ్ళ దూరంలో వంశధార తీరాన ఉన్న శాలి హుండం కొండకు ' కూర్మాద్రి ' అనే పేరు కూడా ఉంది ఆ జిల్లాలోనే శ్రీకూర్మం అనే పుణ్య క్షేత్రం వెలసింది అక్కడి ఆలయంలో స్వామి కూర్మ నాయకుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఆ దేవాలయంలో కూర్మ నాధుడు స్వయంభువుగా వెలయడం విశేషం. స్థల పురాణం అనుసరించి చంద్రవంశ మహా రాజైన శ్వేత చక్రవర్తికి ఆ శేష శయనుడు కూర్మ నాధుడిగా ప్రత్యక్ష మయ్యాడు.అలాగే శ్రీకూర్మం లో వెలసిన కూర్మ నాధుడిని కుశ లవులు, బల రాముడు దర్శించుకున్నట్లుగా కథలు ప్రచారంలో ఉన్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి