మహారాష్ట్రలో నిలువు కాళ్ల నవరాత్రి.. 9 రోజుల పాటు నేలపై కూర్చోవద్దు.. పడుకోవద్దు..
మహారాష్ట్ర లోని సతారా జిల్లా వాయీ తాలూకాలో గల పాండే గ్రామములో జరిగే నవరాత్రి ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది .జీవనోపాధి కోసం గ్రామానికి దూరంగా వెళ్ళిన వారు సైతం ఈ పండుగకు ఊరికి తరలి వస్తారు. ఉత్సవాలు జరిగే 9 రోజులు గ్రామస్తులు " నిలువు కాళ్ల నవరాత్రి" ( ఉభ్యాచ నవరాత్ర ) ఆచారాన్ని పాటిస్తారు.గత 350 సంవత్సరాల నుంచి అనుసరిస్తున్న ఈ వ్రతంలో 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు గల సుమారు వంద మంది పురుషులు పాల్గొంటారు. వీరిని " నవరత్కారిస్" అంటారు.
స్థానికంగా ఉన్న శ్రీ కాల భైరవనాథుడి ఆలయంలో ఆచరించే ఈ వ్రతంలో భక్తులు వరుసగా తొమ్మిది రోజుల పాటు రాత్రీ పగలు నిలబడే ఉంటారు. నేల మీద కూర్చోరు,పడుకోరు.అలసటగా అనిపిస్తే ఊయలలాగా వేలాడ దీసిన బల్లల మీద నడుం వాల్చి ఒక కాలును మాత్రం నేలపైనే ఉంచుతారు. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక సభ్యుడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. 3 ,5 ,7, 10 ఏళ్ళు.. వీలైతే అంతకంటే ఎక్కువగా ఇందులో పాల్గొంటామని గ్రామ దేవతను మొక్కుకుంటారు .కనీసం ఒక కాలైనా నేలపైనే ఉండాలి. బ్యాలెన్స్ కోసం కర్రలను దగ్గరగా పెట్టుకుంటారు. పాలు, పండ్ల వంటి సాత్విక ఆహారంతో ప్రత్యేక ఉపవాసం పాటిస్తారు. కాల కృత్యాల కోసం తెల్లవారుజామున ఇళ్లకు వెళ్లి తిరిగి వస్తారు అని ఆలయ కమిటీ చైర్మన్ హేమంత్ యాదవ్ వివరించారు. గ్రామంలోని హిందువులతో పాటు ముస్లింలు కూడా ఈ వ్రతంలో పాల్గొనడం మరొక విశేషం.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి