18, అక్టోబర్ 2026, ఆదివారం

లక్ష్మీ నరసింహ స్వామి కి చక్ర తీర్థం..

 మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ లోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద విజయ దశమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ దసరా మరుసటి రోజు చక్ర తీర్థం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజు సాయంత్రం అటవీ ప్రాంతంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవ విగ్రహాలను రథంలో ఊరేగిస్తూ భజన చేస్తూ దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చుక్కాపూర్ గ్రామంలోని ఆలయానికి చేరుకుంటారు. కామారెడ్డి సిరిసిల్ల రోడ్ నుంచి గ్రామంలోని ఆలయం వరకు కనుల పండుగ గా కోలాటం , భజన కార్యక్రమాలు సాగుతాయి. కోరిన కోరికలు తీరిన భక్తులు ఈ రోజు న చక్కెర ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారూ ఈ చక్ర తీర్థం లో పాల్గొంటారు. 

జమ్మి కొట్టేది గ్రామ పెద్ద కాపే..

నసురుల్లాబాద్ గ్రామంలో దసరా పండుగ సందర్భంగా గ్రామ పెద్ద కాపే జమ్మి కొట్టడం ఆనవాయితీగా వస్తోంది.గ్రామంలోని పెద్ద మనుషులు , గ్రామ కమిటీ సభ్యులు అందరూ కలిసి గ్రామ పెద్ద కాపు ఇంటికి బాజా భజంత్రీలతో వెళ్లి వేడుకకు ఆహ్వానిస్తారు.డప్పుల చప్పుళ్లతో పాత కశీరు వద్దకు సొరకాయను ఒక్క వేటుతో నరికిన తర్వాత చెరువు కట్ట వద్దకు చేరుకుని జమ్మి కొట్టే కార్యక్రమం నిర్వహిస్తారు. ముందుగా పెద్ద కాపు కర్రలతో జమ్మి కొట్టి తెంపుతారు. ఆ తర్వాత గ్రామ ప్రజలు జమ్మి తెంపి పంచుకుంటారు. 

గుర్రంపై వచ్చి.. రావణ దహనం చేసి..

మద్నూర్ మండల కేంద్రంలో దసరా పండుగ ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో యజ్ఞం నిర్వహిస్తారు.అనంతరం సర్పంచ్ గుర్రంపై వచ్చి రావణ దహనం కార్యక్రమంలో పాల్గొంటారు..

బురుజు మీద మువ్వన్నెల జెండా..

దోమకొండ మండల కేంద్రంలోని బురుజుపై దసరా పండుగ రోజున విజయానికి సంకేతంగా జాతీయ జెండాను ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తోంది.గతంలో దోమకొండ సంస్థానాధీశుల కాలంలో ఊరికి నడి బొడ్డున బురుజును నిర్మించారు.దొంగలు,ఇతరుల నుంచి గ్రామాన్ని కాపాడడం నిమిత్తం నిరంతర కాపలా కోసం అందులో రక్షక భటులను ఉంచేవారు. అదే విధంగా ప్రతి దసరా రోజున దానిపై కాషాయ జెండాను ఎగురవేసేవారు.దేశానికి స్వతంత్రం వచ్చినా తెలంగాణ నిజాం పాలనలో ఉండడంతో ఈ ప్రాంతంలో ఉద్యమాలు జరిగాయి.1948 లో గ్రామానికి చెందిన పలువురు యువకులు దసరా పండుగ రోజున పెద్ద కర్రను తయారు చేసి దానికి జాతీయ జెండాను కట్టి బురుజు మీద ఎగుర వేసారు.అనంతరం నిజాం తన సంస్థానాన్ని భారత్ లో విలీనం చేశారు.1948 నుండి ప్రతి ఏటా దసరా పండుగ రోజున బురుజు మీద మువ్వన్నెల జెండాను ఎగుర వేస్తున్నారు.

ఆత్మకూరులో జడకొప్పు..

నాగిరెడ్డి పేట మండలం లోని పలు గ్రామాల్లో దసరాను ప్రత్యేకంగా జరుపుకుంటారు. నాగిరెడ్డి పేట, చీనూర్,వాడి గ్రామాల్లో జమ్మి చెట్టుకు పూజ చేసి ఆయుధ పూజ నిర్వహించి గ్రామస్తులందరి సమక్షంలో పెద్ద కత్తితో గుమ్మడి కాయ ను నరుకుతారు.జంతువుకు బదులుగా గుమ్మడి కాయ ను బలి ఇస్తారు. ఆత్మకూరు లో కోలలు ఆడుతూ జడకొప్పు వేయడం ఆనవాయితీగా వస్తోంది. దీన్ని చూడడానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. చిన్న ఆత్మకూరు సమీపంలో గల వెంకట ఖాజా చిస్తీ దర్గా వద్ద దసరా పండుగ రోజున ఉదయం ఆయన భక్తులు జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు. 

జుక్కల్ లో విభిన్నంగా..

మూడు రాష్ట్రాల కూడలి ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గంలో పండుగలను ప్రత్యేకంగా జరుపుకుంటారు.ఇక్కడ మూడు రాష్ట్రాల సంస్కృతి కనిపిస్తుంది.తెలంగాణ,మహారాష్ట్ర,కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న బిచ్కుంద ,జుక్కల్,మద్నూర్ మండలాల్లో మూడు భాషలు మాట్లాడుతారు. ఇక్కడ దసరా పండుగ ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ ప్రాంతంలో గ్రామానికో ప్రత్యేక ఆచారం , కుటుంబానికో సంప్రదాయం అన్నట్లుగా ఉంటుంది. చాలా కుటుంబాలు దసరాకు ఒకరోజు ముందు కుటుంబంలో చనిపోయిన పెద్దలను స్మరించుకుంటూ వారి పేరుతో మేకను బలి ఇచ్చి మాంసాహార వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంటి పెద్ద కొడుకు లేదా చిన్న కొడుకు మాత్రమే మేకను వధించడం ఆచారంగా వస్తోంది. దసరా పండుగ రోజున గ్రామాల్లో పాత పటేల్,పట్వారీలు , గ్రామ పెద్దల ఇంటి నుంచి బాజా భజంత్రీలతో,వాయిద్యాలతో సందడి చేస్తూ గ్రామ చావిడి వద్దకు చేరుకుని అందరూ కలిసి మందిరాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసి వస్తారు.రైతులు దసరా పండుగ జమ్మి పూజలో వ్యవసాయ పరికరాలకూ పూజలు చేస్తారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి