19, అక్టోబర్ 2026, సోమవారం

కత్తులు పట్టే పడతులు..

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లో ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజున ప్రాచీన యుద్ధ విద్యల / చెడీ తాలింఖానా ప్రదర్శన భారీ ఎత్తున జరుగుతుంది. ఈ ప్రదర్శనలో కత్తి ,కర్ర సాములు , బళ్లాలతో  విన్యాసాలు, పొట్టపై వస్తువులు పెట్టి పగలగొట్టడం తదితర విద్యలు ఉంటాయి. ముందస్తు సన్నాహాలలో భాగంగా ఆదివారం స్థానిక వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో పలువురు ఈ విద్యలను ప్రదర్శించారు. యువతులు కత్తి స్వామి విన్యాసాలు చేశారు. 

అమ్మవారికి అందరూ సమానమే..

 విజయదశమి వచ్చిందంటే చాలు బెంగాల్ అంతటా సందడే సందడి. దుర్గాపూజ కోసం శిల్పులు అమ్మవారి విగ్రహాలను ఎంతో భక్తి శ్రద్ధలతో తీర్చిదిద్దుతారు. అయితే ఈ దివ్యమూర్తి ప్రతిమ తయారీ వెనుక విచిత్రమైన ఆసక్తికరమైన ఆచారం ఉన్నది. అదే" పుణ్యమట్టి ".విగ్రహ తయారి కోసం పవిత్ర గంగానది ఒడ్డు నుంచి మట్టి తెస్తారు. దానితో పాటు పశువుల పేడ ,గోమూత్రం కలుపుతారు. కానీ వీటన్నింటి కంటే ముఖ్యమైనది వేశ్య వాటికలో నివసించే మహిళల ఇంటి ముందు నుంచి సేకరించే పిడికెడు మట్టి .ఆ ఇంటి గడప దాటే వారు తమ అహంకారాన్ని వదిలి రావాల్సిందేనని నమ్ముతారు ఇక్కడ. మరోవైపు సమాజం దూరంగా పెట్టే వారిని కూడా పండుగలో భాగం చేయడమే ఈ సంప్రదాయం వెనుక ఉన్న అసలు రహస్యం. అమ్మవారికి అందరూ సమానమే అని ఏ ఒక్కరిని వెలివేయకూడదు అనే గొప్ప పాఠాన్ని ఈ చిన్న ఆచారం చాటిచెప్పుతుంది.