7, సెప్టెంబర్ 2026, సోమవారం

ఆధ్యాత్మిక సమాచారం 7-9-2026

 దుర్గా మాత షెడ్డు నిర్మాణానికి భూమి పూజ



నవీపేట మండలం అబ్బాపూర్ ఎం గ్రామంలో దుర్గామాత షెడ్డు నిర్మాణానికి ఆదివారం సర్పంచ్ మనేద శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు .తన సొంత నిధులైన లక్ష రూపాయల వ్యయంతో శ్రీనివాస్ సంబంధిత షెడ్డు నిర్మాణాన్ని చేపట్టనున్నారు .ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.


ఆలయ అభివృద్ధికి మొదటి వేతనం విరాళం 


నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన జక్కుల రుచిత తన మొదటి వేతనం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి విస్తరణ పనుల కోసం విరాళంగా అందించారు. వేతనానికి సంబంధించిన చెక్కును ఆదివారం వేములవాడ ఆలయ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పెరిక శ్రీనివాస్ కు అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఏఈఓ లక్ష్మణరావు ఆమె తల్లిదండ్రులు జే రవీందర్ ,మీనా తదితరులు పాల్గొన్నారు.


రూ. 50 లక్షల విలువైన భూమి విరాళం.. 


హన్మకొండ జిల్లా ధర్మ సాగర్ మండలం ముప్పారం గ్రామ పంచాయతీ బిల్డింగ్ ,రామాలయం నిర్మాణం కోసం గ్రామానికి చెందిన చింతలపాటి సుధీర్ రెడ్డి, చింతల పాటి సుకన్య దంపతులు రూ 50 లక్షల విలువైన 550 గజాల ఖాళీ స్థలాన్ని విరాళం గా అందచేశారు. తమ ఓపెన్ ప్లాట్ ను గ్రామ సర్పంచ్ రేణుక వెంకట్, మాజీ ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్ కు అప్పగించారు. తమ తండ్రి చింతలపాటి రామచంద్రా రెడ్డి జ్ఞాపకార్థం ఈ స్థలాన్ని గ్రామ అభివృద్ధి కోసం విరాళంగా అందచేసినట్లు తెలిపారు. దాతలను గ్రామస్తులు అభినందించారు. 

వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన..

బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపు తండాలో నూతనంగా నిర్మించిన జగదాంబ , సేవాలాల్ ఆలయంలో ఆదివారం విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జగదాంబ, సేవాలాల్ ఆలయాల నిర్మాణం తో తండాలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుందన్నారు. ఆలయాల అభివృద్ధికి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, తండా వాసులు, భక్తులు పాల్గొన్నారు. 

తెలంగాణ గంగ తెప్పోత్సవం అంటే..

తెలంగాణ గంగపుత్రుల గంగ తెప్పోత్సవం కనుల పండుగ గా జరిగింది .ఖైరతాబాద్ ఏడు గుడులనుంచి హుస్సేన్ సాగర్ గంగమ్మ దేవాలయం వరకు పోతురాజులు, జోగినిల వీరంగాలు, సాంప్రదాయ వల పందిర్లు, బోనాలతో శోభా యాత్ర సాగింది. నగర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని గంగపుత్రులకు సంఘీభావం తెలిపారు .ఈ సందర్భంగా గంగ తెప్పోత్సవ అధ్యక్షుడు మల్కు మహేందర్ బాబు మాట్లాడుతూ గంగ తెప్పోత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించాలని కోరారు .


హఫీజ్ పేటలో అహింసా స్థూపం..


దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ నగరంలో మియాపూర్ లో "అహింసా స్తూపం " ఆవిష్కృతమైంది. ఆదివారం హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని మంజీరా పైపులైన్ రోడ్డులో అహింస స్తూపంను చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ రవికుమార్ యాదవులతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. స్థూపం రాబోయే తరాలకు శాంతి ,అహింసల దివ్య సందేశాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. స్తంభంపై లిఖించిన" పరస్పరోపగ్రహో జీవానాం  " అనే సందేశం నేటి అశాంతియుత  ప్రపంచంలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. మనిషి మనిషికి , జీవి జీవికి పరస్పరం సహకరించుకోవాలనే ఈ సందేశం సమాజాన్ని ఐక్యంగా నిలబెడుతుందని చెప్పారు. ఈ బృహత్తర కార్యానికి జైన్ సమాజ మహిళలు నాయకత్వం వహించడం విశేషమని, ఇది ప్రపంచానికి ఐక్యత మానవీయ సందేశాన్ని చాటి చెప్పిందని అభినందించారు. అహింస అంటే కేవలం శారీరక హాని చేయకపోవడమే కాదు మాటలలో, ప్రవర్తనలో, ఆలోచనలో కూడా దానిని పాటించడమేనని స్పష్టం చేశారు. నగర ఆర్థిక ,సామాజిక ,సంస్కృతిక ప్రగతిలో జైన్, బ్రాహ్మణ ,మహేశ్వరి వంటి వివిధ సమాజాలు కీలక భూమిక పోషించాయని కొనియాడారు.


చుక్క పూర్ లక్ష్మీ నరసింహ ఆలయ అభివృద్ధికి విరాళాలు



మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ,రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన చింతల శ్రీనివాస్ ,అరుంధతి దంపతులు జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్ కు 5000 రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా అర్చకుడు శ్రీనివాసచార్యులు దాతలకు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి సన్మానించారు.

విరాళం అందజేత..




గాంధారి మండలంలోని తిప్పారం తండాలో నూతనంగా నిర్మిస్తున్న కోదండ రామచంద్రస్వామి ఆలయానికి పోతంగల్ కలాన్ కి చెందిన కిషన్ 25 వేల రూపాయల నగదును ఆదివారం సర్పంచ్ గంగారం, ఆలయ కమిటీ చైర్మన్ బిషన్ నాయక్ లకు అందజేశారు.


ధాన్యోస్మి..

సహజ సిద్ధంగా లభించే బంకమట్టి ,ధాన్యం, పెసర్లు, మినుములు, ఆవాలు వంటి పప్పు దినుసులతో తయారు చేసిన వినాయక విగ్రహం ఇది .బొజ్జ గణపయ్యను పూజించడమే కాదు ,ప్రకృతిని సైతం కాపాడుకోవాలి అనే ముఖ్య సందేశంతో విజయవాడకు చెందిన ఒక వైద్యుడు మట్టి ,చిరుధాన్యాలతో నాలుగడుగుల వినాయక విగ్రహాన్ని తయారు చేయించారు. మట్టి సులువుగా నీటిలో కలిసిపోతుందని, చిరుధాన్యాలు జీవరాశుల ఆహారంగా ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.

ఆలయానికి స్టాండు వితరణ..


కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులోని శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి మైలారం గ్రామానికి చెందిన బొట్టే కల్పన జ్ఞాపకార్థం బొట్టేమోహన్ ఆలయ కమిటీ సభ్యులకు కొబ్బరికాయలు కొట్టే స్టాండును ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ పెర్క శ్రీనివాస్, సర్పంచ్ బాల హరిచంద్ర రెడ్డి, గ్రామస్తులు రమేష్, లింగం గౌడ్, గంగాధర్, కాశీరాం, రాములు , మహేందర్ ,రాజు పాల్గొన్నారు.

6, సెప్టెంబర్ 2026, ఆదివారం

అశ్శరభ శరభ అంటే..

 తిరిపెము లెత్తనేల గుణధీరు గజాస్యుని పెండ్లి చేయకన్ 

దొరయక నుంచనేల బలుధూమ్రతనూ జుని వస్త్రహీనుగా

మరియును జేయనేల సుకుమార కుమారుని కుగ్గు బెట్టకన్ 

జరుపుట యేల నిన్ను గన జాలరు నిర్జర మౌని సంగముల్ 

దొరకదు నీ మహా మహిమ దోచదయా శరభాంక లింగమా


పై పద్యం పాలకుర్తి సోమ నాధుడి సమ కాలికుడైన శరభాంకుడు రచించిన ' శరభాంక లింగమా ' అనే శతకం లోనిది. 12-13 వ శతాబ్దానికి చెందిన ఈ కవి ఓరుగల్లు ప్రాంతానికి చెందిన వారు. శరభాంకుడు తన పేరులోని శరభాంకను తను ఆరాధించే శివునికి అన్వయించి ఆత్మీయంగా శరభాంక లింగమా అని సంబోధించుకున్నాడు. నరసింహ స్వామి ఉగ్రతను శాంతింప చేయడానికి శివుడు ఎత్తిన అవతారమే శరభేశ్వరుడు. ( పక్షి, మృగం, మానవ రూపాల సమ్మేళనం ). వీర శైవ ప్రతీకగా దీనిని కొందరు భావిస్తారు. అంత ప్రాచీన కాలంలో నే చిత్తశుద్ధి లేని పూజలను , మంత్ర తంత్రాలను, మూఢ నమ్మకాలను నిరసించిన కవిగా శరభాంకుడు మనకు కనిపిస్తాడు. శరభాంక లింగమా దేవతలు , మునులు కూడా నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేవు. నీ గొప్ప మహిమ ఎవరికీ దొరకదు. తోచదు. నీ లీలలు ఎంత విచిత్రమైనవో కదా. 

తిరిపెము ( భిక్షాటన ) ఎత్తడం ఎందుకు, నీ పెద్ద కుమారుడైన , సకల గుణవంతుడు , ధీరుడైన వినాయకునికి పెండ్లి చేయకుండా ఎందుకు ఉన్నావు. నీ రెండో కుమారుడైన కుమార స్వామి కి ( ధూమ్ర తనూజుడు ) దుస్తులు కూడా లేకుండా దిగంబరుడిగా ఎందుకు ఉంచావు. అలాగే ఆ సుకుమారుడైన చిన్న కుమారుడికి కనీసం ఉగ్గు కూడా పోయకుండా అలా కాలం ఎలా వెల్లదీస్తున్నావు. సాక్షాత్తూ మూడు లోకాలకు అధిపతివి ఐన నీవు నీ పిల్లల విషయంలో ఎందుకీ విచిత్రమైన లీలలు ప్రదర్శిస్తున్నావో . నీ అపారమైన మహిమ ఎలాంటిదో ఆ దేవతలకు, గొప్ప మునులకు కూడా అర్థం కావడం లేదు. అంటూ వ్యాజ స్తుతిలో శంకరుణ్ణి స్తుతిస్తున్నాడు. 

సంసార రహితుడైన ఈశ్వరుని తాత్వికత తెలియ చేయడం కవి ఉద్దేశ్యం కావచ్చు. జననానంతరం కుమార స్వామి కి పాలు పట్టింది కృత్తికలు కాబట్టి శంకరుణ్ణి ఇలా నిందించ వచ్చు. అలాగే అన్న వినాయకుడితో జ్ఞాన పోటీలో ఓడిపోయిన అనంతరం కుమార స్వామి , వస్త్రాభరణాలు వదిలేసి కౌపీనం ధరించి జ్ఞాన వైరాగ్య మూర్తిగా పళని కొండ పై వెలిశాడన్న పురాణ కథ ను ఈ సందర్భంగా కవి ప్రస్తావించి ఉండవచ్చు.