కామాఖ్య దేవి కోరికలు నెరవేర్చే కామేశ్వరిగా పూజలు అందుకునే శక్తి స్వరూపిణి .యోని రూపంలో దర్శనము ఇచ్చే ఈ అమ్మవారి క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఏటా నిర్వహించే బాచి మేళా ఎన్నో విశేషాల సమాహారం.
బ్రహ్మపుత్ర నది తీరాన నీలాచల పర్వతాల నడుమ నాగర నిర్మాణ సైతు అబ్బురపరుస్తుంది కామాఖ్య దేవి మాత ఆలయం అసోం లోని గువాహటిలో ఉండే ఈ ఆలయాన్ని ప్రేమకు అందానికి అధిపతి అయిన మన్మధుడు నిర్మించాడని కథనం. ఆ ఆది పరాశక్తి యోని రూపంలో పూజలు అందుకునే ఈ క్షేత్రంలో ఏటా నాలుగు రోజుల పాటు జరిగే అంబు బాచి మేళా కు సాధారణ భక్తులే కాక , ఎందరో సాధువులూ హాజరవుతారు. అంబుబాచీ మేళా కామాఖ్య దేవి ఆలయంలో ఏడాదికోసారి జూన్ నెలలో జరిగే అతి ముఖ్యమైన వేడుక. అంబు అంటే జలం, బాచీ అంటే పారడం అని అర్థం. సాధారణ మహిళల్లానే ఇక్కడ కొలువైన అమ్మవారికీ నెలసరి వస్తుందని ఓ విశ్వాసం. అందుకే, ఆ సమయంలో తెల్లని వస్త్రాన్ని గర్భ గుడిలోని విగ్రహానికి చుట్టి మూడు రోజుల పాటు ఆలయాన్ని మూసేస్తారు. నాలుగో రోజు ఆలయాన్ని తెరిస్తే .. ఆ వస్త్రం నెత్తురుతో తడిసి ముద్దై పోయి ఉంటుందట. తర్వాత పూజారులు ఆలయాన్ని శుభ్ర పరిచి , అమ్మవారికి పూజలు నిర్వహించి , అప్పుడు దర్శనానికి అనుమతిస్తారు. ఇంకా ఆ వస్త్రాన్ని చిన్న ముక్కలుగా చేసి భక్తులకు పంచి పెడతారు. నాలుగవ రోజు దేవిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని, సకల శుభాలూ కలుగుతాయనే నమ్మకం తోనే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఇరవై నుంచి 30 లక్షల మంది భక్తులు ఈ మేళాలో పాల్గొంటారు. అంబు బాచి మేళా సమయంలో బ్రహ్మ పుత్ర నది కూడా ఎరుపు రంగు లోకి మారుతుందని చెబుతారు అర్చకులు. ఇక స్థానికులూ ఆ నాలుగు రోజులూ ఎంతో నియమ నిష్ఠలతో ఉండేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఆ మూడు రోజుల పాటు తమ ఇళ్లలోనూ నిత్య పూజలు ఆపేస్తారు. రైతులు సైతం భూమిని దున్నే పనులను నిలిపి వేస్తారు. నాలుగో రోజు తమ ఇళ్లను శుభ్ర పరిచి ఆ తర్వాత వంటలు చేసి అమ్మవారికి నివేదిస్తారు. ఇది కాకుండా జగన్మాతకు నవ రాత్రులు , దీపావళి, సంక్రాంతి, శివ రాత్రి సమయాలలో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తారు. మానస పూజ, కన్యా పూజలనూ చూసి తీరవలసిందే. ఇంతటి ప్రత్యేకత ఉన్న ఈ ఆలయంలో అమ్మవారు కొలువుదీరడం వెనుక ఆసక్తి కరమైన కథనం ఉంది.
స్థల పురాణం ప్రకారం..
ఒకసారి దక్ష ప్రజాపతి ఓ యాగాన్ని తలపెట్టి ,కుమార్తె అయిన సతీదేవిని ,అల్లుడైన శివుడిని ఆహ్వానించలేదట. అయినా కూడా ఆ యజ్ఞానికి వెళ్ళిన సతీదేవి ,తనను తండ్రి అవమాన పరచడంతో అగ్నికి ఆహుతి అవుతుంది. ఆగ్రహోదగ్రుడైన పరమేశ్వరుడు సతీదేవి శరీరాన్ని మోస్తూ ప్రళయ తాండవం చేయడం ఆరంభిస్తాడు. దాంతో ముల్లోకాలూ కంపించి , దేవతలంతా శ్రీహరిని శరణు వేడతారు. అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రాన్ని సంధించి , దేవి శరీరాన్ని ఖండించడంలో ఆ భాగాలు పలు చోట్ల పడి , శక్తి పీఠాలుగా మారాయని పురాణాలు పేర్కొంటున్నాయి. వాటిల్లో అమ్మ వారి యోని భాగం ఇక్కడ పడిందని చెబుతారు. కాళికా పురాణం ప్రకారం.. ఓసారి మన్మధుడు శివుడి శాపానికి గురవడంతో రతీ దేవి విలపించింది. అది చూసి స్వామి శాపాన్ని ఉపసంహరించుకున్నా మన్మథుడికి పూర్వ సౌందర్యాన్ని ప్రసాదించలేదట. దాంతో రతీ మన్మధులిద్దరూ పరమేశ్వరుడిని అనుగ్రహించమని ప్రార్థించడంతో ఈ ప్రాంతానికి చేరుకుని అమ్మవారిని పూజించమని ఆదేశించాడట. అలా మన్మధుడు ఇక్కడకు వచ్చి, జగన్మాతను పూజించి , పూర్వ వైభవం పొంది , దేవి కోసం ఆలయాన్ని నిర్మించాడనేది కథ. తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన బిశ్వసింగ అనే రాజు ఆలయాన్ని పునర్నిర్మించేందుకు పూనుకుంటే క్రమంగా ఆయన కుమారుడు నర నారాయణ్ పూర్తి చేశాడట.
ఇతర దేవతలనీ..
ఆకట్టుకునే నిర్మాణ శైలితో కనిపించే కామాఖ్యా దేవి ఆలయంలోని దేవి కోరికలు నెరవేర్చే కామేశ్వరిగా, క్షణాల తేడాలోనే తన రూపాలను మార్చుకుని భక్తుల్ని అనుగ్రహించే కామ రూపిణిగాను పూజలు అందుకుంటోంది.దశమహా విద్యలకు అధిపతులైన త్రిపుర సుందరి ,మాతంగి,కమలాత్మిక, కాళి, తార,భువనేశ్వరి,భగలాముఖి , చిన్న మస్త, భైరవి, ధూమవతి దేవతలకూ ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి ఇక్కడ. అదే విధంగా పరమేశ్వరుడు కామేశ్వర, సిద్ధేశ్వర, అమరతోకేశ్వర, కోటి లింగేశ్వర , అఘోర.. వంటి ఐదు రూపాల్లోనూ పూజలు అందుకుంటున్నాడు.
ఇలా చేరుకోవచ్చు..
కామాఖ్య దేవి ఆలయానికి విమానంలో రావాలనుకునే భక్తులు గువాహటి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాలి. అక్కడి నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలయాన్ని చేరుకునేందుకు ప్రైవేటు వాహనాలు ఉంటాయి. రైళ్లలో రావాలనుకునే భక్తులు కామాఖ్య జంక్షన్ లో దిగితే ఆలయం ఇంచుమించు 20 నిమిషాల దూరంలో ఉంటుంది.



