15, సెప్టెంబర్ 2026, మంగళవారం

శ్రీకూర్మం పుణ్య క్షేత్రం..

 దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మదించేందుకు సిద్ధమయ్యారు. ఆ ప్రయత్నంలో మందర పర్వతాన్ని కవ్వంగానూ , నాగ దేవత వాసుకిని కవ్వపు తాడుగానూ చేసుకున్నారు. ఓ శుభ ముహూర్తంలో సముద్ర మధనాన్ని ఆరంభించారు. కవ్వపు తాడును ఒక వైపు దేవతలు, మరో వైపు రాక్షసులు పట్టుకున్నారు. అలా చిలుతుంటే .. మందర పర్వతం సముద్రంలోకి జారి పోతుంది. దాంతో భయపడిన దేవతలు శ్రీ మహా విష్ణువును ప్రార్థించారు. అప్పుడు విష్ణువు తాబేలు రూపం ధరించాడు. 

కూర్మ రూపంలో మందర గిరిని పైకెత్తి , తన వీపు మీద మోసి సముద్ర మధనానికి ఆటంకం కలగకుండా రక్షించాడు స్వామి. అప్పటి నుంచి ఆ లక్ష్మీ నాథుడు కూర్మ రూపంలోనూ పూజలందుకుంటున్నాడు.కూర్మావతారం భక్తుల పాలిట అభయావతారం . కంచెర్ల గోపన్న దాశరథీ శతకం లో విష్ణు భగవానుడు దాల్చిన కూర్మ రూపానికి అక్షరాంజలి ఘటిస్తూ  కూర్మమై దరాధరము భరించితీవే కద దాశరథీ కరుణాపయోనిధీ .. అని స్మరించుకున్నాడు. అలాగే నరసింహ శతకంలో శేషప్ప కవి , గీత గోవిందంలో భక్త జయదేవుడు తదితరులు కూడా లక్ష్మీ నాథుడి కూర్మ లీలా విన్యాసాలను మనోహరంగా మననం చేసుకున్నారు. 

ఆలయాల్లో ఆరాధనలు..

శ్రీ మహా విష్ణువును కూర్మావతారంలో ఆరాధించే ఆచారం ఉంది ,కాబట్టి ఆ రూపంలోనూ ఆలయాలున్నాయి.శ్రీకాకుళానికి 40 మైళ్ళ దూరంలో వంశధార తీరాన ఉన్న శాలి హుండం కొండకు ' కూర్మాద్రి ' అనే పేరు కూడా ఉంది ఆ జిల్లాలోనే శ్రీకూర్మం అనే పుణ్య క్షేత్రం వెలసింది అక్కడి ఆలయంలో స్వామి కూర్మ నాయకుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఆ దేవాలయంలో కూర్మ నాధుడు స్వయంభువుగా వెలయడం విశేషం. స్థల పురాణం అనుసరించి చంద్రవంశ మహా రాజైన శ్వేత చక్రవర్తికి ఆ శేష శయనుడు కూర్మ నాధుడిగా ప్రత్యక్ష మయ్యాడు.అలాగే శ్రీకూర్మం లో వెలసిన కూర్మ నాధుడిని కుశ లవులు, బల రాముడు దర్శించుకున్నట్లుగా కథలు ప్రచారంలో ఉన్నాయి.

బోధి సత్వుడే.. బుద్ధుడై..

 బౌద్ధంలో ఒక క్రమ సాధన ఉంది. దాని ప్రకారం ఏళ్ల తరబడి ధ్యానం చేసిన వ్యక్తి బోధి సత్వుడవుతాడు. బోధి సత్వుడు పది దశలు దాటిన తర్వాత బుద్ధుడవుతాడు. మొదటి దశ ముదిత లో లోకంలో అందరికీ మంచి జరగాలనే సమ భావన కలుగుతుంది. రెండోది విమలత్వం . మూడో దశ లో మేధ తేజోవంతం అవుతుంది. నాలుగో దశలో ఆలోచనలు జ్ఞానోదయం వైపు వేగంగా సాగుతాయి. అజేయుడిగా మార్చేది ఐదో దశ. ఆరో దశలో విశ్వం ఆవిర్భావం గురించి తెలుసుకుంటాడు. ఏడో దశలో సంపూర్ణ జ్ఞాన వంతుడవుతాడు. ఎనిమిదో దశలో స్థిర చిత్తుడై అచలత్వాన్ని పొందుతాడు. స్థితప్రజ్ఞత కలుగుతుంది. అంటే లౌకిక విషయాలేవీ సాధకుని ప్రభావితం చేయలేవు. తొమ్మిదో దశలో సాధుమూర్తిగా అవతరిస్తాడు. ఎటు చూసినా కరుణ సాక్షాత్కరిస్తుంది. చివరి దశలో ధర్మ స్వరూపుడై బుద్ధుడిగా వెలుగొందుతాడు. 

సృష్టి మొదలై అంతమవడాన్ని ఒక కల్పం అంటారు. అటువంటి కల్పాలు ఇప్పటి కి పది పూర్తయ్యాయి.. ప్రతి కల్పంలో కొంతమంది బుద్ధులు అవతరించారు.  మనం ఇప్పుడు 11వది అయిన భద్ర కల్పంలో ఉన్నాము. ఈ కల్పంలో వైశాఖ పౌర్ణమి రోజున పుట్టిన 28 వ బుద్ధుడు సిద్ధార్థ గౌతముడు. ఇతడు 35 ఏళ్ల తర్వాత వైశాఖ పౌర్ణమి రోజున జ్ఞానోదయం పొందాడు. ఈ గౌతమ బుద్ధుడు లోకంలో దుఃఖము ఉందని ,ఆ దుఃఖానికి కారణము, దాన్నుంచి విముక్తికి మార్గము ఉన్నాయని తెలుసుకున్నాడు. అదే అష్టాంగ మార్గమని చెబుతూ నాలుగు పరమ సత్యాలను ప్రబోధించాడు. దుఃఖానికి కారణం కనుక్కుని దాన్ని ప్రజలకు తెలియజేయడం వల్ల ఈ గౌతమ బుద్ధుడు ఇతరుల కంటే విఖ్యాతుడు అయ్యాడు. కాకతాళీయంగా గౌతమ బుద్ధుడు వైశాఖ పౌర్ణమి రోజునే మహాపరి నిర్మాణం పొందాడు. అందుకే వైశాఖ పౌర్ణమి బుద్ధ పౌర్ణమి గా ప్రసిద్ధి పొందింది.