2, సెప్టెంబర్ 2026, బుధవారం

జగదాంబ దేవికి బంగారు బొట్టు బిళ్ళ

 కామారెడ్డి జిల్లా లోని బాన్సువాడ మండలంలోని బుడ్మి జగదాంబ దేవి ఆలయంలో ఉన్న విగ్రహానికి మంగళ వారం బాన్సువాడ పట్టణానికి చెందిన వ్యాపార వేత్త , జాగృతి హాస్పిటల్ నిర్వాహకులు  రుద్రంగి ఉదయశ్రీ - గంగాధర్ దంపతులు బంగారు బొట్టు బిళ్ళ ను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అమ్మవారి కృపతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని వేసుకున్నట్లు తెలిపారు. గంగాధర్  దంపతులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో  గ్రామస్తులు డా .తిరుమల గౌడ్, జిన్న రఘు , శ్రీనివాస్ గుప్త,ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. 



జాతీయ స్మారక కట్టడంగా.. గొల్లల గుడి..

 


తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని పురాతన కట్టడం ' గొల్లల గుడి ' కి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ కట్టడాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా ప్రకటిస్తూ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత పురావస్తు సర్వేక్షణ (ఏ ఎస్ ఐ) అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాచీన స్మారక కట్టడాలు , పురావస్తు ప్రదేశాలు , అవశేషాల చట్టం ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన కాకతీయ రుద్రేశ్వర ( రామప్ప) దేవాలయానికి నైరుతి దిశలో ఈ  గొల్లల గుడి ఉంది. ఇది రామప్ప సాంస్కృతిక వైభవంలో కీలకమైన భాగం.12-13 వ శతాబ్దపు కాకతీయుల కాలం నాటి అద్భుతమైన త్రికూటాలయం. తూర్పు ముఖంగా ఉండే ఒకే మండపానికి మూడు వైపులా మూడు గర్భ గుడులు ఉండడం దీని ప్రత్యేకత. గొల్లల గుడి ప్రవేశ ద్వారాలు, పారపేట్ గోడలపై సుందరమైన హంసల వరుసలు , జాలి ( లాటిస్) వర్క్ కనిపిస్తాయి. ఆలయ కుడ్యాల గూళ్ళలో విష్ణువు, లక్ష్మీ దేవి,వినాయకుడు, మహిషాసుర మర్ధిని వంటి అద్భుతమైన శిల్పాలు కొలువై ఉన్నాయి.



 గొల్లల గుడి ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన కట్టడంగా ప్రకటించే ఉద్దేశం తో అంతకు ముందు ఈ ఏడాది మార్చి 6 న ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. చట్టం నిర్దేశించిన 2 నెలల గడువులోగా ప్రజల నుండి ఎలాంటి అభ్యంతరాలు నమోదు కాలేదు. దీంతో ఆగస్టు 31 న ఏ ఎస్ ఐ డైరెక్టర్ జనరల్ యదు బీర్ సింగ్ రావత్ దీనిపై తుది గెజిట్ విడుదల చేశారు. గెజిట్ నోటిఫికేషన్ లో పొందు పరచిన షెడ్యూల్ ప్రకారం గొల్లల గుడి పరిధిలోని పావు ఎకరం విస్తీర్ణాన్ని రక్షిత ప్రాంతంగా భారత పురావస్తు సర్వేక్షణ తమ యాజమాన్యం లోకి తీసుకుంది. ఈ మేరకు రక్షిత స్మారక చిహ్నం పరిమితులను ఖరారు చేస్తూ మ్యాప్ ను గెజిట్ లో పొందు పరచారు. ఈ గుర్తింపు తో తెలంగాణలో ఏ ఎస్ ఐ రక్షణలో ఉన్న జాతీయ స్మారక కట్టడాల సంఖ్య 10 కి చేరింది.