20, సెప్టెంబర్ 2026, ఆదివారం

విగ్రహం లేని ఆండాలమ్మ గుడి

 గుడి అంటే దేవత విగ్రహం ,నిత్య పూజలు, భక్తుల సందడి గుర్తుకొస్తాయి. కానీ పెద్దపల్లి జిల్లాలోని ఒక పురాతన ఆలయం మాత్రం అందుకు పూర్తిగా భిన్నం .దేవతా విగ్రహం లేకుండానే వందల ఏళ్లగా చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్న ఆండాలమ్మ ఆలయం ప్రత్యేక ఆకర్షణగా భాసిల్లుతోంది. 

పెద్దపల్లి మండలం, ముత్తారం గ్రామపంచాయతీ పరిధిలోని ధర్మాబాద్ ప్రాంతంలో కొండల మధ్య ప్రకృతి రమణీయత నడుమ ఈ ఆలయం ఉన్నది. పెద్దపల్లి పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి దాదాపు 300 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. అప్పట్లో ఈ ప్రాంతాలను పాలించిన స్థానిక జమీందారు ఎరపతి నరసింహారావు ఆలయాన్ని నిర్మించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. 

విగ్రహం ఎందుకు లేదంటే..

 ఆలయం నిర్మాణం పూర్తయినప్పటికీ గర్భగుడిలో ప్రధాన దేవత విగ్రహం ప్రతిష్టించబడలేదు. దీనికి సంబంధించి స్థానికంగా భిన్నమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆలయ నిర్మాణం అనంతరం ప్రతిష్టకు ముందే జమిందార్ మరణించడంతో ఆ కార్యక్రమం నిలిచిపోయిందని కొందరు చెబుతుండగా ,గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకాలలో విగ్రహం తొలగించబడిందని మరికొందరు చెబుతున్నారు. అయితే ఈ కథనాలకు స్పష్టమైన చారిత్రక ఆధారాలు నిర్ధారించాల్సి ఉంది.

షూటింగ్లకు ఫేమస్ స్పాట్..

 పురాతన నిర్మాణ శైలి, కొండల అందాలు ,ప్రశాంతమైన వాతావరణం కారణంగా  ఆలయం ఇప్పుడు షూటింగులకు ప్రత్యేక వేదికగా మారింది .జానపద గీతాలు ,షార్ట్ ఫిలింలు, ఫ్రీ వెడ్డింగ్ షూట్ లతో పాటు సారంగదరియా పాట, బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు .

బయట నుంచి అద్భుతంగా కనిపించే ఆలయంలోపలిభాగం మాత్రం కాలక్రమేనా శిథిలావస్థకు చేరింది .మండపం పై కప్పు, నేల తదితర ప్రాంతాలకు మరమ్మతులు అవసరం .ఆలయానికి రహదారి, విద్యుత్తు, తాగునీరు వంటి మౌలిక వసతులు కలిపించడంతోపాటు చారిత్రక కట్టడం గా గుర్తించి పరిరక్షించాలి. గతంలో ఆలయ గోపురం ధ్వంసమైన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి