20, సెప్టెంబర్ 2026, ఆదివారం

ఆధ్యాత్మిక కేంద్రంగా ఆగస్త్య గుండం

 మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని చారిత్రక ప్రాశస్త్యం కలిగిన అగస్త్య గుండం ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక తయారైంది .పట్టణాన్ని ఆనుకొని ఉన్న పెద్ద చెరువు నడుమ నీళ్ళు ,పచ్చని చెట్లు ప్రకృతి సోయగంతో కనివిందు చేస్తున్న ఈ ఆలయాన్ని చెన్నూరుకే వన్నె తెచ్చేలా 17 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నారు. 

చారిత్రక ప్రాశస్త్యం ఏమిటంటే ..

 చెన్నూరులో అగస్తీశ్వర స్వామి ఆలయం దాని పక్కనే పెద్ద చెరువులోని అగస్త్య గుండం ఎంతో ప్రసిద్ధిగాంచాయి. సప్త ఋషులలో ఒకరైన అగస్త్య మహాముని చెన్నూరు ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా పెద్ద చెరువులోని అగస్త్య గుండంల స్నానం చేసి అగస్తీశ్వర ఆలయంలో పూజలు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన అగస్త్య గుండం ఆనవాళ్లు లేకుండా పోతుందని భావించిన మాజీ ఎంపీపీ మైదం సత్యనారాయణ 2006 లో తన సొంత ఖర్చుతో అగస్త్య  గుండం ఆలయంతో పాటు భారీ శివలింగాన్ని నిర్మించారు. పెద్ద చెరువు కట్ట పైన నుంచి గుండం వద్దకు వెళ్లడానికి బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. రెండు దశాబ్దాల క్రితం ఈ ప్రాంతం పర్యాటకులతో ఎంతో రద్దీగా ఉండేది. ఇక్కడ సినిమా షూటింగులు సైతం జరిగాయి. కానీ ఇంకా కొన్ని పనులు మిగిలి ఉండగానే సత్యనారాయణ మరణించారు. దీంతో పనులు పూర్తిగా కాకపోవడంతో అగస్త్య గుండం ఆదరణ కోల్పోయి శిథిలావస్థకు చేరుకుంది .

చెన్నూరుకు చెందిన యువ ఆర్కిటెక్ట్ తిరుపతి విష్ణు రూపొందించిన డిజైన్లు ఆకట్టుకుంటున్నాయి. చెరువు నడుమ గల శివలింగం మినహా మిగతా నిర్మాణాలు శిథిలావస్థకు చేరడంతో వాటిని తొలగించి కొత్తగా నిర్మించనున్నారు .భవిష్యత్తులో పర్యాటకుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున శివలింగం వద్ద గల ఐలాండ్ను మరింత విశాలంగా మార్చనున్నారు. చెన్నూరు చారిత్రక, ఆధ్యాత్మిక ,సాంస్కృతిక వైభవాన్ని నేటి తరానికి పరిచయం చేసేలా కల్చరల్ సెంటర్ ,ఆడిటోరియం, చిల్డ్రన్స్ ప్లే ఏరియాతో పాటు ఫుడ్ కోర్టులు ఇతర స్టాళ్ల  ఏర్పాటు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు .

పంచ క్రోశ ఉత్తరవాహిని ..

చెన్నూరు పట్టణ శివారులోని గోదావరి నది పంచక్రోశ ఉత్తర వాహినిగా ప్రసిద్ధి చెందింది .గోదావరి నది ఉత్తరం దిశగా ఐదు కిలోమీటర్లు ప్రవహించడం ఇక్కడి ప్రత్యేకత. ఉత్తరవాహీనీలో స్నానాలు ఆచరిస్తే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. దీంతో దశాబ్దాల కాలంగా చెన్నూరు ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతుంది. తమ కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే కాశీకి వెళ్లలేని భక్తులు చెన్నూరు గోదావరిలో అస్తికలు నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తుంది. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి