కరీంనగర్ జ్యోతి నగర్ లోని హనుమాన్ సంతోషిమాత ఆలయంలోని హనుమాన్ ఆలయం పునర్నిర్మాణానికి కాంగ్రెస్ కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు రేఖా దంపతులు ఐదు లక్షల రూపాయల విరాళం ప్రకటించారు .శుక్రవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ సంతోష్ మాత ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు .ఆ తర్వాత వారిద్దరూ ప్రకాశం గంజి, కోతి రాంపూర్ ,వెంకటేశ్వర కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, భారత్ టాకీస్ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను దర్శించుకున్నారు.
ఆధ్యాత్మిక విశేషాలు, పూజలు, దేవాలయాలు, సాంప్రదాయాలు తదితర ఆధ్యాత్మిక విషయాల సమాహారం..
20, సెప్టెంబర్ 2026, ఆదివారం
ఆధ్యాత్మిక కేంద్రంగా ఆగస్త్య గుండం
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని చారిత్రక ప్రాశస్త్యం కలిగిన అగస్త్య గుండం ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక తయారైంది .పట్టణాన్ని ఆనుకొని ఉన్న పెద్ద చెరువు నడుమ నీళ్ళు ,పచ్చని చెట్లు ప్రకృతి సోయగంతో కనివిందు చేస్తున్న ఈ ఆలయాన్ని చెన్నూరుకే వన్నె తెచ్చేలా 17 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నారు.
చారిత్రక ప్రాశస్త్యం ఏమిటంటే ..
చెన్నూరులో అగస్తీశ్వర స్వామి ఆలయం దాని పక్కనే పెద్ద చెరువులోని అగస్త్య గుండం ఎంతో ప్రసిద్ధిగాంచాయి. సప్త ఋషులలో ఒకరైన అగస్త్య మహాముని చెన్నూరు ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా పెద్ద చెరువులోని అగస్త్య గుండంల స్నానం చేసి అగస్తీశ్వర ఆలయంలో పూజలు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన అగస్త్య గుండం ఆనవాళ్లు లేకుండా పోతుందని భావించిన మాజీ ఎంపీపీ మైదం సత్యనారాయణ 2006 లో తన సొంత ఖర్చుతో అగస్త్య గుండం ఆలయంతో పాటు భారీ శివలింగాన్ని నిర్మించారు. పెద్ద చెరువు కట్ట పైన నుంచి గుండం వద్దకు వెళ్లడానికి బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. రెండు దశాబ్దాల క్రితం ఈ ప్రాంతం పర్యాటకులతో ఎంతో రద్దీగా ఉండేది. ఇక్కడ సినిమా షూటింగులు సైతం జరిగాయి. కానీ ఇంకా కొన్ని పనులు మిగిలి ఉండగానే సత్యనారాయణ మరణించారు. దీంతో పనులు పూర్తిగా కాకపోవడంతో అగస్త్య గుండం ఆదరణ కోల్పోయి శిథిలావస్థకు చేరుకుంది .
చెన్నూరుకు చెందిన యువ ఆర్కిటెక్ట్ తిరుపతి విష్ణు రూపొందించిన డిజైన్లు ఆకట్టుకుంటున్నాయి. చెరువు నడుమ గల శివలింగం మినహా మిగతా నిర్మాణాలు శిథిలావస్థకు చేరడంతో వాటిని తొలగించి కొత్తగా నిర్మించనున్నారు .భవిష్యత్తులో పర్యాటకుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున శివలింగం వద్ద గల ఐలాండ్ను మరింత విశాలంగా మార్చనున్నారు. చెన్నూరు చారిత్రక, ఆధ్యాత్మిక ,సాంస్కృతిక వైభవాన్ని నేటి తరానికి పరిచయం చేసేలా కల్చరల్ సెంటర్ ,ఆడిటోరియం, చిల్డ్రన్స్ ప్లే ఏరియాతో పాటు ఫుడ్ కోర్టులు ఇతర స్టాళ్ల ఏర్పాటు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు .
పంచ క్రోశ ఉత్తరవాహిని ..
చెన్నూరు పట్టణ శివారులోని గోదావరి నది పంచక్రోశ ఉత్తర వాహినిగా ప్రసిద్ధి చెందింది .గోదావరి నది ఉత్తరం దిశగా ఐదు కిలోమీటర్లు ప్రవహించడం ఇక్కడి ప్రత్యేకత. ఉత్తరవాహీనీలో స్నానాలు ఆచరిస్తే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. దీంతో దశాబ్దాల కాలంగా చెన్నూరు ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతుంది. తమ కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే కాశీకి వెళ్లలేని భక్తులు చెన్నూరు గోదావరిలో అస్తికలు నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తుంది.
రాధాష్టమి అంటే..
బంజారాహిల్స్ లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ లో శనివారం రాధాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కృష్ణ భగవానుని నిత్య సఖీమని రాధా రాణి దివ్య ఆవిర్భావ తిథి అయిన శుభ సందర్భంగా నగరంలోని అనేకమంది భక్తులు ఆలయాన్ని సందర్శించి స్వామివారి దివ్య ఆశీస్సులను పొందారు .ఈ సందర్భంగా రాధా గోవిందులు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు .సాయంత్రం వైదిక రుత్విక్కుల వేదమంతోచారణలు ,శ్రావ్యమైన హరినామ సంకీర్తనలు నడుమ 108 కలశాలతో రాధా గోవిందా అభిషేకం నిర్వహించారు .56 విశేషమైన ఆహార పదార్థాలతో కూడిన నైవేద్యాన్ని సమర్పించారు .శృంగార హారతి, రాజభోగారతి, సంధ్యా హారతి ,మహాభిషేకం, ఝులన్మ సేవ మహా పల్లకి సేవ, శయన హారతి, ఏకాంత సేవ మొదలైన సేవలను వైభవంగా నిర్వహించారు .హరే కృష్ణ మూమెంట్ హైదరాబాద్ అధ్యక్షులు సత్య గౌరవ చంద్ర దాస ప్రభు జి తమ ప్రవచనంలో రాధాష్టమి ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు.
విగ్రహం లేని ఆండాలమ్మ గుడి
గుడి అంటే దేవత విగ్రహం ,నిత్య పూజలు, భక్తుల సందడి గుర్తుకొస్తాయి. కానీ పెద్దపల్లి జిల్లాలోని ఒక పురాతన ఆలయం మాత్రం అందుకు పూర్తిగా భిన్నం .దేవతా విగ్రహం లేకుండానే వందల ఏళ్లగా చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్న ఆండాలమ్మ ఆలయం ప్రత్యేక ఆకర్షణగా భాసిల్లుతోంది.
పెద్దపల్లి మండలం, ముత్తారం గ్రామపంచాయతీ పరిధిలోని ధర్మాబాద్ ప్రాంతంలో కొండల మధ్య ప్రకృతి రమణీయత నడుమ ఈ ఆలయం ఉన్నది. పెద్దపల్లి పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి దాదాపు 300 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. అప్పట్లో ఈ ప్రాంతాలను పాలించిన స్థానిక జమీందారు ఎరపతి నరసింహారావు ఆలయాన్ని నిర్మించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.
విగ్రహం ఎందుకు లేదంటే..
ఆలయం నిర్మాణం పూర్తయినప్పటికీ గర్భగుడిలో ప్రధాన దేవత విగ్రహం ప్రతిష్టించబడలేదు. దీనికి సంబంధించి స్థానికంగా భిన్నమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆలయ నిర్మాణం అనంతరం ప్రతిష్టకు ముందే జమిందార్ మరణించడంతో ఆ కార్యక్రమం నిలిచిపోయిందని కొందరు చెబుతుండగా ,గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకాలలో విగ్రహం తొలగించబడిందని మరికొందరు చెబుతున్నారు. అయితే ఈ కథనాలకు స్పష్టమైన చారిత్రక ఆధారాలు నిర్ధారించాల్సి ఉంది.
షూటింగ్లకు ఫేమస్ స్పాట్..
పురాతన నిర్మాణ శైలి, కొండల అందాలు ,ప్రశాంతమైన వాతావరణం కారణంగా ఆలయం ఇప్పుడు షూటింగులకు ప్రత్యేక వేదికగా మారింది .జానపద గీతాలు ,షార్ట్ ఫిలింలు, ఫ్రీ వెడ్డింగ్ షూట్ లతో పాటు సారంగదరియా పాట, బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు .
బయట నుంచి అద్భుతంగా కనిపించే ఆలయంలోపలిభాగం మాత్రం కాలక్రమేనా శిథిలావస్థకు చేరింది .మండపం పై కప్పు, నేల తదితర ప్రాంతాలకు మరమ్మతులు అవసరం .ఆలయానికి రహదారి, విద్యుత్తు, తాగునీరు వంటి మౌలిక వసతులు కలిపించడంతోపాటు చారిత్రక కట్టడం గా గుర్తించి పరిరక్షించాలి. గతంలో ఆలయ గోపురం ధ్వంసమైన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది.
పెన్షనర్ వినాయకుడు@ నాంపల్లి.
ఉద్యోగుల జీవితకాల సేవకు గౌరవం పదవి విరమణ అనంతరం పెన్షన్ ద్వారా భద్రత గౌరవప్రదమైన జీవనానికి ప్రతీకగా వినాయకుడి ప్రత్యేక థీమ్ ను రూపొందించారు. జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని నాంపల్లిలోని పెన్షన్ పేమెంట్ ఆఫీసులో ఈ వినూత్న గణేష అలంకరణను ఏర్పాటు చేశారు. సేవా పదవీ విరమణ పెన్షన్ భద్రత గౌరవప్రదమైన జీవితం అనే భావనను ప్రతిబింబించేలా థీమ్ ను రూపొందించారు.సంప్రదాయ భక్తికి ఆధునిక సృ జనాత్మకతను జోడిస్తూ పెన్షనర్ల జీవితకాల సేవకు నివాళిగా ఈ అలంకరణను తీర్చిదిద్దారూ. విఘ్నాలను తొలగించే వినాయకుడు ప్రతి పెన్షనర్ కు శాంతి ఆరోగ్యం ఆనందం శ్రేయస్సు ప్రసాదించాలని ఆకాంక్షించారు .భక్తుల నమితంగా ఆకట్టుకున్న ఈ పెన్షనర్ వినాయకుని చూడడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిస్తున్నారు.
నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం 9 ,9 9, 999 రూపాయలతో మహిళలు అలంకరించిన వినాయక మండపం విశేషంగా ఆకట్టుకుంది.ఇందు కోసం 20,50,100,500 నోట్లను వినియోగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఆర్యవైశ్య సంఘం నాయకులు చకిలం మారుతీ, కొమురవెల్లి రామ్మూర్తి, కొమురవెల్లి భాస్కర్ ,శ్రీనివాస్, బాదం వాణి తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాలలో కరెన్సీ గణేశుడు..
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడికి 31 లక్షల రూపాయల కరెన్సీ తో అలంకరించారు.
మంగళగిరిలో..
ఏపీలోని మంగళగిరిలోని మెయిన్ బజార్లో లక్ష్మీ గణపతి అలంకరణలో భాగంగా ఏకంగా రెండు కోట్ల 41 లక్షల విలువైన కరెన్సీని ఉపయోగించారు 18 ఏళ్ల క్రితం ఐదు లక్షల రూపాయలతో ప్రారంభమైన ఈ ఘన గణపతి అలంకరణ సంప్రదాయం ఇప్పుడు కోట్ల రూపాయలకు చేరింది వినాయక విగ్రహానికి ముందు కరెన్సీ నోట్లతో బాలగోపాలుడు చిత్రాన్ని కూడా చూడముచ్చటగా ఏర్పాటు చేశారు.
తాళాలు, తబలా, భజన కిట్ పంపిణీ
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొలను పల్లి గ్రామంలో స్థానిక వినాయక భక్తుల విన్నపం మేరకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 వేల రూపాయల విలువ చేసే తాళాలు తబలా భజన కిట్టును శుక్రవారం ఫౌండేషన్ చైర్మన్ BRS జిల్లా నాయకులు పరుపటి శ్రీనివాసరెడ్డి అందజేశారు. వినాయక భక్తులకు అందించిన వారిలో రాయపర్త మండల పార్టీ నాయకులు లేతాకుల రంగారెడ్డి, కర్ర రవీందర్ రెడ్డి ,చందు రామ్, సంది దేవేందర్ రెడ్డి, సంకినేని ఎల్ల స్వామి ,స్థానిక నాయకులు చిట్యాల వెంకన్న, తోట నరసింహం ,తోట యోగానంద, మాచర్ల సోనారి, బళ్లాకారి యాకయ్య, పనికర విజయకుమార్ ,సత్తూరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
కొయ్యపై కొలువైన శేష శాయి..
అలిపిరి వద్దనున్న టీటీడీ శిల్ప కళాశాలకు చెందిన విద్యార్థి సుబ్బరాయుడు గౌడ్ తయారుచేసిన ఆరున్నర అడుగుల అనంతపద్మనాభ స్వామి ప్రతిమ ఇది. ప్రాక్టికల్స్ లో భాగంగా 2025 లో టీటీడీ అందజేసిన టేకు కొయ్యతో దీనిని రూపొందించారు. ప్రస్తుతం ఈ నమూనాను శ్రీవారి సాలకట బ్రహ్మోత్సవాలలో భాగంగా ఫల పుష్ప ప్రదర్శన వద్ద ఏర్పాటుచేసిన శిల్ప కళాశాల స్టాల్లో ఉంచారు. ఇప్పటివరకు ఇంత పొడవైన దేవతామూర్తుల ప్రతిమను ఏ విద్యార్థి తయారు చేయలేదని ప్రిన్సిపల్ వెంకటరెడ్డి తెలిపారు.
మొబైల్ గణేశ @ మెట్ పల్లి
భక్తా.. అతిగా మొబైల్ వాడితే అనారోగ్య సమస్యలు వస్తాయి . ఈ రోజు సెల్ ఫోన్ ను అత్యధికంగా వినియోగించావు. ఇకపై తక్కువ సమయం వాడతానని మాట ఇస్తేనే నీకు నా దర్శన భాగ్యం కలుగుతుంది అని మొబైల్ గణేశ పలుకుతున్న స్వరం అందరినీ ఆలోచింప చేస్తోంది. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణం లోని చైతన్య నగర్ లో సురేందర్ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మంటపాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు గణ నాథుడిని దర్శించుకోవాలంటే ముందు సెల్ ఫోన్ ను అక్కడి సీసీ కెమెరా ముందు స్కాన్ చేయించాలి. విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన స్పీకర్ నుంచి వచ్చే ఆజ్ఞలు పాటించాలి.
17, సెప్టెంబర్ 2026, గురువారం
బ్రహ్మ దేవుడు.. చీమ..
ప్రచారంలో ఉన్న ఒక పౌరాణిక కథను అనుసరించి ఒకసారి బ్రహ్మదేవుడు తన సృష్టిని చూసుకుంటూ ఆనందంగా విహరిస్తున్నాడు. అప్పుడు ఆయనకు ఒక చీమ కనిపించింది .అది ఎంతో శ్రద్ధగా తన ఆహారాన్ని మోసుకుంటూ వెళుతుంది .ఎలా ప్రతిస్పందిస్తుందో చూద్దాం అని బ్రహ్మదేవుడు ..నీ చిన్ని పొట్ట నిండటానికి ఇంత శ్రమించాల్సిన అవసరం లేదు, అయినప్పటికీ పట్టుదలతో పని చేస్తున్నావు అన్నాడు నవ్వుతూ. స్వామి నా ఆయువు కూడా చిన్నదే. కానీ ఈ చిన్న జీవితంలో నా కర్తవ్యాన్ని పాటించడం ధర్మం కదా అంది .ఆ జవాబు విని సంతోషించిన బ్రహ్మదేవుడు, అవును కర్తవ్య నిర్వహణ చాలా ముఖ్యమైనది .ప్రతి జీవిలోనూ దైవాంశం ఉంది.
నువ్వు నీ కర్మ ఫలానుసారం ప్రయాణిస్తూ జీవితాన్ని సార్ధకం చేసుకుంటున్నావు అన్నాడు. చీమ తన అల్పశక్తితోనే ఇతర జీవులకు సాయం చేసేది. కర్తవ్యాన్ని ధర్మ నిష్టగా భావించి నిరంతరం శ్రమించే చీమ మనకు ఆదర్శం. నలుసంత ఉన్న చీమే అలా ఉన్నప్పుడు.. విచక్షణ జ్ఞానం ఉన్న మనం ఎంత ఉన్నతంగా జీవించాలో, ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలో తెలియ చేస్తుంది ఈ కథనం.
ఆలయ ప్రదక్షిణలో అంతరార్థం..
మన సంస్కృతిలో ప్రతి ఆచారం వెనుక అద్భుత వైజ్ఞానిక నేపథ్యం ఉంటుంది .ఆలయ ప్రదక్షిణ అనేది కేవలం దైవభక్తికి నిదర్శనం మాత్రమే కాదు, అది మన శరీరాన్ని, మనసును సమతుల్యం చేసే శక్తివంతమైన ప్రక్రియ. ఆలయ నిర్మాణంలో పాటించే శాస్త్రీయ అంశాలే అందుకు కారణం .గర్భాలయంలోని మూల విరాట్ నుంచి వెలువడే అయస్కాంత శక్తి క్షేత్రాలను గ్రహించడానికి ప్రదక్షిణ దోహదం చేస్తుంది. భూమి తన చుట్టు తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగే సవ్య దిశ పద్ధతిలో మనం తిరిగినప్పుడు.. ఆ విద్యుత్ అయస్కాంత శక్తి క్షేత్రాలతో మన శరీరం అనుసంధానం అవుతుంది. ఇది కేవలం నడక కాదు, ప్రకృతి క్రమంతో మనం మమేకమవడం.
ప్రదక్షిణ చేసేటప్పుడు మనసు బాహ్య ప్రపంచం నుంచి విడివడి ఒక రకమైన చలన ధ్యానం స్థితికి చేరుకుంటుంది. నిశ్శబ్దంగా అడుగులో అడుగు వేస్తూ సాగే ఈ ప్రక్రియ మెదడులోని అనవసరమైన ఆలోచనలను పారద్రోలి ,ఏకాగ్రతను పెంచుతుంది. ఈ స్థితి శారీరకంగా ఎంతో మేలు చేస్తుంది. ప్రదక్షణ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి శరీరంలోని నాడులు ఉత్తేజితమవుతాయి. ఆలయ ప్రాంగణంలోని పవిత్రమైన వాతావరణం ఆధ్యాత్మిక అనుభూతిని పొందడానికి మనల్ని శారీరకంగా, మానసికంగా సిద్ధం చేస్తుంది. దైవసాన్నిథ్యంలో అనంత శాంతిని చేకూర్చి మన లో లోపల ఉన్న వ్యధలు ,వేదనలను పోగొడుతుంది. మనలో ఏదైనా వ్యతిరేక ప్రతికూల భావాలు ఉంటే తొలగించి సానుకూలతను నింపుతుంది .ప్రదక్షిణ అంతరార్థం మన అహంకారాన్ని వీడటమే. సృష్టిలో దైవమే కేంద్ర బిందువు అని , మనము ఆ శక్తి చుట్టూ తిరిగే ఒక అణువు మాత్రమే అని గుర్తించినప్పుడు అహంకారం సహజంగానే తగ్గుతుంది. ప్రపంచం మన చుట్టూ తిరగడం లేదని మనం ఆ దైవీక శక్తి పరిధిలో భాగమని గ్రహించడమే నిజమైన వినయం.
ప్రదక్షిణ ఆధ్యాత్మికంగా చూస్తే భక్తిని చాటుతుంది. తాత్విక కోణంలో వినమ్రతను నేర్పుతుంది .నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని ,ప్రతికూల ఆలోచనలను తొలగించుకోవడానికి ఆలయ ప్రదక్షిణ ఒక చక్కని పరిష్కారం .ఇది శరీరాన్ని శుద్ధి చేసే ప్రక్రియ. మనసును శాంతింప చేసే ధ్యానమార్గం. అహంకారాన్ని తుడిచిపెట్టి ఆత్మ శోధన.
కామాఖ్యా దేవి.. అసోం
కామాఖ్య దేవి కోరికలు నెరవేర్చే కామేశ్వరిగా పూజలు అందుకునే శక్తి స్వరూపిణి .యోని రూపంలో దర్శనము ఇచ్చే ఈ అమ్మవారి క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఏటా నిర్వహించే బాచి మేళా ఎన్నో విశేషాల సమాహారం.
బ్రహ్మపుత్ర నది తీరాన నీలాచల పర్వతాల నడుమ నాగర నిర్మాణ సైతు అబ్బురపరుస్తుంది కామాఖ్య దేవి మాత ఆలయం అసోం లోని గువాహటిలో ఉండే ఈ ఆలయాన్ని ప్రేమకు అందానికి అధిపతి అయిన మన్మధుడు నిర్మించాడని కథనం. ఆ ఆది పరాశక్తి యోని రూపంలో పూజలు అందుకునే ఈ క్షేత్రంలో ఏటా నాలుగు రోజుల పాటు జరిగే అంబు బాచి మేళా కు సాధారణ భక్తులే కాక , ఎందరో సాధువులూ హాజరవుతారు. అంబుబాచీ మేళా కామాఖ్య దేవి ఆలయంలో ఏడాదికోసారి జూన్ నెలలో జరిగే అతి ముఖ్యమైన వేడుక. అంబు అంటే జలం, బాచీ అంటే పారడం అని అర్థం. సాధారణ మహిళల్లానే ఇక్కడ కొలువైన అమ్మవారికీ నెలసరి వస్తుందని ఓ విశ్వాసం. అందుకే, ఆ సమయంలో తెల్లని వస్త్రాన్ని గర్భ గుడిలోని విగ్రహానికి చుట్టి మూడు రోజుల పాటు ఆలయాన్ని మూసేస్తారు. నాలుగో రోజు ఆలయాన్ని తెరిస్తే .. ఆ వస్త్రం నెత్తురుతో తడిసి ముద్దై పోయి ఉంటుందట. తర్వాత పూజారులు ఆలయాన్ని శుభ్ర పరిచి , అమ్మవారికి పూజలు నిర్వహించి , అప్పుడు దర్శనానికి అనుమతిస్తారు. ఇంకా ఆ వస్త్రాన్ని చిన్న ముక్కలుగా చేసి భక్తులకు పంచి పెడతారు. నాలుగవ రోజు దేవిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని, సకల శుభాలూ కలుగుతాయనే నమ్మకం తోనే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఇరవై నుంచి 30 లక్షల మంది భక్తులు ఈ మేళాలో పాల్గొంటారు. అంబు బాచి మేళా సమయంలో బ్రహ్మ పుత్ర నది కూడా ఎరుపు రంగు లోకి మారుతుందని చెబుతారు అర్చకులు. ఇక స్థానికులూ ఆ నాలుగు రోజులూ ఎంతో నియమ నిష్ఠలతో ఉండేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఆ మూడు రోజుల పాటు తమ ఇళ్లలోనూ నిత్య పూజలు ఆపేస్తారు. రైతులు సైతం భూమిని దున్నే పనులను నిలిపి వేస్తారు. నాలుగో రోజు తమ ఇళ్లను శుభ్ర పరిచి ఆ తర్వాత వంటలు చేసి అమ్మవారికి నివేదిస్తారు. ఇది కాకుండా జగన్మాతకు నవ రాత్రులు , దీపావళి, సంక్రాంతి, శివ రాత్రి సమయాలలో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తారు. మానస పూజ, కన్యా పూజలనూ చూసి తీరవలసిందే. ఇంతటి ప్రత్యేకత ఉన్న ఈ ఆలయంలో అమ్మవారు కొలువుదీరడం వెనుక ఆసక్తి కరమైన కథనం ఉంది.
స్థల పురాణం ప్రకారం..
ఒకసారి దక్ష ప్రజాపతి ఓ యాగాన్ని తలపెట్టి ,కుమార్తె అయిన సతీదేవిని ,అల్లుడైన శివుడిని ఆహ్వానించలేదట. అయినా కూడా ఆ యజ్ఞానికి వెళ్ళిన సతీదేవి ,తనను తండ్రి అవమాన పరచడంతో అగ్నికి ఆహుతి అవుతుంది. ఆగ్రహోదగ్రుడైన పరమేశ్వరుడు సతీదేవి శరీరాన్ని మోస్తూ ప్రళయ తాండవం చేయడం ఆరంభిస్తాడు. దాంతో ముల్లోకాలూ కంపించి , దేవతలంతా శ్రీహరిని శరణు వేడతారు. అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రాన్ని సంధించి , దేవి శరీరాన్ని ఖండించడంలో ఆ భాగాలు పలు చోట్ల పడి , శక్తి పీఠాలుగా మారాయని పురాణాలు పేర్కొంటున్నాయి. వాటిల్లో అమ్మ వారి యోని భాగం ఇక్కడ పడిందని చెబుతారు. కాళికా పురాణం ప్రకారం.. ఓసారి మన్మధుడు శివుడి శాపానికి గురవడంతో రతీ దేవి విలపించింది. అది చూసి స్వామి శాపాన్ని ఉపసంహరించుకున్నా మన్మథుడికి పూర్వ సౌందర్యాన్ని ప్రసాదించలేదట. దాంతో రతీ మన్మధులిద్దరూ పరమేశ్వరుడిని అనుగ్రహించమని ప్రార్థించడంతో ఈ ప్రాంతానికి చేరుకుని అమ్మవారిని పూజించమని ఆదేశించాడట. అలా మన్మధుడు ఇక్కడకు వచ్చి, జగన్మాతను పూజించి , పూర్వ వైభవం పొంది , దేవి కోసం ఆలయాన్ని నిర్మించాడనేది కథ. తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన బిశ్వసింగ అనే రాజు ఆలయాన్ని పునర్నిర్మించేందుకు పూనుకుంటే క్రమంగా ఆయన కుమారుడు నర నారాయణ్ పూర్తి చేశాడట.
ఇతర దేవతలనీ..
ఆకట్టుకునే నిర్మాణ శైలితో కనిపించే కామాఖ్యా దేవి ఆలయంలోని దేవి కోరికలు నెరవేర్చే కామేశ్వరిగా, క్షణాల తేడాలోనే తన రూపాలను మార్చుకుని భక్తుల్ని అనుగ్రహించే కామ రూపిణిగాను పూజలు అందుకుంటోంది.దశమహా విద్యలకు అధిపతులైన త్రిపుర సుందరి ,మాతంగి,కమలాత్మిక, కాళి, తార,భువనేశ్వరి,భగలాముఖి , చిన్న మస్త, భైరవి, ధూమవతి దేవతలకూ ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి ఇక్కడ. అదే విధంగా పరమేశ్వరుడు కామేశ్వర, సిద్ధేశ్వర, అమరతోకేశ్వర, కోటి లింగేశ్వర , అఘోర.. వంటి ఐదు రూపాల్లోనూ పూజలు అందుకుంటున్నాడు.
ఇలా చేరుకోవచ్చు..
కామాఖ్య దేవి ఆలయానికి విమానంలో రావాలనుకునే భక్తులు గువాహటి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాలి. అక్కడి నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలయాన్ని చేరుకునేందుకు ప్రైవేటు వాహనాలు ఉంటాయి. రైళ్లలో రావాలనుకునే భక్తులు కామాఖ్య జంక్షన్ లో దిగితే ఆలయం ఇంచుమించు 20 నిమిషాల దూరంలో ఉంటుంది.
ఆధ్యాత్మిక విశేషాలు 17-9-26
మల్లన్న హుండీ ఆదాయం 74 లక్షల రూపాయలు
ప్రముఖ పుణ్య క్షేత్రం కొముర వెల్లి మల్లిఖార్జున స్వామి హుండీ లెక్కింపు బుధవారం జరిగింది.లెక్కింపును ఆలయ ముఖ మండపం వద్ద చేపట్టారు.లెక్కింపులో శ్రీ శివ రామ కృష్ణ భజన మండలి సేవా సభ్యులు పాల్గొన్నారు.63 రోజులకు గాను 74 లక్షల 52 వేల 87 రూపాయలు నగదు రాగా, మిశ్రమ బంగారం 32 గ్రాములు , మిశ్రమ వెండి 3 కిలోల 200 గ్రాములు విదేశీ కరెన్సీ 31 నోట్లు హుండీల ద్వారా లభించినట్లు ఆలయ ఈఓ కట్ట సుధాకర్ రెడ్డి తెలిపారు.దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయ లక్ష్మి పర్యవేక్షణలో లెక్కింపు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున ,స్థానాచార్యులు పీ మల్లయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.
సిద్ధ రామేశ్వర ఆలయ హుండీ లెక్కింపు..
భిక్కనూరు మండల కేంద్రంలో సిద్ధ రామేశ్వర ఆలయ హుండీ లెక్కించారు ఈఓ శ్రీధర్ రావు ఆధ్వర్యంలో ప్రక్రియ చేపట్టారు.3,57,298 రూ.లు వచ్చినట్లు తెలిపారు.కార్యక్రమంలో ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ లింబాద్రి,ఉపాధ్యక్షులు దయాకర్ రెడ్డి,పూజారులు ,భక్తులు తదితరులు పాల్గొన్నారు .
మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సుంకరి అశోక్ కళ్యాణి దంపతులు పూజలు నిర్వహించి 10,102 రూ.విరాళం అందజేశారు.
15, సెప్టెంబర్ 2026, మంగళవారం
శ్రీనివాస గిరి.. పాల్వంచ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో శ్రీనివాస కాలనీలోని శ్రీనివాస గిరి. పచ్చని కొండపై 600 అడుగుల ఎత్తులో వెంకటేశ్వర స్వామి శ్రీదేవి , భూదేవి సమేతంగా స్వయంభువుగా వెలిశారు. గుహలో కొలువైన స్వామిని 2 వేల మెట్లు ఎక్కి దర్శించుకోవాలి ఇది కాకతీయుల కాలం నాటి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. గుహలో తొలుత మట్టి నిండుకొని నీటి చుక్కలు పడుతూ ఉండేవి. ఓ సారి అడవికి వెళ్లిన వారు దాహార్తి తీర్చుకునేందుకు గుహ వైపు వెళ్లగా అక్కడ నీటి చుక్కలకు రాతి పై ఉన్న మట్టి కరిగి స్వామి వారి రూపం పాక్షికంగా కనిపించింది. కొంత మంది కలిసి గుహలో మట్టినంతా శుభ్రం చేశారు. అప్పటి నుంచి స్వామి వారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు.
ప్రతి శని వారం విశేష పూజలు నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఎత్తులో ఉన్న వెంకటేశ్వరుడిగా భాసిల్లుతున్న స్వామి వారి కళ్యాణ వేడుకకు ఏటా తెలంగాణ,ఏపీ ల నుండి భక్తులు భారీగా తరలి వస్తారు.కళ్యాణానికి పాల్వంచ తహసీల్దార్ ముత్యాల తలంబ్రాలు తీసుకు రావటం అనవాయితీ. మెట్ల మార్గంలో ఆంజనేయ స్వామి, అనంత పద్మనాభ స్వామి,దశావతారాలకు సంబంధించిన విగ్రహాలు కనిపిస్తాయి.
శ్రీకూర్మం పుణ్య క్షేత్రం..
దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మదించేందుకు సిద్ధమయ్యారు. ఆ ప్రయత్నంలో మందర పర్వతాన్ని కవ్వంగానూ , నాగ దేవత వాసుకిని కవ్వపు తాడుగానూ చేసుకున్నారు. ఓ శుభ ముహూర్తంలో సముద్ర మధనాన్ని ఆరంభించారు. కవ్వపు తాడును ఒక వైపు దేవతలు, మరో వైపు రాక్షసులు పట్టుకున్నారు. అలా చిలుతుంటే .. మందర పర్వతం సముద్రంలోకి జారి పోతుంది. దాంతో భయపడిన దేవతలు శ్రీ మహా విష్ణువును ప్రార్థించారు. అప్పుడు విష్ణువు తాబేలు రూపం ధరించాడు.
కూర్మ రూపంలో మందర గిరిని పైకెత్తి , తన వీపు మీద మోసి సముద్ర మధనానికి ఆటంకం కలగకుండా రక్షించాడు స్వామి. అప్పటి నుంచి ఆ లక్ష్మీ నాథుడు కూర్మ రూపంలోనూ పూజలందుకుంటున్నాడు.కూర్మావతారం భక్తుల పాలిట అభయావతారం . కంచెర్ల గోపన్న దాశరథీ శతకం లో విష్ణు భగవానుడు దాల్చిన కూర్మ రూపానికి అక్షరాంజలి ఘటిస్తూ కూర్మమై దరాధరము భరించితీవే కద దాశరథీ కరుణాపయోనిధీ .. అని స్మరించుకున్నాడు. అలాగే నరసింహ శతకంలో శేషప్ప కవి , గీత గోవిందంలో భక్త జయదేవుడు తదితరులు కూడా లక్ష్మీ నాథుడి కూర్మ లీలా విన్యాసాలను మనోహరంగా మననం చేసుకున్నారు.
ఆలయాల్లో ఆరాధనలు..
శ్రీ మహా విష్ణువును కూర్మావతారంలో ఆరాధించే ఆచారం ఉంది ,కాబట్టి ఆ రూపంలోనూ ఆలయాలున్నాయి.శ్రీకాకుళానికి 40 మైళ్ళ దూరంలో వంశధార తీరాన ఉన్న శాలి హుండం కొండకు ' కూర్మాద్రి ' అనే పేరు కూడా ఉంది ఆ జిల్లాలోనే శ్రీకూర్మం అనే పుణ్య క్షేత్రం వెలసింది అక్కడి ఆలయంలో స్వామి కూర్మ నాయకుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఆ దేవాలయంలో కూర్మ నాధుడు స్వయంభువుగా వెలయడం విశేషం. స్థల పురాణం అనుసరించి చంద్రవంశ మహా రాజైన శ్వేత చక్రవర్తికి ఆ శేష శయనుడు కూర్మ నాధుడిగా ప్రత్యక్ష మయ్యాడు.అలాగే శ్రీకూర్మం లో వెలసిన కూర్మ నాధుడిని కుశ లవులు, బల రాముడు దర్శించుకున్నట్లుగా కథలు ప్రచారంలో ఉన్నాయి.
బోధి సత్వుడే.. బుద్ధుడై..
బౌద్ధంలో ఒక క్రమ సాధన ఉంది. దాని ప్రకారం ఏళ్ల తరబడి ధ్యానం చేసిన వ్యక్తి బోధి సత్వుడవుతాడు. బోధి సత్వుడు పది దశలు దాటిన తర్వాత బుద్ధుడవుతాడు. మొదటి దశ ముదిత లో లోకంలో అందరికీ మంచి జరగాలనే సమ భావన కలుగుతుంది. రెండోది విమలత్వం . మూడో దశ లో మేధ తేజోవంతం అవుతుంది. నాలుగో దశలో ఆలోచనలు జ్ఞానోదయం వైపు వేగంగా సాగుతాయి. అజేయుడిగా మార్చేది ఐదో దశ. ఆరో దశలో విశ్వం ఆవిర్భావం గురించి తెలుసుకుంటాడు. ఏడో దశలో సంపూర్ణ జ్ఞాన వంతుడవుతాడు. ఎనిమిదో దశలో స్థిర చిత్తుడై అచలత్వాన్ని పొందుతాడు. స్థితప్రజ్ఞత కలుగుతుంది. అంటే లౌకిక విషయాలేవీ సాధకుని ప్రభావితం చేయలేవు. తొమ్మిదో దశలో సాధుమూర్తిగా అవతరిస్తాడు. ఎటు చూసినా కరుణ సాక్షాత్కరిస్తుంది. చివరి దశలో ధర్మ స్వరూపుడై బుద్ధుడిగా వెలుగొందుతాడు.
సృష్టి మొదలై అంతమవడాన్ని ఒక కల్పం అంటారు. అటువంటి కల్పాలు ఇప్పటి కి పది పూర్తయ్యాయి.. ప్రతి కల్పంలో కొంతమంది బుద్ధులు అవతరించారు. మనం ఇప్పుడు 11వది అయిన భద్ర కల్పంలో ఉన్నాము. ఈ కల్పంలో వైశాఖ పౌర్ణమి రోజున పుట్టిన 28 వ బుద్ధుడు సిద్ధార్థ గౌతముడు. ఇతడు 35 ఏళ్ల తర్వాత వైశాఖ పౌర్ణమి రోజున జ్ఞానోదయం పొందాడు. ఈ గౌతమ బుద్ధుడు లోకంలో దుఃఖము ఉందని ,ఆ దుఃఖానికి కారణము, దాన్నుంచి విముక్తికి మార్గము ఉన్నాయని తెలుసుకున్నాడు. అదే అష్టాంగ మార్గమని చెబుతూ నాలుగు పరమ సత్యాలను ప్రబోధించాడు. దుఃఖానికి కారణం కనుక్కుని దాన్ని ప్రజలకు తెలియజేయడం వల్ల ఈ గౌతమ బుద్ధుడు ఇతరుల కంటే విఖ్యాతుడు అయ్యాడు. కాకతాళీయంగా గౌతమ బుద్ధుడు వైశాఖ పౌర్ణమి రోజునే మహాపరి నిర్మాణం పొందాడు. అందుకే వైశాఖ పౌర్ణమి బుద్ధ పౌర్ణమి గా ప్రసిద్ధి పొందింది.
14, సెప్టెంబర్ 2026, సోమవారం
ముంబై గణేశుడికి 703 కోట్ల బీమా
ముంబైలోని కింగ్స్ సర్కిల్ లో జీ ఎస్ బీ ( గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ్) గణపతి విగ్రహం దేశంలోనే ఖరీదైనదిగా నిలిచింది. ఈ విగ్రహానికి 66 కిలోల బంగారం , 335 కిలోల వెండి , రత్నాలతో తయారు చేసిన ఆభరణాలను అలంకరించారు. రూ. 703.27 కోట్ల ఇన్సూరెన్స్ చేయించారు దీంతో దేశ వ్యాప్తంగా ఈ విగ్రహం గురించి చర్చ మొదలైంది. శని వారం నుంచే భక్తులు పెద్ద ఎత్తున దర్శనానికి వస్తున్నారు. జీ ఎస్ బీ వినాయక చవితి వేడుకలు దేశంలోనే అత్యంత వైభవంగా నిలుస్తున్నాయి . కేవలం ఆభరణాలే కాకుండా .. నిత్యం వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. నవరాత్రులు ఇక్కడ వేద సాంప్రదాయాలు , ఆచారాలు , భజనలు , కీర్తనలతో పాటు భక్తి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.
పుచ్చకాయపై గణేశుడు..
కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు తమలపాకుల సైదులు వినాయక చవితి సందర్భంగా ఆదివారం పుచ్చకాయపై 4 అంగుళాల వెడల్పు ,4 అంగుళాల పొడవు గల వినాయకుడి రూపం చెక్కారు.గతంలో చింత గింజలపై వినాయకుడు ,బియ్యపు గింజపై వినాయకుడి చిత్రం వేశారు.ఇలా ఎన్నో సూక్ష్మ కళా రూపాలు తయారు చేసి జాతీయ అంతర్జాతీయ రికార్డులను కైవసం చేసుకోవడం జరిగింది.
డివోషనల్ ఎక్స్పీరియన్స్ సెంటర్.. తిరుమల
క్యూలైన్లలో వైకుంఠ వైభవం.. భక్తులకు డివోషనల్ ఎక్స్పీరియన్స్ సెంటర్..
తిరుమల శ్రీవారి దర్శనానికి గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండే భక్తుల నిరీక్షణ సమయాన్ని వృధా పోనీయకుండా, వారిలో ఆధ్యాత్మిక చింతనను, ప్రశాంతతను కలిగించేందుకు టీటీడీ వినూత్న అడుగు వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాల్టీ తదితర ఆధ్యాత్మిక సాంకేతిక పరిజ్ఞానంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ లో నాలుగు కోట్ల రూపాయలతో డివోషనల్ ఎక్స్పీరియన్స్ సెంటర్/ హీలింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసింది.
తిరుమలేశుడి ఆలయ ప్రాకారాలు మిలమిల..
తిరుమలేశుడి ఆలయంలోని పురాతన మండపాలకు శాస్త్రీయ రసాయన సంరక్షణ పనులను పుణె కు చెందిన లార్డ్ వెంకటేశ్వర చారిటబుల్ అండ్ రెలీజియస్ ట్రస్ట్ ముందుకొచ్చి చేయిస్తోంది. మొదటి దశలో ఆలయానికి చెందిన ఉత్తర, పశ్చిమ, దక్షిణ వైపుల్లోని పై కప్పులు , స్తంభాలకు సంబంధించిన పనులను నిపుణులైన కార్మికులు పూర్తి చేశారు. మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. మైసూరు పురావస్తు శాఖ విశ్రాంత కెమిస్ట్ అంబేద్కర్ పర్యవేక్షణలో ఈ పనులు చేస్తున్నారు.
టీటీడీ కి కోటి రూపాయల విరాళం..
టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు బెంగళూరుకు చెందిన గిరియప్ప దయానంద రూ. 50 లక్షలు, శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టు కు 50 లక్షలు విరాళంగా అందించారు.
13, సెప్టెంబర్ 2026, ఆదివారం
పంచముఖ సంకట హర మహా గణపతి, ఖైరతాబాద్
ఖైరతాబాద్ లో దాదాపు 70 అడుగుల ఎత్తులో కొలువుతీరిన పంచముఖ సంకటహర మహాగణపతి పూజలు అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. శనివారం సాయంత్రం విగ్రహ ప్రధాన శిల్పి రాజేంద్రన్ భక్తుల కోలాహలం మధ్య వినాయకుడు విగ్రహానికి తుది మెరుగులు దిద్దారు . ఏటా ఉత్సవాలకు 45 రోజులు ముందుగానే విగ్రహాన్ని ప్రదర్శిస్తారు. ఏటా చవితికి రెండు రోజులు ముందు స్వామి వారి కంటికి తుది మెరుగులు దిద్దడం ఆనవాయితీగా వస్తోంది.
జూన్ 25న తొలి పూజలు చేయగా, ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోనే విగ్రహ ఏర్పాటు పనులు మొదలుపెట్టారు. విగ్రహం పూర్తి చేసేందుకు ఏటా దాదాపు మూడు నెలల వ్యవధి తీసుకుంటారు .ఈ ఏడాది రెండున్నర నెలలోనే విగ్రహం సిద్ధం చేశారు.
అబ్బాస్ ఖాన్ ఆధ్వర్యంలో 17 ఏళ్లుగా గణేష్ మండపం..
వినాయక చవితి ఉత్సవాల నిర్వహణలో ముంబైలోని కమాటిపుర ప్రాంతంలో గల పీపీ మార్గచా రాజా గణేష్ మండల్ కు 63 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ మండల్ కు గత 17 ఏళ్లుగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అబ్బాస్ ఖాన్ అధ్యక్షుడిగా కొనసాగుతుండడం విశేషం. హిందూ ముస్లిం తేడా లేకుండా అందరూ భారతీయులలా ఒక్కటై ఈ పండుగను వేడుకగా జరుపుకోవడం చాలా కాలంగా కొనసాగుతున్నట్లు వాలంటీర్ వికాస్ బేలదార్ తెలిపారు. గణపతి అప్పపై నాకున్న అపారమైన విశ్వాసంతోనే ఏటా ఈ వేడుకను నిర్వహించగలుగుతున్నాము. ఇవి రెండు మతాల సామరస్య సందేశం మాత్రమే కాదు, నిజానికి మేమంతా ప్రేమ సందేశం చాటుతున్నాము. ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఎంతో భక్తిశ్రద్ధలతో వినాయకుడిని ఆహ్వానిస్తాం అని అబ్బాస్ ఖాన్ తెలిపారు. ఈ ఉత్సవాలు జరిగే పది రోజులు తాము శాకాహారం భుజిస్తూ, సీర /రవ్వ కేసరి, చనా/ శనగలు ప్రసాదాన్ని ఇంటివద్ద సిద్ధం చేసి మండపానికి తీసుకొస్తామని అబ్బాస్ భార్య హసీనా ఖాన్ చెప్పారు.
జెండా బాలాజీ జాతర.. నిజామాబాద్..
కలియుగ దైవమైన గోవిందా శ్రీ శ్రీనివాస గోవిందా భక్తవత్సలా గోవిందా వడ్డీకాసులవాడా గోవిందా అంటూ భక్తులు శ్రీమన్నారాయణ స్వామిని వేడుకుంటూ దర్శించుకున్న అంతనే అండగా నిలిచే స్వామి జండా బాలాజీ వెంకటేశ్వర స్వామి. జెండా బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు సెప్టెంబర్ 12వ తేదీన శనివారం ప్రారంభమై 26వ తేదీ శనివారంతో ముగియనున్నాయి.
మహారాష్ట్రయులు ఎంతో భక్తిగా పిలుచుకొని బాలాజీ ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు . ప్రతి ఏటా భాద్రపద మాసంలో ప్రారంభమైన ఉత్సవాలు పౌర్ణమి వరకు సాగుతాయి. మొదటి రోజున వంశపారంపర్య అర్చకులు అజయ్ సాంగువాయి ఇంటి వద్ద పూజలు నిర్వహిస్తారు. నగరంలో వివిధ వీధుల్లో తిరిగి జెండా అర్ధరాత్రి స్థానిక జెండా గల్లీలో గల జెండా బాలాజీ ఆలయానికి చేరుకుంది. ఆలయంలో ప్రతిష్టించిన జెండాకు పది రోజుల పాటు భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లలేని భక్తులు జెండాను దర్శించుకున్నంతలోనే శ్రీనివాసుని సంపూర్ణ కటాక్షాలతో మన కోరికలు నెరవేరుతాయి అని భక్తుల నమ్మకము. భక్తులకు అభయహస్తాన్ని అందించిన జెండా బాలాజీ శ్రీనివాసుని దర్శించుకోవడానికి జిల్లా ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల భక్తులకు ఇలవేల్పుగా నిలిచారు. అధిక సంఖ్యలో ఊరేగింపులో భక్తులు పాల్గొననున్నారు .ఆలయ అర్చకులు వేద పండితులచే స్వామివారి ఉత్సవాలు నిర్వహిస్తారు. భక్తులు జెండా బాలాజీ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో కందర్ గ్రామంలో సాంగు వాయి వంశస్థులు జెండా బాలాజీని కొలిచేవారు .ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి వెంకటేశ్వర్లు దర్శించుకునే వాడు ఒకసారి స్వామీజీ కలలో కనిపించే నా భక్తులకు ఉత్సవ విగ్రహాలు ఇచ్చి తిరుమల కొండ దాటించమని ఆదేశించాడట .హౌసా విగ్రహాలను తీసుకొని ఇంటి దారి పట్టి వారం రోజులు అనంతరం నిజామాబాదులో రాత్రి విశ్రాంతికై నిలిచాడు .రాత్రి స్వామివారు స్వప్నంలో కనిపించి వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించమని చెప్పారని తెలుస్తోంది .అలా సాంగ్వాయి వంశం వారు జెండా బాలాజీ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం జెండా బాలాజీ ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కార్యనిర్వహణాధికారి శివరాత్రి ఆంజనేయులు కోరారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా జండా ఊరేగింపు ఉంటుందన్నారు. స్వామివారి జెండా ముందుండగా ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా పులాంగ్ బ్రిడ్జి వరకు తరలి వెళ్లి విశ్రాంతి విడిది చేయడంతో ఉత్సవ కార్యక్రమాలు ముగిస్తారు అని తెలిపారు. భక్తులు జండా ఊరేగింపులో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి అజయ్ సాంగువాయి కుటుంబ సభ్యులు జాలీగాసి గోపాల్ ,లవంగ ప్రమోద్ ,ఆలయ అర్చకులు నాగరాజు ,జూనియర్ అసిస్టెంట్ ప్రశాంత్ కుమార్ ,మోర సాయిలు, నర్సింగరావు ,ధర్మకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
































