పౌరాణిక కథనం ప్రకారం ఒకసారి లోకసంచారం చేస్తున్న నారదుడు వింధ్య పర్వతాన్ని ఉద్దేశించి నువ్వు అన్నింటిలో గొప్పదానివే కానీ ఎత్తులో మాత్రం మేరు పర్వతంతో తులతూవడం లేదు అన్నాడు. ఆ మాటలు విన్న వింధ్య పర్వతం పౌరుషంతో మేరు పర్వతాన్ని మించి పెరిగిపోసాగింది. దానితో ఆ పర్వతానికి దక్షిణ దిక్కున వెలుగు అంతరించి అంధకారమావరించింది. అక్కడి ఋషులు యజ్ఞ యాగాలు నిర్వర్తించలేక ఇబ్బంది పడుతూ దిక్కుతోచని స్థితిలో బ్రహ్మదేవుడిని వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మ .. వింధ్య పర్వతానికి గురువు అగస్త్య మహర్షి. కాశీలో నివసిస్తున్న ఆయనకు మీ వేదనను విన్నవించుకోండి అని సలహా ఇచ్చాడు.
బ్రహ్మ సలహాను అనుసరించి ఋషులు కాశీ వెళ్లి అగస్త్య మహాముని కలిశారు .అంతా విన్న ఆ మహర్షి వెంటనే బయలుదేరాడు. ఆయనను చూసిన వింధ్య పర్వతం వినయంగా శిరస్సు వంచి గురువుకు నమస్కరించింది. మహర్షి ఆశీర్వదించి నేను దక్షిణ దిక్కుకు పయనమై వెళుతున్నాను, తిరిగి వచ్చేవరకు ఇలాగే ఉండు అన్నాడు. వింధ్య పర్వతం అందుకు ఆనందంగా అంగీకరించింది. అలా వెళ్ళిన అగస్త్యుడు మరెన్నడూ తిరిగి రాలేదు. అక్కడే తన నివాసం ఏర్పరచుకున్నాడు. వింధ్యకు దక్షిణ దిక్కు వెలుగుతో నిండింది .ఋషుల సమస్య తీరింది. శిష్యుడు ఎంత గొప్పవాడైనా గరువుల ముందు తలవంచుతాడని బోధించే కథ ఇది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి