భారతీయ సంస్కృతిలో నాన్నే ఇంటి పెద్ద. పితృదేవోభవ అన్న ఉపనిషత్ వాక్యాన్ని అనుసరించే రామాయణ, భారత, భాగవతాలు అన్నీ కూడా తండ్రిని మహోన్నతంగా నిలుపుతాయి .ధర్మానికి, త్యాగానికి ప్రతీకగా చిత్రించాయి. ఒక్కమాటలో చెప్పాలంటే తండ్రి పిల్లలను తీర్చిదిచ్చే మహా శిల్పి ,కుటుంబ రథానికి సారథి..
తండ్రి స్వర్గం, ధర్మం, తపస్సు .తండ్రి సంతోషిస్తే సకల దేవతలు సంతోషిస్తారు అన్నది మహాభారతం తెలియజేసింది. కొడుకు తీర్చుకోవాల్సిన మూడు ప్రధాన రుణాల్లో పితృ రుణం మొదటిది. జన్మనిచ్చి, పోషించి, జ్ఞానాన్ని ప్రసాదించినందుకు.. తండ్రికి వృద్ధాప్యంలో సేవ చేసి వంశ కీర్తిని నిలబెట్టడమే పితృ రుణం తీర్చుకునే మార్గము .జన్మనిచ్చిన తండ్రితో పాటు మరికొందరినీ పితృ సమానులు అన్నారు.
కన్నతండ్రి, ఉపనయనం చేసిన వ్యక్తి ,విద్య నేర్పిన గురువు, అన్నదాత ,భయం నుంచి కాపాడిన వ్యక్తి.. ఈ ఐదుగురు తండ్రితో సమానమన్నారు. రామాయణ భారతాలు జన్మనిచ్చిన తండ్రికి ఎక్కువ ప్రాధాన్యమిస్తే.. పురాణాలు తండ్రి ఔన్నత్యాన్ని గౌరవిస్తూనే.. ధర్మం మరింత ముఖ్యమన్నాయి. ఉపనిషత్తులు కన్నతండ్రి కంటే జ్ఞాన ప్రదాత అయిన గురువుకు మొదటి స్థానాన్ని కల్పించాయి.
ధర్మం, త్యాగం, బాధ్యతలకు చిరునామాగా ఉన్న తండ్రి.. తన వ్యక్తిగత కోరికలను పక్కనపెట్టి సంతాన రక్షణ కోసం తపిస్తాడు. వారి అభివృద్ధి ,ఆధ్యాత్మిక వికాసం కోసం శ్రమిస్తాడు .అయితే అందుకు భిన్నంగా తమ స్వార్థం, వ్యామోహం, అహంకారాలతో ప్రవర్తించిన వారు కూడా ఉన్నారు. వాళ్ళు పుత్రుల వినాశనానికి కారణమై చెడ్డతండ్రులు గా చరిత్ర పుటలలో మిగిలిపోయారు.
దశరథుడు జనకుడు జనకుడు తమ సంతానం పట్ల అత్యంత వాత్సల్యం కలిగిన తండ్రి దశరథుడు ధర్మబద్ధంగా సంతానాన్ని తీర్చిదిద్దాడు సంతానంపై ఎంతో అనురాగం ఉన్నప్పటికీ సంతానమా ధర్మమా అన్న ప్రశ్న తలెత్తినప్పుడు ధర్మానికే ప్రాధాన్యం ఇచ్చాడు ప్రాణంగా ప్రేమించే రాముడు ఎడబాటు తట్టుకోలేక ప్రాణాలు విడిచిన దశరథుడు పుత్రవాత్సల్యానికి ప్రభలమైన నిదర్శనం తండ్రి చూపిన ధర్మ నిష్టను తన జీవన మార్గంగా మలుచుకున్న శ్రీరాముడు పితృ వాక్య పరిపాలనకు ఉదాహరణగా నిలిచి ఇంద్ర ఉన్నత్యాన్ని లోకానికి చాటాడు భూమిలో లభించిన సీతను కన్న బిడ్డ కంటే ఎక్కువగా ప్రేమించి సకల విద్యాబుద్ధులు నేర్పి చక్కటి సంస్కారంతో పెంచి పెద్ద చేసిన ఉత్తమ తండ్రి జనక మహారాజు సీత పుట్టిల్లు అనగానే తండ్రి అయిన జనకుడు తప్పితే పెంచిన తల్లి ఎవరో కూడా గుర్తుకురానంత వాత్సల్యాన్ని చూపాడు జనకుడు
కణ్వుడు.. శంతనుడు..
విశ్వామిత్రుని తపస్సును భంగం చేసేందుకు వచ్చిన మేనక తన పని పూర్తవగానే పుట్టిన శిశువును వదిలి వెళ్ళిపోయింది .ఆ బిడ్డకు శకుంతల అని పేరు పెట్టి అక్కున చేర్చుకున్నాడు కణ్వ మహర్షి. పెంచడమే కాదు విద్యాబుద్ధులు నేర్పి ధర్మ నిరతగా తీర్చిదిద్దిన అపూర్వ తండ్రి. అతడు ఎంత స్థిత ప్రజ్ఞుడైనా అత్తవారింటికి వెళ్తున్న అనుంగు బిడ్డను వదల లేక కన్నీరు పెట్టుకున్న కరుణామూర్తి కణ్వుడు.
ఇంద్రుని ఆజ్ఞ మేరకు జనపది అనే అప్సరస శరత్వంతుని ద్వారా కవలలకు జన్మనిచ్చి అడవిలో వదిలి వెళ్ళింది. వేటకు వచ్చిన శంతనుడు ఆ పిల్లలను తీసుకువెళ్లి కృప, కృపి అని నామకరణం చేసి విద్యాబుద్ధులు నేర్పించాడు. తండ్రిగా వారినెలా తీర్చిదిద్దాడంటే కృపాచార్యుడు కురువంశానికి విద్యా గురువుగా.. కృపి ద్రోణాచార్యుని భార్యగా భాసిల్లారు.
వసుదేవుడు.. నందుడు ..
శ్రీకృష్ణుడిని కన్న తండ్రి వసుదేవుడు. పెంచిన తండ్రి నందుడు. ఇద్దరు ఉత్తమ పితృ మూర్తులే. శత్రువు ఇంట జన్మించిన కన్న బిడ్డను కంసుని క్రూరత్వం నుంచి కాపాడడానికి ప్రాణాలకు తెగించి అర్ధరాత్రి ఉప్పొంగుతున్న యమునను దాటి గోకులానికి చేర్చాడు వసుదేవుడు. పెంపుడు తండ్రి అయిన నందుడు శ్రీకృష్ణుడిని అపార వాత్సల్యం తో పెంచాడు. ఈ ఇద్దరు తండ్రులు ..రక్షణ, పోషణ అనే పితృ ధర్మాలకు ఉదాహరణలుగా నిలిచారు. వారిద్దరి సంస్కారాన్ని పునికి పుచ్చుకున్న శ్రీకృష్ణుడు తన సంతానాన్నే కాక మనవాణ్ణి కూడా రక్షించాడు. ప్రద్యుమ్నుడి కుమారుడైన అనిరుద్రుడిని బాణాసురుడు బంధించగా.. ప్రద్యుమ్నుడితో కలిసి యుద్ధం చేశాడు. తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ తన బిడ్డతోను తండ్రి బాధ్యతను నిర్వర్తింప చేశాడు శ్రీకృష్ణుడు.
హిరణ్యకశిపుడు ధృతరాష్ట్రుడు..
అహంకారం, వ్యామోహం కారణంగా సంతానాన్ని హింసించడమే కాకుండా స్వీయ పతనానికి, సమాజ వినాశనానికి కారకులైన తండ్రులు కూడా ఉన్నారు. తనకున్న విష్ణు ద్వేషంతో ధర్మాత్ముడైన సొంత బిడ్డపైనే హత్య ప్రయత్నాలు చేసిన అధమ తండ్రి హిరణ్యకశిపుడు. దుర్యోధనుడి అధర్మ ప్రవర్తనను నివారించగలిగిన స్థితిలో ఉండి కూడా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్న అందతండ్రి ధృతరాష్ట్రుడు. అతడు జాత్యందుడే కాదు మొహందుడు కూడా అయ్యాడు. అటు హిరణ్యకశిపునికి భార్య లీలావతి, ఇటు ధృతరాష్ట్రునికి తండ్రి వ్యాసుడు నచ్చ చెప్పినప్పటికీ ఇద్దరూ వినలేదు. దుష్ట తండ్రులకు నిదర్శనంగా నిలిచిపోయారు. జనకుడు ,దశరథుడు, వసుదేవుడు వంటి వారి త్యాగం, బాధ్యత లోక కళ్యాణానికి దారితీస్తే.. శంతనుడు, యయాతి వంటి వారి స్వార్థం తమ సంతానాన్ని కష్టాలపాలు చేసింది. అలానే హిరణ్యకశిపుడు, ధృతరాష్ట్రుడు వంటి అధర్మ తండ్రుల అహంకారం, వ్యామోహం ,బాధ్యత రాహిత్యం వంశ పతనానికి, లోక వినాశనానికి దారితీసింది. జన్మనివ్వడమే పితృత్వం కాదు ,సంతానాన్ని రక్షించడం, పోషించడమే కాక జ్ఞానాన్ని, నైతిక శీలాన్ని అందించాలి. అటు కుటుంబానికి ఇటు సమాజానికి ఆదర్శంగా ధర్మ పరిరక్షకులుగా తీర్చిదిద్దాలి. అదే నిజమైన పితృత్వానికి నిదర్శనం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి