జనసంద్రంలో మహా జాతర. నేడు దేవతల వన ప్రవేశం. చివరి అంకానికి చేరిన మహోత్సవం.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర శుక్రవారం కోలాహారంగా జరిగింది. జాతరలో మూడో రోజు దేవతలను గద్దెలపై కొలువు తీరడంతో భక్తకోటి దర్శనాలకు బారులు తీరారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసి తల్లుల దర్శనానికి తరలివచ్చారు. మరోవైపు పెద్ద సంఖ్యలో ప్రముఖులు కూడా రావడంతో సాధారణ దర్శనానికి రెండు నుంచి ఐదు గంటల సమయం పట్టింది. శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకుని ఎత్తు బంగారాల మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రైవేటు వాహనాలు మేడారానికి రావడంతో ములుగు జిల్లా తడువాయి మేడారం మధ్యలో సాయంత్రం ట్రాఫిక్ స్తంభించింది. శనివారం పౌర్ణమి కావడం, జాతర తుది ఘట్టానికి చేరను ఉండడంతో భక్తులు భారీ సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నారు. సమ్మక్క సారలమ్మ పగిడిద్ద రాజు, గోవిందరాజులను గద్దెలపై నుంచి ఆదివాసి పూజారులు వారి వారి ఆలయాలకు తీసుకెళ్ళనున్నారు. సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమ భరిణతో సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజారులు వన ప్రవేశం చేయడంతో జాతర ముగియనుంది .అమ్మలను దర్శించుకున్న భక్తకోటి మేడారంలో సమ్మక్క సారలమ్మలను శుక్రవారం రాత్రి వరకు ఒక కోటి 20 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. సాయంత్రం గద్దెల వద్ద భక్తు ల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఆమె మంచె పై ఎక్కి అక్కడి నుంచి భక్తులకు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత నెల రోజుల నుంచి జాతర ముందు వరకు 50 లక్షల మంది జాతర సమయంలో 70 లక్షల మంది భక్తులు అమ్మలను దర్శించుకున్నారని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. ఇంత పెద్ద జాతరను కేంద్రం కుంభమేళాకు సమానంగా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు .శుక్రవారం అమ్మలను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి వచ్చే జాతరకు కావలసిన సదుపాయాలకు ఇప్పటినుంచే ప్రణాళిక రూపొందించాలని సూచించినట్లు ఆమె వెల్లడించారు. జాతర ముగిసిన వెంటనే మేడారంలో అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసి సీఎం ద్వారా రాహుల్ గాంధీ కి అంది స్తామని వివరించారు.
No comments:
Post a Comment