బంజారా జాతిలో భగవత్ స్వరూపునిగా, అవతార పురుషునిగా, సామాజిక క్రాంతి వీరుడుగా పూజింపబడుతున్న వారు శ్రీ సంత్ లేవా సేవాలాల్ మహారాజ్. బంజారాజాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింస సిద్ధాంతానికి పునాది వేసిన మహోన్నత వ్యక్తి ఆయన. మధ్యయుగంలో బంజారా లు ఉత్తర, మధ్య భారతాల నుంచి దక్షిణ భారతదేశ వైపుకు పశువులను మేపుకుంటూ వలస వచ్చారంటారు .రమావతి రాంజీనాయక్ 360 కుటుంబాలతో పాటు 3775 గోవులతో కర్ణాటక రాష్ట్రంలోని గుత్తి గ్రామానికి అలా చేరుకున్నవారే. అనంతపురం అప్పట్లో కర్ణాటక పరిధిలోనే ఉంది .అక్కడ గొల్లయ్య దొడ్డిలో నివాసమేర్పరచుకున్నారు .ఆయన జన్మించిన ఈ ప్రాంతంలోనే 2000 సంవత్సరం తర్వాత సేవాగడ్ మందిరం నిర్మించి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ కు పూజలు నిర్వహిస్తున్నారు. రాంజీ నాయక్ కు ముగ్గురు కుమారులు కాగా పెద్ద కుమారుడు భీమా నాయక్ కు కర్ణాటకలోని ధర్మినీ బాయ్ తో వివాహం జరిగింది. పిల్లలు లేని ఆ దంపతులు తమ ఏడుగురు దేవతలను మొక్కారు. ఇందులో మేరా మాయాడి అంశతో 1739 ఫిబ్రవరి 15న ఆ దంపతులకు రమావత్ సంత్ సేవాలాల్ మహారాజ్ జన్మించారని ఓ కథ ప్రచారంలో ఉంది. ఈయన గోర్ బంజారాలను సంస్కరించడానికి ఎంతో కృషి చేశారు. ఆయన కాలంలోనే గుత్తిలో నివసిస్తున్న గోర్ బంజారా కుటుంబాలు గోవులతో తిరుపతికి పయనమయ్యాయి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి రాయచూరు మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు.
బంజారాల సంఘసంస్కర్త సేవాలాల్ ధైర్య సాహసాలను, ఆధ్యాత్మిక శక్తిని తెలుసుకున్న హైదరాబాద్ నిజాం నవాబు ఆయనను ఆహ్వానించి మహారాజ్ గంజ్ ,బంజారా హిల్స్ ప్రాంతాలను బహుమానంగా ఇచ్చారని లంబాడా గిరిజన పెద్దలు చెబుతారు. పాహరా గడ్ ప్రాంతంలో స్థిరనివాసం ఏర్పరచుకొని బంజారాలను సంస్కరించే బోధనలను కొనసాగించారు సంత్ సేవాలాల్ మహారాజ్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి